
అవార్డు వెనెజువెలా నేతకు దక్కటంతో ట్రంప్ ఆశలు గల్లంతు
కమిటీ నిర్ణయంపై వైట్‌హౌస్ అక్కసు
మీడియా ప్రచారాన్ని నమ్మి నోబెల్ ఇవ్వం: నోబెల్ కమిటీ
వాషింగ్టన్: నోబెల్ శాంతి బహుమతిని బలవంతంగానైనా సాధించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చివరకు భంగపాటే ఎదురయ్యింది. తానే ప్రపంచంలో అతిపెద్ద శాంతి దూతనని, ఏడు యుద్ధాలను ఆపి ప్రపంచంలో శాంతిని నెలకొల్పానని, అందువల్ల తనకే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలన్న ఆయన వాదనను నోబెల్ కమిటీ ఏమాత్రం పట్టించుకోలేదు.
ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారాన్ని వెనెజువెలా ప్రతిపక్ష నేత, ప్రజాస్వామ్య ఉద్యమకారిణి మరియా కొరినా మచాడోకు ప్రకటించటంతో ట్రంప్ కార్యవర్గంపై నోబెల్ కమిటీపై అక్కసు వెళ్లగక్కింది. నోబెల్ కమిటీ అసలైన శాంతి పరిరక్షకులకంటే రాజకీ యాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చిందని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ శుక్రవారం ఓ ప్రకటనలో విమర్శలు గుప్పించింది. మరోవైపు ‘మీడియా ప్రచారాన్ని నమ్మి నోబెల్ ఇవ్వం’ అని నోబెల్ కమిటీ స్పష్టం చేసింది.
నోబెల్ కోసం ట్రంప్ డిమాండ్
నోబెల్ శాంతి పురస్కారంపై ట్రంప్ ఆసక్తి ఇప్పటిది కాదు. ఆయన మొదటిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచే దానిపై మనసు పారేసుకున్నారు. రెండోసారి అధ్యక్షుడయ్యాక ఏకంగా తనకు నోబెల్ పురస్కారం ఇచ్చి తీరాలని డిమాండ్ చేయటం మొదలుపెట్టారు. తనకు ఆ పురస్కారం రాకపోవటంకంటే తన రాజకీయ ప్రత్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఇవ్వటమే ట్రంప్‌ను అధికంగా మనోవేదనకు గురిచేస్తున్నట్లు ఆయన మాటల్లో స్పష్టమవుతోంది.
ఈ ఏడాది మొదట్లో అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచే ఆయన నోబెల్ శాంతిబహుమతిపై కన్నేశారు. పలు దేశాలను బెదిరించి మరీ తనకు నామినేషన్ వేయించుకున్నారు. పది నెలల తన పాలనా కాలంలో ఏడు యుద్ధాలను ఆపానని, ఇంతకంటే శాంతి ప్రదాత ఎవరు ఉంటారని ప్రశ్నిస్తూ వచ్చారు. తనకు నోబెల్ ఇవ్వకుంటే అమెరికాను అవమానించినట్లేనని ఇటీవలే వ్యాఖ్యానించారు. పురస్కార ప్రకటనకు ఒక్క రోజు ముందు కూడా ఆయన దీనిపై స్పందించారు. ‘ఒబామా ఏమీ చేయకుండానే నోబెల్ పురస్కారం ఇచ్చారు.
అమెరికాను ధ్వంసం చేసినందుకు ఆయనకు ఇచ్చారు. సరే.. వాళ్లు ఇప్పుడు ఏం చేయగలరో చేయనివ్వండి. ఏ నిర్ణయం ప్రకటించినా మంచిదే. దానికోసం (అవార్డు కోసం) నేను పనిచేయలేదు. ఎంతోమంది ప్రజల ప్రాణాలు కాపాడేందుకే నేను ఇదంతా (యుద్ధాలను ఆపటం) చేశాను’అని గురువారం తెలిపారు. నోబెల్ కోసం సొంత టీమ్‌తో ప్రచారం చేయించుకున్న ట్రంప్.. ఈ ఏడాది జూలైలో ఏకంగా నార్వే ఆర్థికమంత్రి జెన్స్ స్టాల్టె్టన్‌బెర్గ్‌కు స్వయంగా ఫోన్ చేసి తనకు నోబెల్ ఇవ్వకుంటే టారిఫ్‌లు తప్పవన్నట్లు మాట్లాడారని నార్వే మీడియా పేర్కొంది.
గడువు ముగిసిన తర్వాత నామినేషన్లు
ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారానికి ఫిబ్రవరి 1వ తేదీతో నామినేషన్ల గడువు ముగిసిపోయింది. ట్రంప్ తరఫున అనేక నామినేషన్లు వచ్చినప్పటికీ, చాలావరకు ఈ గడువు ముగిసిన తర్వాత వచ్చినవే ఉన్నాయి. ఈ ఏడాది మేలో చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో చావు దెబ్బ తిన్న పాక్‌ను ట్రంప్ చేరదీసి భరోసా ఇవ్వ టంతో.. ఆ తర్వాత పాకిస్తాన్.. ట్రంప్‌కు నోబెల్ శాంతిపురస్కారం ఇవ్వాలని ప్రతిపాదించింది. ఇజ్రాయెల్‌తో కూడా బ లవంతంగా గత నెలలో ట్రంప్ నామి నేషన్ ఇప్పించుకున్నారు. అయితే, ఈ పురస్కా రం కోసం ట్రంప్ యంత్రాంగం గత ఏడాది డిసెంబర్ నుంచే ప్రచారం మొద లుపెట్టింది. అందుకోసం అధ్యక్ష కార్యాల యం ఓవల్ ఆఫీస్‌నే కేంద్రంగా చేసు కోవటం గమనార్హం.
నోబెల్ కమిటీపై వైట్‌హౌస్ ఫైర్
ట్రంప్‌కు నోబెల్ పురస్కారం ఇవ్వకపోవటంపై అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రతినిధి స్టీవెన్ చెంగ్ అక్కసు వెళ్లగ క్కారు. ‘శాంతి ఒప్పందాలు కుదురుస్తూ, యుద్ధాలు ఆపుతూ, ప్రజల ప్రాణాలు కాపాడే పనిని అధ్యక్షుడు ట్రంప్ కొనసాగిస్తూనే ఉంటారు. ఆయనది గొప్ప మానవతా హృదయం. తన సంకల్ప శక్తితో పర్వతాలను సైతం కదిలించగల ఆయనలాంటి వ్యక్తి మరొకరు ఉండదు.
నోబెల్ కమిటీ శాంతికంటే రాజకీయాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది’అని విమర్శించారు. అయితే, శాంతి పురస్కా రానికి అభ్యర్థి ఎంపికపై నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్మన్ జోర్డాన్ స్పష్టత ఇచ్చారు. ‘నాకు తెలిసి ఈ కమిటీ ఇలాంటి ప్రచారాలు, మీడియా రిపోర్టులను చాలా చూసే ఉంటుంది. శాంతి స్థాపన కోసం అది చేశాం, ఇది చేశామని పేర్కొంటూ మాకు ఏటా వేల లేఖలు వస్తాయి. నోబెల్ పురస్కా రాలు పొందిన గొప్ప వ్యక్తుల చిత్రపటాలతో నిండిన ఓ గదిలో ఈ కమిటీ కూర్చుని చర్చిస్తుంది. ఆ గది సమగ్రత, ధైర్యసాహసాలతో నిండి ఉంటుంది. ఆల్ఫ్రెడ్ నోబెల్ సేవలు, ఆయన రాసిన విల్లులోని అంశాల ఆధారంగానే మేం నిర్ణయాలు తీసుకుంటాం’అని స్పష్టంచేశారు.