అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వార్తల్లో లేనిరోజు లేదు. ఇందులో దాదాపు అన్ని వివాదాలే. ఏదొక దేశాన్ని గిల్లడం, లేకపోతే కవ్వించడం, హెచ్చరించడం, ఇవే ట్రంప్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత కనిపిస్తున్న పరిణామాలు. ఇటీవల కాలంలో ట్రంప్ దూకుడు మరింత ఎక్కువైంది. వెనెజువెలా అధ్యక్షుడిని బంధించడం, అటు తర్వాత ఆ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిని నేనే అని ప్రకటించుకోవడం.. డెన్మార్క్ దేశంలో ఉన్న గ్రీన్‌లాండ్‌ను ఏదో రకంగా స్వాధీనం చేసుకోవాలనే పన్నాగం, క్యూబాకు వార్నింగ్.. ఇరాన్‌పై కాలుదువ్వడం వంటి జరుగుతూనే ఉన్నాయి.
అయితే వీటన్నింటి కంటే కూడా నాటోను దాదాపు దూరం పెట్టడం.. రష్యాను రెచ్చగొట్టడం అయితే ట్రంప్ పోకడలకు మరో మెట్ట అని చెప్పాలి. రష్యాకు చెందిన రెండు ఓడలను ట్రంప్ సీజ్ చేయడం చూస్తే మాత్రం యుద్ధానికి కాలుదువ్వడం గానే కన్పించింది. ఎన్నో దేశాల మధ్య యుద్ధాలు ఆపానని చెప్పుకునే ట్రంప్.. ఇప్పుడు పలు దేశాలతో కయ్యానికి సై అంటున్నాడు. అందులో సైనిక పరంగా బలంగా ఉన్న రష్యా, ఇరాన్‌ల విషయంలో కూడా ట్రంప్ వ్యవహరిస్తున్న శైలి అయోమయంలో పడేస్తుంది.
రష్యాను టెస్టు చేస్తున్నాడా?
రష్యా ఆర్థిక శక్తి తగ్గిందనే గణాంకాలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఇప్పుడు దానిపై దృష్టి పెట్టాడు. అసలు రష్యా పవర్ ఎంత ఉంది అనే దానిని టెస్ట్ చేయడం కోసం ట్రంప్ సన్నాయి నొక్కులు ప్రారంభించాడు. అయితే సైనిక పరంగా చూస్తే రష్యా ఇప్పటికే టాప్-2లో ఉంది. అసాధారణ సైనిక శక్తి కల్గిన దేశాల్లో రష్యాది రెండో స్థానం. 3,570,000 మంది మిలటరీ సిబ్బంది, 5, 750 యుద్ధ ట్యాంకర్లు రష్యా సొంతం. విస్తృతమైన యుద్ధ ట్యాంకర్ల దళం, అణ్వాయుధాలు కల్గి ఉంది రష్యా. అణు సామాగ్రిని వివిధ దేశాలకు సరఫరా చేసే దేశాల్లో రష్యా కీలక పాత్ర పోషిస్తుంది.
అయితే ఇటీవల రష్యా ఆయిల్ షిప్‌లను సీజ్ చేసి.. ఆ దేశాన్ని రెచ్చగొట్టే పనిలో ఉన్నాడు ట్రంప్. రష్యా.. తమతో పోరుకు ఎంతవరకూ వస్తుందని టెస్ట్ చేస్తన్నట్లే ఉంది ట్రంప్ వైఖరి. మరి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ట్రంప్ చర్యలని గమనిస్తూనే ఉన్నాడు. పరిస్థితి శ్రుతి మించితే మాత్రం రష్యా వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. తన సహనాన్ని ట్రంప్ పరిక్షీస్తున్నారనే విషయం పుతిన్ ఈపాటికే అర్థం చేసుకునే ఉంటారు. ఒకవేళ అమెరికా ఏమైనా సైనిక చర్యలకు పాల్పడితే మాత్రం దాన్నితిప్పి కొట్టే సామర్థ్యం రష్యాకు ఉంది.. కానీ ఆ దేశ ఆర్థిక పరిస్థితే ఇప్పుడు పుతిన్‌ను కలవర పెడుతోంది. తమ దేశానికి చెందిన రెండు చమురు షిప్‌లను అమెరికా సీజ్ చేసినా.. పుతిన్ నియంత్రణ కోల్పోకుండా ఆచితూచి అడుగులు వేయడానికి కారణం ఆ దేశ ఆర్థిక పరిస్థితి.
