
10 రోజుల్లో 2,300 మంది మృతి
ఓ అధ్యయనంలో వెల్లడి
లండన్: యూరప్ దేశాల్లో ఎండల తీవ్రతకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రధానమైన 12 యూరప్ నగరాల్లో కేవలం పది రోజుల వ్యవధిలోనే ఏకంగా 2,300 మరణాలు నమోదయ్యాయి. ఇందులో మూడింట రెండొంతుల మరణాలకు వాతావరణ మార్పులే కారణమని ఓ అధ్యయనం తేల్చింది. తాము వేసిన మరణాల అంచనాలు స్వతంత్ర సంస్థల నుంచి సేకరించినవని, ప్రభుత్వాల పరంగా గణాంకాలు అందేందుకు సమయం పట్టొచ్చని పరిశోధకులు తెలిపారు.
జూన్ 23 నుంచి జూలై 2వ తేదీల మధ్యలో పశ్చిమ యూరప్‌తో అత్యంత తీవ్ర స్థాయిలో ఎండలు కాశాయి. స్పెయిన్‌లో ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. వడగాడ్పులు తోడవ్వడంతో ఫ్రాన్స్‌లో కార్చిచ్చు చెలరేగింది. యూరప్‌లోని ప్రధాన నగరాలైన బార్సిలోనా, మాడ్రిడ్, లండన్, మిలాన్ తదితర ప్రధానమైన 12 నగరాల జనాభా 3 కోట్లకు పైమాటే.
ఈ నగరాల్లో సాధారణానికి మించి నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధ్యయనం గుర్తించింది. పది రోజుల సమయంలో ఎండలకు సంబంధించిన ఘటనలకు సంబంధించిన 2,300 మరణాల్లో కనీసం 1,500 మరణాలు అత్యంత తీవ్రమైన వడగాడ్పులు వంటి వాతావరణ మార్పుకు సంబంధించినవేనని తెలిపింది. యూకే, నెదర్లాండ్స్, డెన్మార్క్, స్విట్జర్లాండ్‌లకు చెందిన ఐదు సంస్థలు, 12మందికి పైగా పరిశోధకులు అధ్యయనంలో భాగస్వాములయ్యారు.
‘వాతావరణ మార్పుల వల్లనే సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ పరిస్థితి మన్ముందు మరింత ప్రమాదకరంగా మారనుంది’అని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ పరిశోధకులు బెన్ క్లార్క్ చెప్పారు. అప్పుడిక మనిషి శరీరం ఆ ఉష్ణోగ్రతలను తట్టుకునే పరిస్థితి ఏమాత్రం ఉండదన్నారు. ఈ ప్రభావం వృద్ధులు, చిన్నారులు, బయట పనిచేసే సిబ్బందిపై ఎక్కువగా ఉంటుందన్నారు.
మానవ ప్రేరేపిత వాతావరణ మార్పు ప్రభావమే లేకుంటే ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశముందన్నారు. రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగినా వేలాదిగా జనం ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని మరో పరిశోధకుడు గ్యారీఫల్లోస్ అన్నారు. వడగాడ్పులు సైలెంట్ కిల్లర్స్‌గా ఆయన అభివరి్ణంచారు. మన ఇళ్లు, ఆస్పత్రుల్లో సంభవించే ఎండలకు సంబంధించిన మరణాలను పెద్దగా ఎవరూ పట్టించుకోరని ఆయన పేర్కొన్నారు.