
న్యూఢిల్లీ: ఆయన రూ. 33,500 కోట్లకు అధిపతి.. వ్యక్తిగత ఐలాండ్, రూ. 100 కోట్లకుపైగా విలువైన కార్లు ఆయన సొంతం.. ఆయన మరెవరో కాదు.. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్. ఆయన నేడు (మంగళవారం) తన రెండు రోజుల పర్యటన సందర్భంగా భారత్‌కు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చిన ఆయన పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు.
రూ. 33,500 కోట్ల విలువైన ఆస్తి కలిగిన ఆయన విలాసవంతమైన జీవనశైలి, వ్యక్తిగత అభిరుచులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఏప్రిల్ 8న ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై, పలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్నారు. ఏప్రిల్ 9న ముంబైలో జరిగే వ్యాపారవేత్తల సమావేశంలో పాల్గొని, అక్కడి నుంచి ఆయన తిరిగి దుబాయ్ వెళ్లనున్నారు.

షేక్ హమ్దాన్ ఆస్తి వివరాలు
షేక్ హమ్దాన్ వ్యక్తిగత సంపద సుమారు 4 బిలియన్ డాలర్లు (రూ. 33,500 కోట్లు) ఇది ఆయన కుటుంబ ఆస్తిలో భాగంగా కాకుండా వ్యక్తిగత పెట్టుబడులు, వ్యాపారాల నుండి ఆర్జించినది.
రియల్ ఎస్టేట్
ఆయనకు దుబాయ్‌లోని అత్యంత విలాసవంతమైన ప్రాంతాల్లో అత్యంత ఖరీదైన ఆస్తులు ఉన్నాయి. జాబీల్ ప్యాలెస్, బుర్జ్ ఖలీఫా సమీపంలోని ఆధునిక రెసిడెన్షియల్ యూనిట్లు ఉన్నాయి.
ప్రైవేట్ ఐలాండ్
షేక్ హమ్దాన్‌కు పర్షియన్ గల్ఫ్‌లోని ఒక ప్రైవేట్ ద్వీపం ఉంది. దీని పేరు సిర్ బానీ యాస్. దీనిని ఆయన విశ్రాంతి తీసుకునేందుకు, సాహస క్రీడలకు వినియోగిస్తారు.
ఖరీదైన వాహనాలు
ఆయన వద్ద రూ. 100 కోట్లకు పైగా విలువైన లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంది. ఇందులో బుగాటీ వెయిరాన్, లంబోర్ఘిని వెనెనో, మెర్సిడెస్-బెంజ్ ఎస్‌ఎల్‌ఆర్ లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.
ప్రైవేట్ జెట్‌లు
షేక్ హమ్దాన్ వద్ద బోయింగ్ 747-400, ఎయిర్‌బస్ ఏ320 లాంటి అత్యాధునిక ప్రైవేట్ జెట్‌లు ఉన్నాయి. వీటిని ఆయన అధికారిక, వ్యక్తిగత పర్యటనల కోసం వినియోగిస్తుంటారు.
యాచ్‌లు(చిన్న నౌకలు)
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ వద్ద దుబాయ్ అనే సూపర్ యాచ్ ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యాచ్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. దీని విలువ సుమారు రూ. 4000 కోట్లు.
పెంపుడు జంతువులు
ఆయన వద్ద అరుదైన తెల్ల పులులు, సింహాలు, ఒంటెలు, గుర్రాలు ఉన్నాయి. ఈ జంతువులను ఆయన దుబాయ్‌లోని తన ప్రత్యేక ఫామ్‌హౌస్‌లో పెంచుతారు.
సాహస క్రీడలు
షేక్ హమ్దాన్.. స్కైడైవింగ్, రాక్ క్లైంబింగ్, హార్స్ రైడింగ్, ఫాల్కన్రీలపై అమితమైన ఆసక్తి కనబరుస్తారు. వీటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేస్తుంటారు.
వ్యక్తిగత జీవితం
షేక్ హమ్దాన్ 1982, నవంబర్ 14న దుబాయ్‌లో జన్మించారు. తొలుత ఆయన యునైటెడ్ కింగ్‌డమ్‌లోని రాయల్ మిలిటరీ అకాడమీ శాండ్‌హర్స్ట్‌లో శిక్షణ పొందారు. తరువాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డిగ్రీ పొందారు. 2008లో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్‌గా ఎన్నికయ్యారు. యూఏఈ ఉప ప్రధాని, రక్షణ మంత్రిగానూ పనిచేస్తున్నారు.
సోషల్ మీడియా
‘ఫజ్జా’ పేరుతో సోషల్ మీడియాలో ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 16 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. దీనిలో ఆయన తాను రాసిన కవితలు, తన జీవనశైలి, సాహస యాత్రలను షేర్ చేస్తుంటారు.
ఇది కూడా చదవండి: ‘భయపడొద్దు.. ఇన్‌కంట్యాక్స్ వాళ్లేమీ రారు’: ప్రధాని మోదీ