కువైట్: కువైట్ సెంట్రల్ జైలులో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో ఓ పోలీసు అధికారి మృతి చెందాడు. మృతుడిని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ కరెక్షనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కు చెందిన కల్నల్ సౌద్ అల్-ఖమ్సన్‌గా గుర్తించారు.
భవనంలో ఫర్నిచర్, తివాచీల మారుస్తున్న సమయంలో సంభవించిన షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఆరుగురు గాయపడ్డారు.
అగ్నిప్రమాదం జరిగిన వెంటనే జైలు సిబ్బంది, అగ్నిమాపక బృందాలు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టాయి. మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నంలో కల్నల్ సౌద్ అల్-ఖమ్సన్ తీవ్రంగా గాయపడగా, ఆస్పత్రికి తరలించేలోపే ఆయన మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన ఆరుగురికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. భవనంలో భద్రతా ప్రమాణాలు, విద్యుత్ వ్యవస్థ నిర్వహణపై సమగ్ర దర్యాప్తు జరపనున్నారు. మృత పోలీసు అధికారికి ఉన్నతాధికారులు, సహచరులు సంతాపం తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.


