టారిఫ్‌ల టెన్షన్‌.. ట్విస్ట్‌ ఇచ్చిన ట్రంప్‌ | Donald Trump Key Comments On India Trade Deal Praise Modi | Sakshi
Sakshi News home page

టారిఫ్‌ల టెన్షన్‌.. ట్విస్ట్‌ ఇచ్చిన ట్రంప్‌

Jun 5 2026 7:47 AM | Updated on Jun 5 2026 8:58 AM

Donald Trump Key Comments On India Trade Deal Praise Modi

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌-అమెరికా మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ప్రకటించారు. ఈ క్రమంలో గతంలో భారత్‌పై విధించిన సుంకాలను సమర్థించుకున్న ఆయన.. ప్రధాని మోదీ అంటే తనకు ఎంతో ఇష్టమంటూ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. 

ఒకవైపు భారత్‌పై అదనపు సుంకాల (టారిఫ్‌లు) కత్తి వేలాడదీస్తూ.. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీని తన "మంచి స్నేహితుడు"గా అభివర్ణిస్తున్నారు ట్రంప్‌. భారత్‌–అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదురుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన.. గతంలో భారత్‌ అమెరికాపై భారీ సుంకాలు విధించిందని, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు.

వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్‌.. భారత్‌తో వాణిజ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని చెప్పారు. ప్రధాని మోదీతో తనకు మంచి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని, ఇద్దరి మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. "మోదీ నాకు మంచి స్నేహితుడు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. మేమిద్దరం బాగా కలిసిపోతాం. అందుకే భారత్‌తో వాణిజ్య ఒప్పందం కచ్చితంగా కుదురుతుంది" అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

అయితే అదే సమయంలో భారత్‌పై విమర్శలు కూడా గుప్పించారు. చాలా ఏళ్ల పాటు భారత్‌ అమెరికాను ఉపయోగించుకుందని, అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించిందని ఆరోపించారు. ప్రస్తుతం తన విధానాల వల్ల పరిస్థితి తారుమారైందని, ఇప్పుడు అమెరికానే భారత్‌తో వాణిజ్యం ద్వారా లాభపడుతోందని చెప్పారు.

ఇదిలా ఉండగా, భారత్‌–అమెరికా మధ్య తాత్కాలిక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (BTA) చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవల అమెరికా ప్రతినిధి బృందం భారత్‌లో పర్యటించి కేంద్ర వాణిజ్య శాఖ అధికారులతో చర్చలు జరిపింది. ఇరు దేశాలు పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించాయి.

అయితే చర్చలు జరుగుతున్న వేళే అమెరికా మరోసారి టారిఫ్‌ల అంశాన్ని తెరపైకి తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బలవంతపు శ్రమ (Forced Labour) ద్వారా తయారైన వస్తువులు దిగుమతి అవుతున్నాయనే ఆరోపణలతో భారత్‌తో పాటు మరో 53 దేశాలపై అదనంగా 12.5 శాతం సుంకాలు విధించే ప్రతిపాదనను ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాబితాలో చైనా, జపాన్‌, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌, ఖతార్‌, రష్యా వంటి దేశాలు కూడా ఉన్నాయి.

ట్రంప్‌ మరోసారి హార్లే-డేవిడ్సన్‌ మోటార్‌సైకిళ్ల అంశాన్ని ప్రస్తావించారు. గతంలో భారత్‌ హార్లే-డేవిడ్సన్‌పై 200 శాతం వరకు సుంకం విధించిందని, అందువల్ల ఆ సంస్థ భారత్‌లోనే తయారీ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. మరోవైపు భారత ద్విచక్ర వాహనాలకు అమెరికాలో అలాంటి అడ్డంకులు లేవని పేర్కొన్నారు.

గతంలో మోదీ-ట్రంప్‌ మధ్య జరిగిన చర్చల అనంతరం ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశకు రూపురేఖలు సిద్ధమయ్యాయి. ఆ ఒప్పందం ప్రకారం భారత్‌పై విధించిన కొన్ని సుంకాలను తగ్గించేందుకు అమెరికా అంగీకరించింది. అయితే అనంతరం అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్‌ విధించిన పరస్పర సుంకాలపై కీలక తీర్పు ఇవ్వడంతో చర్చల దిశలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రస్తుతం ఇరు దేశాలు కొత్త పరిస్థితులకు అనుగుణంగా ఒప్పందాన్ని పునర్నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నాయి.

అదనపు టారిఫ్‌ల హెచ్చరికల మధ్య కూడా మోదీపై ట్రంప్‌ ప్రశంసలు కురిపించడం, త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ధీమా వ్యక్తం చేయడం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. భారత్‌–అమెరికా సంబంధాల్లో స్నేహపూర్వక సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ.. టారిఫ్‌ల వివాదం మాత్రం ఇంకా పూర్తిగా ముగియలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కీలకాంశాలు

  • భారత్‌తో డీల్‌.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు
  • భారత్‌తో వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదురుతుందని ట్రంప్‌ ధీమా.
  • మోదీ తనకు మంచి స్నేహితుడని వ్యాఖ్య.
  • గతంలో భారత్‌ భారీ సుంకాలు విధించిందని విమర్శ.
  • భారత్‌తో పాటు 53 దేశాలపై 12.5% అదనపు టారిఫ్‌ల ప్రతిపాదన.
  • టారిఫ్‌ల వివాదం మధ్యే కొనసాగుతున్న వాణిజ్య చర్చలు
  • త్వరలో ఓ కొలిక్కి వచ్చే అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement