సాధారణంగా ఆఫీసుకు లేట్‌గా వస్తుంటేనో.. లేక ఇష్టమొచ్చినట్టు సెలవులు పెడుతుంటేనో ఉద్యోగం ఊడుతుంది. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ఎక్కువ సార్లు బాత్రూమ్‌కి వెళ్లి.. గంటల తరబడి అక్కడే ఉండటంతో కొలువు పోగొట్టుకున్నాడు. చైనాకు చెందిన లీ అనే వ్యక్తి జియాంగ్సు ప్రావిన్స్‌లోని ఒక కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఆఫీసు సమయంలో పదేపదే బాత్రూమ్‌కి వెళ్లడం.. ఎక్కువసేపు అక్కడే ఉండటం కంపెనీ గమనించింది. దీంతో అతడిని ఉద్యోగం నుంచి తీసేసింది.
దీనిని లీ కోర్టులో సవాల్ చేశాడు. నెలరోజుల వ్యవధిలో లీ ఏకంగా 14 సార్లు అధికం సమయంపాటు బాత్రూమ్‌కి వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజీలను కంపెనీ సమర్పించింది. అందులో అధికంగా నాలుగు గంటల సమయం ఉందని పేర్కొంది. అనారోగ్యం, ఇతరత్రా కారణాలరీత్యా ఎక్కువ సమయం బాత్రూమ్ బ్రేక్ తప్పనిసరి అని లీ తరఫు న్యాయవాదులు వాదించారు. అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించినందుకు 45వేల డాలర్లు పరిహారం ఇవ్వాలని పేర్కొన్నారు. అయితే, న్యాయస్థానం వారి వాదనను తోసిపుచ్చింది. అనారోగ్య కారణాలను కంపెనీకి అతడు చెప్పని విషయం ప్రస్తావించింది. చివరకు కంపెనీ లీకి కొంతమొత్తం పరిహారం ఇవ్వడానికి అంగీకరించడంతో కేసు పరిష్కారమైంది.


