breaking news
PCR
-
కరోనా వెల్లడికి ముందే చైనా అప్రమత్తం !
వాషింగ్టన్: ప్రపంచానికి కరోనా మహమ్మారిని పరిచయం చేయడానికంటే చాలా నెలలకు ముందే చైనా ఈ విషయంపై సీరియస్‌గా దృష్టిపెట్టిందనే బలమైన ఆధారాలు తాజాగా బహిర్గతమయ్యాయి. తమ దేశంలో ఎంత మందికి కరోనా సోకిందో, ఎంతగా దేశవ్యాప్తంగా విస్తరించిందో తెల్సుకునేందుకు పీసీఆర్ టెస్ట్ కిట్లను ముందుగా ఆర్డర్ చేసిందని ‘ఇంటర్నెట్ 2.0’ అనే సైబర్ సెక్యూరిటీ పరిశోధన సంస్థ తాజా నివేదికలో వెల్లడైంది. డిజిటల్ ఫోరెన్సిక్, నిఘా ఫలితాల విశ్లేషణలో ‘ఇంటర్నెట్’ అనే ఈ అమెరికా–ఆస్ట్రేలియా సంస్థకు అపార అనుభవం ఉంది. చదవండి: (అంతరిక్షంలో సినిమా షూటింగ్) తమ దేశంలో కరోనా అనే కొత్త వైరస్ విజృంభిస్తోందని తొలిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా 2019 డిసెంబర్ 31న అధికారికంగా తెలియజేసింది. అయితే, ఆ తేదీకి చాలా నెలల ముందే, అంటే మే నెలలోనే చైనా కోవిడ్ కట్టడికి భారీ స్థాయిలో ఏర్పాట్లు మొదలుపెట్టిందని ‘ఇంటర్నెట్ 2.0’ సంస్థ వాదిస్తోంది. ఇందుకు.. చైనాలో ఒక్కసారిగా పెరిగిన పీసీఆర్(పాలిమర్ చైన్ రియాక్షన్) టెస్టింగ్ కిట్ల కొనుగోలు పరిమాణాలను ఆధారంగా చూపుతోంది. వూహాన్ సిటీ ఉన్న హూబే ప్రావిన్స్‌లో 2019 ఏడాది ద్వితీయార్ధంలో ఈ కిట్ల కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. చైనా ప్రభుత్వ వెబ్‌సైట్‌లోని కొనుగోళ్ల వివరాల ఆధారంగానే ఈ నివేదికను రూపొందించామని సంస్థ సహ సీఈవో, ఆస్ట్రేలియా సైనిక నిఘా మాజీ ఉన్నతాధికారి రాబిన్సన్ చెబుతున్నారు. ఈ వాదనలను చైనా తేలిగ్గా కొట్టిపారేసింది. చదవండి: (ఆ ఇంట్లో కనకవర్షం.. రూ.5,215 కోట్ల లాటరీ) అయితే, ఇంత భారీగా కొన్న కిట్లను ఏ వ్యాధి నిర్ధారణకు వినియోగించారనే విషయాన్ని చైనా బహిర్గతం చేయకపోవడం గమనార్హం. అయితే, తమ తదుపరి నివేదికలో మరిన్ని కొత్త విషయాలు బయటపెడతామని ఇంటర్నెట్ 2.0 సహ సీఈఓ ఒకరు చెప్పారు. అయితే, ముందే చైనాకు అంతా తెలుసు అనే వాదనను ఇంటర్నెట్ 2.0 నివేదిక ఆధారంగా బలపరచలేమని కొందరు వైద్య నిపుణులు వ్యాఖ్యానించారు. నివేదికలోని అంశాలు అందుకు సరిపోవన్నారు. కరోనా కాకుండా ఇతర వైరస్ సంక్రమిత వ్యాధుల నిర్ధారణకూ పీసీఆర్ టెస్ట్ కిట్లను దశాబ్దాలుగా వాడుతున్నారని వారు ఉదహరించారు. -
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
-
