ఎల్‌ నినో కాదు.. 'సూపర్‌ డూపర్‌ ఎల్‌ నినో'! | Earth Almost Entirely in Red: Warnings Issued as Super Duper El Nino Intensifies | Sakshi
Sakshi News home page

ఎల్‌ నినో కాదు.. 'సూపర్‌ డూపర్‌ ఎల్‌ నినో'!

Oct 8 2026 4:55 PM | Updated on Oct 8 2026 5:21 PM

Earth Almost Entirely in Red: Warnings Issued as Super Duper El Nino Intensifies

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని ముంచెత్తేందుకు మరో ముప్పు సిద్ధమవుతోంది. మానవ తప్పిదాలు, విపరీతమైన కాలుష్యం కారణంగా పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడుతున్న విభిన్న వాతావరణ, సముద్ర ప్రవాహ పరిస్థితులు భూగోళంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ నిపుణులు ప్రపంచ దేశాలకు అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. 1950 సంవత్సరం తర్వాత ఎన్నడూ లేనివిధంగా వాతావరణంలో అత్యంత ప్రమాదకరమైన, ఊహించని పరిస్థితులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఐక్యరాజ్య సమితికి చెందిన వరల్డ్ మెటిరోలాజికల్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎంవో) నివేదిక ప్రకారం.. మానవ తప్పిదం వల్ల భూవాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే రాబోయే కాలంలో ఎల్ నినో ప్రభావం మరింత పెరిగి.. ఫిబ్రవరి 2027 వరకు సుదీర్ఘకాలం కొనసాగుతుందని డబ్ల్యూఎంవో అంచనా వేసింది. వాతావరణ నిపుణులు సైతం ఈ అంచనాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నారు 

భూమిలోపలి వేడి విడుదల.. అసాధారణ ఉష్ణోగ్రతలు
పసిఫిక్ మహాసముద్రం గత కొన్ని సంవత్సరాలుగా తనలో నిల్వ చేసుకున్న భారీ మొత్తంలోని వేడిని ఒక్కసారిగా వాతావరణంలోకి విడుదల చేస్తోంది. దీనివల్ల ప్రపంచంలోని అత్యధిక ప్రాంతాల్లో సాధారణం కంటే అసాధారణ రీతిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

 

ఎరుపెక్కిన ప్రపంచ పటం
ఈ ఎల్‌నినో ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతుందో వివరిస్తూ ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త ర్యాన్ మావ్ ఎక్స్ వేదికగా ప్రపంచ పటాన్ని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచం మొత్తం ప్రచండ నిప్పులు కక్కుతోంది. ఎర్రగా మారుతోంది. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు.. భూమి మీద ప్రతి ప్రాంతంపై తన ప్రతాపాన్ని చూపేందుకు ఈ వాతావరణ ముప్పు తన పూర్తి శక్తిని ప్రదర్శిస్తోంది అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

రికార్డులను బద్దలు కొడుతున్న 'సూపర్-డూపర్ ఎల్ నినో'
మరో వాతావరణ శాస్త్రవేత్త జీక్ హాస్‌ఫాదర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఈ ఏడాది ఎల్ నినో అపూర్వమైన, ఊహించని స్థాయికి చేరుకుంటోందని తెలిపారు. పసిఫిక్‌లోని ‘నినో 3.4’ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఏకంగా 3.4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదవుతున్నాయని వెల్లడించారు. చరిత్రలో గతంలో ఎప్పుడూ నమోదైన ఎల్‌నినో రికార్డులన్నింటి కంటే ఇదే అత్యధికమని ఆయన స్పష్టం చేశారు. ఈ అసాధారణ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నిపుణులు దీనిని ‘సూపర్ డూపర్ ఎల్ నినో’గా అభివర్ణిస్తున్నారు.

ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన కరువు కాటకాలు, భారీ ఉష్ణోగ్రతలు, అసాధారణ వర్షపాతాలు, పర్యావరణ సంక్షోభాలకు దారితీసే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు

ఇదీ చదవండి : జడలు విప్పనున్న ఎల్‌ నినో! అక్టోబర్‌ నుంచే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement