
లండన్: హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ను అడ్డుకునే సూదిమందు ‘లెనకపవిర్’కు యూరోపియన్ యూనియన్ (ఈయూ)కు చెందిన మెడిసిన్స్ ఏజెన్సీ ఆమోదం తెలిపింది. ఏడాదిలో రెండు పర్యాయాలు తీసుకునే ఈ ఔషధం వైరస్ వ్యాప్తిని నివారించడంలో సాయపడుతుందని పేర్కొంది. యూరప్‌లో దీనిని యెయ్‌టువో అనే పేరుతో గిలియడ్ సైన్సెస్ విక్రయాలు జరుపుతుంది. దీంతో ఈయూలోని 27 సభ్య దేశాలతోపాటు ఐస్‌ల్యాండ్, నార్వే, లీచిన్‌స్టెయిన్‌ల్లోనూ ఇది అందుబాటులోకి వస్తుంది.
లెనకపవిర్‌తో హెచ్‌ఐవీ బాధిత మహిళలు, పురుషులకు చికిత్స చేయగా 100 శాతం ప్రభావవంతంగా పనిచేసినట్లు గతేడాది చేపట్టిన అధ్యయనంలో తేలింది. హెచ్‌ఐవీ మహమ్మారిని తరిమికొట్టడంలో లెనకపిర్ కీలక మలుపుగా మారనుందని ఐరాస ఎయిడ్స్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విన్నీ తెలిపారు. జూన్‌లో అమెరికా ప్రభుత్వ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సైతం లెనకపవిర్‌ను ఆమోదించింది.
ఐరాస ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్‌ఐవీ వైరస్ నివారణలో లెనకపవిర్ ఎంతో సహాయకారికానుందని పేర్కొంది. ఒకసారి ఈ సూది మందు తీసుకుంటే ఆరు నెల్లపాటు హెచ్‌ఐవీ సోకకుండా ఆపగలుగుతుంది. కాగా, లెనకపవిర్‌ను తక్కువ ధరలో హెచ్‌ఐవీ కేసులు తీవ్రంగా ఉండే ఆఫ్రికా, ఆసియా, కరీబియన్ ప్రాంతాల్లోని 120 పేద దేశాలకు సరఫరా చేస్తామని గిలియడ్ సైన్సెస్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల హెచ్‌ఐవీ బాధితులుండగా 2024లో సుమారు 6.30 లక్షల మంది చనిపోయినట్లు అంచనా.