ర్యాపిడ్ టెస్టులకు ఓకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో టెస్టులను కూడా అంతే వేగంగా నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులకు కేవలం 15 నిమిషాల్లోనే వైరస్ ఉందో లేదో నిర్ధారించే యాంటీజెన్ పరీక్షను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ర్యాపిడ్ యాంటీజెన్ డిటెక్షన్ టెస్ట్ ద్వారా గరిష్టంగా అర గంటలో ఫలితం తెలుస్తుంది. ఈ మేరకు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అనుమతి లభించింది. ఇందుకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ నుంచి కిట్లు రాష్ట్రానికి రానున్నాయి. అనంతరం వాటిని ఉపయోగించి వైద్య సిబ్బంది విరివిగా పరీక్షలు చేయనున్నారు. వైరస్ తీవ్రత ఉన్న ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటిని నిర్వహిస్తారు. అప్పటికప్పుడే ఫలితం ప్రకటిస్తారు. పాజిటివ్ వచ్చిన వారిని తక్షణమే హోం ఐసోలేషన్ లేదా అవసరాన్ని బట్టి ఆసుపత్రికి తరలిస్తారు. ముందుగా 50 వేల కిట్లు తెప్పించి పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రైవేటు లేబొరేటరీలకు కూడా యాంటీజెన్ టెస్టులకు అనుమతి ఇస్తారు. తద్వారా ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఆర్టీ–పీసీఆర్ పరీక్షకు ప్రైవేటు లేబొరేటరీల్లో రూ. 2,200 వరకు ఖర్చవుతుంది. ప్రభుత్వ పరిధిలోనూ అదే స్థాయిలో ఖర్చు అవుతుంది. కానీ యాంటీజెన్ పరీక్షకు మాత్రం రూ. 500 మాత్రమే ఖర్చు కానుంది. ముందుగా జీహెచ్ఎంసీ సహా వివిధ జిల్లాల్లోని ప్రభావిత ప్రాంతాల్లో యాంటీజెన్ పరీక్షలు చేస్తారు. నమూనాలు సేకరించిన గంటలో పరీక్ష చేయాల్సిందే...రాష్ట్రంలో కరోనా వైరస్ నమూనాలు సామర్థ్యానికి మించి వస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు లేబొరేటరీలపై తీవ్ర భారం పడుతోంది. దీంతో శాంపిళ్లు ఇచ్చిన తర్వాత ఒక్కోసారి 4–5 రోజుల వరకు కూడా ఫలితం రావడంలేదు. దీంతో తీవ్రమైన లక్షణాలున్న వారు మరింత అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయడానికి ఎక్కువ సమయం పడుతోంది. ఎక్కువ శాంపిళ్లు పేరుకుపోవడం, శాంపిళ్ల సేకరణ అనంతరం వాటిని లేబొరేటరీకి తరలించడం వల్ల సమయం వృథా అవుతోంది. దీంతో పరీక్షల నిర్వహణపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం యాంటీజెన్ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలో కరోనా నిర్ధారణ కోసం ఆర్టీ–పీసీఆర్, ట్రూనాట్, సీబీనాట్‌లను ఉపయోగిస్తున్నారు. వీటన్నింటికీ పరికరాలు, జీవ భద్రత, బయో సెక్యూరిటీపరంగా ప్రత్యేకమైన లేబొరేటరీల్లో సౌకర్యాలు అవసరం. నమూనాల సేకరణ, తదనంతరం వాటి రవాణాకు ఆయా ప్రాంతాలను బట్టి కనీసం రెండు నుంచి ఐదు గంటల వరకు పడుతుంది. దీంతో ఎక్కువ పరీక్షలు చేయడానికి ఇవి ఆటంకంగా మారుతున్నాయి. అందుకే యాంటీజెన్ పరీక్షలపై సర్కారు దృష్టి సారించింది. పైగా యాంటీజెన్ పరీక్షకు నమూనా సేకరించిన తర్వాత తప్పనిసరిగా గంటలోనే పరీక్ష చేయాలి. లేకుంటే నమూనా వృథా అయిపోతుంది. లేబొరేటరీలకు