బలహీన పడ్డ రష్యా ఆర్థిక వ్యవస్థ
2022లో ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమయ్యాక.. సైన్యంలో నియామకాలు, ప్రిగోజిన్ నేతృత్వంలోని వాగ్నర్ వంటి కిరాయి సేనల కోసం డబ్బు వెచ్చించాల్సి వచ్చింది. ఒక సంవత్సరం వరకు పరిస్థితులను నియంత్రించుకుంటూ.. ఆర్థిక వ్యవస్థ గాడిలోనే ఉందనిపించినా.. 2023 నుంచి నియంత్రణ కోల్పోయి.. 2024 వచ్చే సరికి అది కాస్తా ముదిరి పాకాన పడింది. చమురు ఎగుమతులపై ఆశలు పెట్టుకున్నా.. ధరలు పడిపోయాయి. అమెరికా ఆంక్షలతో పలు దేశాలు రష్యా చమురు కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నాయి. ఇలా రష్యా ఇరకాటంలో పడింది.
వాహనాలు, ఇతరత్రా ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు.. చివరకు వోడ్కాపైనా పన్నులను పెంచుతూ పరిస్థితిని నియంత్రించేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గోరుచుట్టుపై రోకటిపోటు మాదిరిగా ఇప్పుడు ఐరోపా దేశాలు కూడా రష్యాపై ఆంక్షలను కఠినతరం చేశాయి.
భారత్‌పై ఆంక్షలు కూడా అందుకేనా?
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి దేశాల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. అత్యధిక చమురును భారత్.. రష్యా నుంచే కొనుగోలు చేస్తూ వస్తుంది. కానీ ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలును కాస్త తగ్గించింది. ఇలా రష్యా చమురును కొనుగోలు చేయకుండా పలు దేశాలపై ఆంక్షలు విధిస్తే ట్రంప్ అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. రష్యాను ఆర్థికంగా మరింత ఇరకాటంలో పడేయాలనేది ట్రంప్ చర్యలను బట్టి తెలుస్తోంది,
నాటో దేశాలు అంత బలంగా లేవా?
ఇటీవల నాటోపై తీవ్ర విమర్శలు చేశారు ట్రంప్. ప్రధానంగా నాటో రక్షణ వ్యయానికి సంబంధించి ఖర్చును అమెరికానే భరించాల్సి వస్తుందని, తమకు ఇక పని లేదని తేల్చిచెప్పేశాడు. అంటే నాటోలో బలమైన దేశాలు లేవనేది ట్రంప్ ఉద్దేశం. నాటోతో ఉన్నా లేకపోయినా తమకు ఏమీ ప్రయోజనం లేదనే భావనకు వచ్చేశాడు ట్రంప్..దాంతో నాటోకు టాటా-బైబై చెప్పేశాడు. నాటోలో యూరప్ దేశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే రష్యా చర్యలను ఎక్కువగా వ్యతిరేకించింది నాటో. ఇప్పుడు నాటోక అమెరికా దూరం అయిపోతే.. మరి వారి పరిస్థితి ఏమిటి.? చెప్పుకోవడానికే 32 దేశాలు.. అందులో 30 యూరప్ దేశాలు.. మిగతా రెండు అమెరికా, కెనడా. ఇప్పుడు అమెరికా దూరం జరగడంతో ఆ సంఖ్య 31కు వచ్చింది. నాటో ఉన్న యూరప్ దేశాలన్ని ఆర్థికంగా సైనిక పరంగా అంతగా బలంగా లేవనే విషయం ట్రంప్ కటీఫ్‌తోనే అర్థమైంది.
ట్రంప్ వ్యూహంలో భాగమా..?
అమెరికా అండ లేకపోవడంతో రష్యా ఏదొక సమయంలో నాటోపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని నాటో దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రష్యాతో యుద్ధం నేపథ్యంలోనే ఉక్రెయిన్ నాటోలో చేరడానికి కారణమైంది. ఇవన్నీ కూడా పుతిన్‌కు ఆగ్రహం తెప్పించాయి. తనకు నాటో అడ్డుపడింది అనే భావనలో ఉన్నాడు ట్రంప్.
ఈ పరిణామాలతో రష్యా-నాటో దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. అత్యంత స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు వెళుతున్న ట్రంప్.. ముందుగా నాటో దేశాలు-రష్యా కొట్టుకుంటే చూద్దామనే ప్లాన్‌లో భాగంగానే నాటోకి బైబై చెప్పడం, రష్యాను గిల్లడం చేస్తున్నాడని నిపుణులు అంటున్నారు. తన చర్యలతో ముందు నాటో-రష్యాలను అంచనావేసే ముందస్తు వ్యూహంలో భాగంగానే ట్రంప్ ఇలా చేశారనేది విశ్లేషకులు అభిప్రాయంగా ఉంది.


