కరోనా వెల్లడికి ముందే చైనా అప్రమత్తం ! | China PCR Test Orders Soared Before First Confirmed COVID Case | Sakshi
Sakshi News home page

కరోనా వెల్లడికి ముందే చైనా అప్రమత్తం !

Oct 6 2021 6:51 AM | Updated on Oct 6 2021 11:17 AM

China PCR Test Orders Soared Before First Confirmed COVID Case - Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచానికి కరోనా మహమ్మారిని పరిచయం చేయడానికంటే చాలా నెలలకు ముందే చైనా ఈ విషయంపై సీరియస్‌గా దృష్టిపెట్టిందనే బలమైన ఆధారాలు తాజాగా బహిర్గతమయ్యాయి. తమ దేశంలో ఎంత మందికి కరోనా సోకిందో, ఎంతగా దేశవ్యాప్తంగా విస్తరించిందో తెల్సుకునేందుకు పీసీఆర్‌ టెస్ట్‌ కిట్లను ముందుగా ఆర్డర్‌ చేసిందని ‘ఇంటర్నెట్‌ 2.0’ అనే సైబర్‌ సెక్యూరిటీ పరిశోధన సంస్థ తాజా నివేదికలో వెల్లడైంది. డిజిటల్‌ ఫోరెన్సిక్, నిఘా ఫలితాల విశ్లేషణలో ‘ఇంటర్నెట్‌’ అనే ఈ అమెరికా–ఆస్ట్రేలియా సంస్థకు అపార అనుభవం ఉంది.

చదవండి:  (అంతరిక్షంలో సినిమా షూటింగ్‌)

తమ దేశంలో కరోనా అనే కొత్త వైరస్‌ విజృంభిస్తోందని తొలిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా 2019 డిసెంబర్‌ 31న అధికారికంగా తెలియజేసింది. అయితే, ఆ తేదీకి చాలా నెలల ముందే, అంటే మే నెలలోనే చైనా కోవిడ్‌ కట్టడికి భారీ స్థాయిలో ఏర్పాట్లు మొదలుపెట్టిందని ‘ఇంటర్నెట్‌ 2.0’ సంస్థ వాదిస్తోంది. ఇందుకు.. చైనాలో ఒక్కసారిగా పెరిగిన పీసీఆర్‌(పాలిమర్‌ చైన్‌ రియాక్షన్‌) టెస్టింగ్‌ కిట్ల కొనుగోలు పరిమాణాలను ఆధారంగా చూపుతోంది. వూహాన్‌ సిటీ ఉన్న హూబే ప్రావిన్స్‌లో 2019 ఏడాది ద్వితీయార్ధంలో ఈ కిట్ల కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. చైనా ప్రభుత్వ  వెబ్‌సైట్‌లోని కొనుగోళ్ల వివరాల ఆధారంగానే ఈ నివేదికను రూపొందించామని సంస్థ సహ సీఈవో, ఆస్ట్రేలియా సైనిక నిఘా మాజీ ఉన్నతాధికారి రాబిన్‌సన్‌ చెబుతున్నారు. ఈ వాదనలను చైనా తేలిగ్గా కొట్టిపారేసింది. 

చదవండి: (ఆ ఇంట్లో కనకవర్షం.. రూ.5,215 కోట్ల లాటరీ)

అయితే, ఇంత భారీగా కొన్న కిట్లను ఏ వ్యాధి నిర్ధారణకు వినియోగించారనే విషయాన్ని చైనా బహిర్గతం చేయకపోవడం గమనార్హం. అయితే, తమ తదుపరి నివేదికలో మరిన్ని కొత్త విషయాలు బయటపెడతామని ఇంటర్నెట్‌ 2.0 సహ సీఈఓ ఒకరు చెప్పారు. అయితే, ముందే చైనాకు అంతా తెలుసు అనే వాదనను ఇంటర్నెట్‌ 2.0 నివేదిక ఆధారంగా బలపరచలేమని కొందరు వైద్య నిపుణులు వ్యాఖ్యానించారు. నివేదికలోని అంశాలు అందుకు సరిపోవన్నారు. కరోనా కాకుండా ఇతర వైరస్‌ సంక్రమిత వ్యాధుల నిర్ధారణకూ పీసీఆర్‌ టెస్ట్‌ కిట్లను దశాబ్దాలుగా వాడుతున్నారని వారు ఉదహరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement