
పారిస్: ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికొలస్ సర్కోజీకి అక్రమ నిధుల కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడింది. పారిస్‌లోని న్యాయస్థానం ఆయనను దోషిగా తేల్చింది. 2007లో అధ్యక్ష ఎన్నికల సమయంలో లిబియాకు చెందిన గడాఫీ నేతృత్వంలోని ప్రభుత్వ నుండి సర్కోజీ అక్రమంగా భారీగా నిధులు స్వీకరించారనే ఆరోపణల దరిమిలా నమోదైన ఈ కేసు కోర్టులో నడుస్తోంది. కేసులోని కొన్ని అభియోగాలనను కొట్టివేయగా, ఒకదానిలో నికొలస్ సర్కోజీని దోషిగా నిర్థారించిన న్యాయస్థానం ఆయనకు శిక్షను ఖరారు చేసింది.
సర్కోజీకి జైలు శిక్షను తప్పనిసరిగా అమలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే, జైలుకు వెళ్లే తేదీపై నిర్ణయాన్ని మాత్రం తరువాత వెల్లడిస్తామని న్యాయస్థానం తెలిపింది. నికొలస్ సర్కోజీ 2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్ అధ్యక్షునిగా పనిచేశారు. అయితే అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో గడాఫీ నేతృత్వంలోని లిబియా ప్రభుత్వం నుండి వచ్చిన ఆర్థిక సాయంపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నిధులను దౌత్య సహాయంగా చెప్పకుండా స్వీకరించారని, అవి తన ఎన్నికల ప్రచారానికి ఉపయోగించినట్లు పలువురు ఆరోపించారు. అవినీతి, ప్రచారానికి అక్రమ నిధుల వినియోగం, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం తదితర ఆరోపణలు రుజువు కానప్పటికీ.. నేరపూరిత కుట్రలో సర్కోజీని న్యాయస్థానం దోషిగా ప్రకటించి, ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.
ఈ కేసులో నేరపూరిత కుట్రకు సంబంధించిన అభియోగాన్ని మాత్రమే న్యాయస్థానం ఖరారు చేసింది. తీర్పు వెలువడిన సమయంలో మాజీ అధ్యక్షుడు నికొలస్ సర్కోజీ సహా ఆయన కుటుంబ సభ్యులు కోర్టు రూమ్‌లోనే ఉన్నారు. ఈ కేసు విచారణలో సర్కోజీ ప్రభుత్వంలోని ఇద్దరు మాజీ మంత్రులను కూడా కోర్టు దోషులుగా తేల్చింది. ఎన్నికల ప్రచారం కోసం లిబియా నుంచి నిధులు సమకూర్చేందుకు వీరు సంయుక్తంగా కుట్ర పన్నారని న్యాయస్థానం తెలిపింది. కాగా గతంలో అవినీతికి సంబంధించిన మరో కేసులో కూడా సర్కోజీకి జైలు శిక్ష పడింది.