
గాజా: యుద్ధంతో అట్టుడికిపోతున్న గాజాలో దుర్భర పరిస్థితులు తాండవిస్తున్నాయి. అక్కడి ప్రజలు సహాయం కోసం నిరంతరం ఎదురు చూస్తున్నారు. ఆహార కొరత, ఉద్యోగాలు కనుమరుగు కావడం లాంటివి ఇక్కడి జనాభాను తీవ్రంగా కుంగదీశాయి. దీనిని అనువుగా మలచుకున్న కొందరు పురుషులు సహాయం మాటున లైంగిక దోపిడీకి పాల్పడుతున్నారని స్థానిక మహిళలు చెబుతున్నారు.
ఆరుగురు పిల్లల కోసం..
దక్షిణ గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యునిస్‌లోని ఛారిటీ కిచెన్ నుండి ఆహారాన్ని అందుకునేందుకు ఎదురుచూస్తున్న మహిళలు తమ దుర్భర స్థితిని ‘అసోసియేటెడ్ ప్రెస్’ ముందు వెళ్లగక్కారు. తన ఆరుగురు పిల్లలకు ఆహారం అందించేందుకు వారాల తరబడి ఎదురు చూశానని 38 ఏళ్ల ఒక తల్లి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించింది. ఒక వ్యక్తి తనకు సేవా సంస్థలో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చాడని, తరువాత అతను ఒక ఖాళీ అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లాడని తెలిపింది. దీంతో తాను అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని అనుకున్నానని, అయితే తాను ఆహారం కోసం అతను చెప్పినట్లు చేయల్సి వచ్చిందని తెలిపారు. తరువాత అతను కొంత నగదు, ఆహారం ఇచ్చాడని, దీంతో పిల్లల ఆకలి తీర్చానని ఆమె వివరించింది. అయితే అతను చెప్పినట్లు ఉద్యోగం ఇవ్వలేదని పేర్కొంది. ఆహారానికి బదులుగా కొందరు పురుషులు లైంగిక దోపిడీకి ఎలా పాల్పడుతున్నారనే దానికి ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది.
సర్వసాధారణంగా లైంగిక దోపిడీ
గాజాలో సహాయం అందిస్తున్న సంఘాలు మానవ హక్కుల న్యాయవాదులు ఇటువంటి ఘటనలు ఇక్కడ సర్వసాధారణంగా మారిపోయాయన్నారు. దక్షిణ సూడాన్ నుండి హైతీ వరకు యుద్ధ భూముల్లో ఇలాంటివి నిత్యం కనిపిస్తున్నాయన్నారు. మానవతా సంక్షోభాలు ప్రజలను అనేక విధాలుగా దుర్బలంగా మారుస్తాయనేది భయంకరమైన వాస్తవమని హ్యూమన్ రైట్స్ వాచ్‌లోని మహిళా హక్కుల విభాగం అసోసియేట్ డైరెక్టర్ హీథర్ బార్ పేర్కొన్నారు. గాజాలో మహిళలు, బాలికలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నారు. సహాయం అందుకునే నేపధ్యంలో లైంగిక దోపిడీకి గురైన కొందరు మహిళలకు చికిత్స చేసినట్లు పాలస్తీనియన్ మనస్తత్వవేత్తలు తెలిపారు. లైంగిక దోపిడీకి గురైన మహిళల్లో కొందరు గర్భవతులయ్యారన్నారు.
పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులు
35 ఏళ్ల ఒక వితంతువువు ఒకరు మీడియాతో మాట్లాడుతూ సహాయక స్థలంలో యూనిఫాంలో ఉన్న ఒక వ్యక్తి తనకు ఒక నంబర్ ఇచ్చి, అర్థరాత్రి ఫోన్ చేశాడని తెలిపారు. దీనిపై తాను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, వారు కాల్ రికార్డింగ్స్ అవసరమని చెప్పారని, తాను వాటిని అందించలేకపోయానని ఆమె తెలిపింది. కాగా గత ఏడాది గాజాలో 18 లైంగిక వేధింపుల ఆరోపణలను నమోదు చేసినట్లు పీఎస్‌ఈఏ నెట్‌వర్క్ తెలిపింది. మరో ఉదంతంలో 29 ఏళ్ల ఒక తల్లి తన నలుగురు పిల్లలకు ఆహారం అందించేందుకు బదులుగా ఒక సహాయ కార్యకర్త తనను వివాహం చేసుకోవాలని వేధించాడని ఆరోపించింది. తాను అందుకు నిరాకరించానని పేర్కొంది.