భారత్‌–పాక్‌ మధ్య అణు యుద్ధం ఆపేశా.. | Donald Trump repeats claim of stopping India-Pak nuclear clash | Sakshi
Sakshi News home page

భారత్‌–పాక్‌ మధ్య అణు యుద్ధం ఆపేశా..

May 18 2025 6:39 AM | Updated on May 18 2025 6:39 AM

Donald Trump repeats claim of stopping India-Pak nuclear clash

కాల్పుల విరమణకు నేనే స్వయంగా చొరవ తీసుకున్నా

నా  అతిపెద్ద విజయాల్లో ఒకటి ట్రంప్‌ నోట మళ్లీ అదేమాట

వాషింగ్టన్‌: భారత్‌–పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ కోసం తానే చొరవ తీసుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి చెప్పుకొచ్చారు. ఆ క్రెడిట్‌ తనకే దక్కాలని పేర్కొన్నారు. ఆ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చి, ఉద్రిక్తతలు ఆగిపోవడం ఇప్పటిదాకా తాను సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి అని వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం ఫాక్స్‌ న్యూస్‌ సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన జోక్యం వల్లే పాకిస్తాన్‌పై ఇండియా సైనిక చర్య నిలిచిపోయిందని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య అణుయుద్ధాన్ని నివారించానని తెలిపారు.

 రెండు బలమైన దేశాలైన భారత్‌–పాక్‌ మధ్య మొదలైన ఘర్షణలు అతి తక్కువ సమయంలోనే అణుయుద్ధానికి దారితీసే పరిస్థితి ఏర్పడిందని, తాను కల్పించుకోవడంతో అది ఆగిపోయిందని వివరించారు. అయితే, పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ వెనుక ట్రంప్‌ ప్రమేయం ఎంతమాత్రం లేదని భారత్‌ ఇప్పటికే తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. మూడో పక్షం జోక్యాన్ని తాము అంగీకరించే ప్రసక్తే లేదని భారత్‌ వెల్లడించింది. అయినప్పటికీ ట్రంప్‌ తన నోటి దురుసు తగ్గించుకోకపోవడం గమనార్హం. భారత్‌ కుండబద్దలు కొట్టినట్లు చెప్పినప్పటికీ ఈ అంశాన్ని పదేపదే ప్రస్తావించడం ద్వారా ఆయన ఏం సాధించదల్చుకున్నారో అర్థం కావడం లేదని నిపుణులు అంటున్నారు. 

టారిఫ్‌ల రద్దుకు ఇండియా సంసిద్ధత 
భారత్, పాక్‌ నడుమ ఉద్రిక్తతలు నివారించి, శాంతిని నెలకొల్పడానికి వాణిజ్యాన్ని ఆయుధంగా వాడుకున్నానని డొనాల్డ్‌ ట్రంప్‌ తెలియజేశారు. అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లను 100 శాతం రద్దు చేయడానికి ఇండియా సంసిద్ధత వ్యక్తం చేసిందని పునరుద్ఘాటించారు. అమెరికా–ఇండియా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదరడం ఖాయమని తెలిపారు. అయితే, ఈ ఒప్పందం కోసం తాను తొందరపడడంలేదన్నారు. 

తమతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని ఇప్పుడు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని చెప్పారు. ఇప్పటిదాకా 150 దేశాలు ఇలాంటి ఒప్పందం కోసం ముందుకొచ్చాయన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశం ఇండియా అంటూ ట్రంప్‌ మరోసారి విమర్శించారు. వ్యాపారాలు చేయడం అసాధ్యం అనే పరిస్థితులు ఇండియాలో సృష్టించారని తప్పుపట్టారు. కానీ, అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు పూర్తిగా రద్దు చేయడానికి ఇండియా సుముఖంగా ఉందని వివరించారు. కేవలం అమెరికా కోసం ఇండియా ఈ మేలు చేయడానికి సిద్ధపడిందని అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement