breaking news
Injectable medications
-
కండల కోసం ఆరోగ్యం పణం!
సాక్షి, సిటీబ్యూరో: వైద్య రంగంలో అత్యవసర సమయాల్లో వినియోగించే ఇంజెక్షన్లను స్టెరాయిడ్స్‌గా విక్రయిస్తున్న ముఠా గుట్టును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. కొందరు యువకులు తక్కువ కాలంలోనే ఎక్కువ కండలు పెంచేందుకు వీటిని వినియోగిస్తున్నట్లు గుర్తించారు. జిమ్‌లలో అత్యధిక సమయం గడపటానికి స్టెరాయిడ్‌గా ఈ మందులు తీసుకుంటూ తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారని టాస్క్‌ఫోర్స్ డీసీపీ ఎస్.రష్మి పెరుమాళ్ తెలిపారు. మంగళవారం ప్రకటించారు. నలుగురు నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేశామని, వీరి నుంచి భారీగా ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయంలో అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మంగళ్‌హట్‌కు చెందిన నితేష్ సింగ్ ఆసిఫ్‌నగర్‌లో పల్స్ ఫిట్నెస్ సెంటర్ పేరుతో జిమ్ నిర్వహిస్తున్నాడు. ఇందులో టప్పాచబుత్రకు చెందిన సయ్యద్ జఫ్ఫార్ అలీ రిసెప్షనిస్ట్‌గా రాహుల్ సింగ్ జిమ్ ట్రైనర్‌గా పని చేస్తున్నారు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం వీరు ముగ్గురు స్టెరాయిడ్స్‌ను జిమ్‌కు వచ్చే యువతకు సరఫరా చేయాలని పథకం వేశారు. ఇండియా మార్ట్ యాప్ ద్వారా ముంబైకి చెందిన కండివలీ కునాల్ నుంచి మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు ఖరీదు చేస్తున్నాడు. ఒక్కో ఇంజెక్షన్‌కు రూ.500 వసూలు చేస్తున్న అతడు కొరియర్ ద్వారా పంపిస్తున్నాడు. తమ జిమ్‌కు వస్తున్న యువత నిర్ణీత బరువు కంటే ఎక్కువ వెయిట్స్ ఎత్తడానికి, ఎక్కువ సమయం వ్యాయామం చేయడానికి స్టెరాయిడ్‌గా వాడటానికి వీటికి విక్రయిస్తున్నారు. ఒక్కో ఇంజెక్షన్ రూ.2000 వరకు అమ్ముతున్నారు. నిబంధనల ప్రకారం వీటిని కేవలం మెడికల్ షాపులు, వైద్యుడి చీటీ ఆధారంగానే విక్రయించాలి. అయితే వీరు ముగ్గురూ వీటిని అక్రమంగా సేకరించి తమ జిమ్‌లో అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ షేక్ జకీర్ హుస్సేన్ నేతృత్వంలో ఎస్సైలు ఎన్.నవీన్, జి.ఆంజనేయులు, కె.నర్సింహులుతో కూడిన బృందం దాడి చేసింది. నిందితులను అదుపులోకి తీసుకుని వీరి నుంచి 75 ఇంజెక్షన్లు, సెల్ఫోన్లు, సిరంజ్‌లు స్వాధీనం చేసుకుంది. నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న సరుకునూ తదుపరి చర్యల నిమిత్తం డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులకు అప్పగించారు. పరారీలో ఉన్న ముంబై వాసి కునాల్ కోసం గాలిస్తున్నారు. ఇలాంటి ఇంజెక్షన్లు, టాబ్లెట్స్‌ను స్టెరాయిడ్‌గా వాడటం వల్ల అనేక దుష్ఫరిణామాలు ఉంటాయని డీసీపీ రష్మి హెచ్చరిస్తున్నారు. దీనిని వైద్యుల చీటీ లేనిదే అమ్మడం అక్రమమని స్పష్టం చేస్తున్నారు. వీటిని సుదీర్ఘకాలం వాడితే రక్తపోటు, గుండె సమస్యలతో పాటు మానసిక ఇబ్బందులు వస్తాయని తెలిపారు. వీటి విక్రయంపై ఎలాంటి సమాచారం ఉన్నా తమకు అందించాలని ఆమె కోరారు. -
ఇంజెక్టబుల్స్ సామర్థ్యం పెంచుతున్న అరబిందో
న్యూఢిల్లీ: ఔషధ రంగ సంస్థ అరబిందో ఫార్మా ఇంజెక్టబుల్స్ తయారీ సామర్థ్యాన్ని పెంచుతోంది. యూఎస్‌లో కొత్త ప్లాంటు నిర్మాణం పూర్తి చేసింది. మరో కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వద్ద ఏర్పాటు చేస్తోంది. ఈ ఫెసిలిటీ పూర్తి కావడానికి 15–18 నెలల సమయం పడుతుందని 2020–21 వార్షిక నివేదికలో అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ కె.నిత్యానంద రెడ్డి తెలిపారు. ‘కోవిడ్–19 వ్యాక్సిన్ వాణిజ్యీకరణకై సామర్థ్యాలను పెంచుకుంటున్నాం. మల్టీటోప్ పెప్టైడ్ ఆధారిత కోవిడ్–19 వ్యాక్సిన్ యూబీ612 అభివృద్ధి, వాణిజ్యీకరణ, తయారీ కోసం యూఎస్‌కు చెందిన వ్యాక్సినిటీతో ప్రత్యేక లైసెన్స్ ఒప్పందం చేసుకున్నాం. తైవాన్‌లో వ్యాక్సినిటీ చేపట్టిన వ్యాక్సిన్ రెండవ దశ ఔషధ ప్రయోగాలు సెప్టెంబరుకల్లా పూర్తి కానున్నాయి. భారత్‌లో రెండు, మూడవ దశ ఔషధ పరీక్షలకు ఈ కంపెనీ దరఖాస్తు చేసుకుంది. వ్యాక్సిన్ల తయారీ ప్లాంటు సిద్ధం అయింది’’ అని తెలిపారు. -
సూది మందుకూ దిక్కులేదు
సాక్షి, సంగారెడ్డి: ‘‘సర్కార్ దవాఖానాలన్నీ అధ్వానంగా మారాయి. కనీసం సూది మందులు కూడా అందుబాటులో ఉండడం లేదు. పాము, కుక్క కరిచినా ఆస్పత్రుల్లో మందులు లేక జనమంతా పట్నం ఉరుకుతుండ్రు. సీఎం సొంత జిల్లాలో వైద్యం మిథ్యగా మారింది. ఈ పరిస్థితిని మార్చండి’’ అని జెడ్పీటీసీ సభ్యులు సమస్యలు ఏకరువు పెట్టారు. బుధవారం జెడ్పీ చైర్పర్సన్ రాజమణి అధ్యక్షతన జరిగిన విద్య, వైద్యం స్థాయీ సంఘ సమావేశంలో ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డితో పాటు స్థాయీ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్గల్ జెడ్పీటీసీ పోచయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సొంత నియోజకవర్గమైన గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్ పీహెచ్‌సీల్లో రోగులకు సరైన వైద్యసేవలు అందటంలేదు. వైద్య సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. మందులు ఉండడం లేదనీ, రోగులకు కనీసం తాగుదామంటే పీహెచ్సీలో నీళ్లు పెట్టడంలేదన్నారు. తెలంగాణ వచ్చాక పరిస్థితి మారుతుందనుకుంటే మరింత అధ్వానంగా మారింది. ఎలాగైనా వైద్య వ్యవస్థను మార్చాలని కోరారు. మిగతా సభ్యులు కూడా వైద్య సేవలందక జనం పడుతున్న బాధలపై ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేస్తున్న ఒకరిద్దరు సిబ్బందిని కూడా బదిలీ పేరిట ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారని డీఎంహెచ్ఓ బాలాజీ పవార్‌కు ఫిర్యాదు చేశారు. పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది వివరాలు, అందజేసే సేవల వివరాలను పట్టికలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. అనంతరం ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ, సర్కారు దావాఖానా..సర్కారు బడి అంటే ప్రజల్లో మంచి అభిప్రాయం లేదని, దాన్ని పూర్తిగా మార్చేయాల్సిన అవసరం ఉందన్నారు. సర్కార్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జెడ్పీటీసీ సంగీత షెట్కార్ మాట్లాడుతూ, పీహెచ్సీ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాముకాటు, కుక్కకాటు ఇంజెక్షన్లు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. జెడ్పీటీసీ కిషన్‌రావు పవార్ మాట్లాడుతూ, మొగుడంపల్లి ప్రాంతంలోని గిరిజనుల కోసం వైద్య కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మాట్లాడుతూ, రోగులకు సరైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓకు సూచించారు. దీనిపై బాలాజీ పవార్ స్పందిస్తూ, వర్గల్ పీహెచ్సీలో మెరుగైన వైద్యసేవల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. పీహెచ్‌సీల్లో పాముకాటు, కుక్కకాటు ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. పీహెచ్‌సీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వేతనాలకు డబ్బులు లేవు రాజీవ్ విద్యామిషన్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు డబ్బులు లేవని, ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే జీతాలు ఇచ్చే అవకాశం ఉందని ఆర్వీఎం పీఓ యాస్మిన్‌బాషా తెలిపారు. స్థాయీ సంఘ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాజీవ్ విద్యామిషన్ నిర్వహణ, సిబ్బంది వేతనాలు, యూనిఫామ్స్ ఇతర బిల్లులు చెల్లింపు కోసం అవసరమైన నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. నిధులు విడుదలయ్యేలా తాను చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లాలో బదిలీ అయిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని సుధాకర్‌రెడ్డి డీఈఓకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్వీపర్లు ఇతర సిబ్బంది నియామకాలను వెంటనే చేపట్టాలని స్థాయీ సంఘ సభ్యులు డిమాండ్ చేశారు. పాఠశాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, పారిశుద్ధ్యం కోసం అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు ఆర్వీఎం పీఓ యాస్మిన్‌బాషా తెలిపారు. నిధులు విడుదల చేయండి మండలాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవసరమైన నిధులు విడుదల చేయాల్సిందిగా పలువురు జెడ్పీటీసీలు చైర్పర్సన్ రాజమణిని కోరారు. పనులు, ప్లానింగ్ స్థాయీ సంఘ సమావేశం చైర్పర్సన్ రాజమణి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జెడ్పీటీసీలు శ్రీకాంత్‌గౌడ్, ప్రభాకర్ తదితరులు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించాలని కోరారు. ఇందుకు జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం స్పందిస్తూ, ఒక్కో జెడ్పీటీసీకి రూ.5 లక్షల నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అయితే రూ.5 లక్షలు సరిపోవని ఎక్కువ నిధులు కేటాయించాలని జెడ్పీటీసీలు కోరారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ, ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో సీడీఆర్ కాంట్రాక్టు సంస్థ పనులేమైనా చేస్తోందా అని అధికారులను ప్రశ్నించగా,ఆ సంస్థ ఎలాంటి పనులు చేయటం లేదని అధికారులు సమాధానం ఇచ్చారు. సమావేశంలో సభ్యులు చిట్టిమాధురి, స్వప్న, మనోహర్‌గౌడ్, లావణయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సాధారణ నిధికి సంబంధించిన ఐదు మాసాలకు జెడ్పీలో రూ.3.5 కోట్ల మిగులు బడ్జెట్ ప్రతిపాదనకు, ఆదాయ వ్యయాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. జయశ్రీ అధ్యక్షతన జరిగిన సాంఘీక సంక్షేమ స్థాయీ సంఘ సమావేశంలో పాల్గొన్న సభ్యులు వసతి గృహాల్లో సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో సభ్యులు కమల, లక్ష్మీ, వజ్రవ్వ తదితరులు పాల్గొన్నారు.