నమూనాలను రవాణా చేసే పరిస్థితి ఉండదు. అందువల్ల శాంపిళ్లు సేకరించిన ఆరోగ్య కేంద్రంలోనే అప్పటికప్పడు పరీక్షలు నిర్వహించాలి. దీనికోసం ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. సాధారణ లేబొరేటరీ సౌకర్యం ఉంటే చాలు. నెగెటివ్ వస్తే ఆర్టీ–పీసీఆర్ పరీక్ష తప్పనిసరి... కరోనా వైరస్‌ను వేగంగా గుర్తించడానికి ర్యాపిడ్ యాంటీజెన్ డిటెక్షన్ పరీక్ష కీలకమైంది. కరోనా పాజిటివ్ రోగులను వేగంగా గుర్తించడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. వేగంగా పరీక్షించడానికి, ట్రాక్ చేయడానికి, చికిత్స చేయడానికి దీనివల్ల వీలు కలుగుతుంది. ఈ పరీక్ష కచ్చితత్వం 99.3 నుంచి 100 శాతం ఉంటుందని ఐసీఎంఆర్ తెలిపింది. అయితే ఈ పరీక్షకు ఉన్న ప్రధాన లోపం ఏమిటంటే అనుమానిత వ్యక్తి నమూనాలను పరీక్షించాక ఫలితం పాజిటివ్ వస్తే పాజిటివ్‌గానే పరిగణిస్తారు. కానీ ఒకవేళ నెగెటివ్ వస్తే మాత్రం ఆర్టీ–పీసీఆర్ పద్ధతిలో మరోసారి పరీక్ష చేసి సరిచూసుకోవాల్సి ఉంటుందని ఐసీఎంఆర్ తెలిపింది. అయితే తీవ్ర లక్షణాలున్న వారికి, కేసులు అధికంగా నమోదవుతున్న చోట యాంటీజెన్ టెస్టులు మరింత ఉపయోగపడతాయని ఐసీఎంఆర్ తెలిపింది. కంటైన్మెంట్ జోన్లు, తీవ్ర వైరస్ లక్షణాలున్న వారు, ఊపిరితిత్తుల వ్యాధి, గుండె జబ్బులు, కాలేయ వ్యాధి, మూత్రపిండాల వ్యాధి, మధుమేహం, నాడీ సంబంధిత రుగ్మతలు తదితర అనారోగ్య లక్షణాలున్న వారికి ఈ యాంటీజెన్ పరీక్షల వల్ల వేగంగా కరోనా వైరస్ నిర్ధారణ చేయడానికి వీలు కలుగుతుంది. 65 ఏళ్లు పైబడినవారు, తీవ్ర శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్న వారు, 100.4 డిగ్రీలకు పైబడి జ్వరం, దగ్గుతో తీవ్ర శ్వాసకోశ సంక్రమణ వ్యాధులు ఉన్నవారికి దీనిద్వారా పరీక్షించాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
మిడ్ వైఫ్స్ లా సహకరించిన పోలీసులు!
న్యూఢిల్లీః సాహసమే ఊపిరిగా, సామాజికే సేవే లక్ష్యంగా పనిచేసే పోలీసులు.. తమలోని సేవా గుణాన్ని దేశరాజధాని సాక్ష్యంగా మరోసారి నిరూపించుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు తక్షణ సేవలను అందించి... సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆమెను ప్రమాదం నుంచి తప్పించారు. పోలీసు పీసీఆర్ వాహనంలోనే ఆమె ప్రసవానికి మిడ్ వైఫ్స్ లా సహకరించి అభినందనలు అందుకున్నారు. ఢిల్లీ పోలీసుల సహకారంతో పీసీఆర్ వాహనంలో 23 ఏళ్ళ మహిళ ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవంకోసం అత్తింటివారితో పాటుగా స్మాల్ ఖా వెళ్ళేందుకు పానిపట్ నుంచి గ్వాలియర్ వెళ్ళే దాద్రి ఎక్స్ ప్రెస్ ఎక్కిన ఆర్తీ...ఢిల్లీలోని సబ్జి మండి స్టేషన్ ప్రాంతానికి వచ్చే సరికి నొప్పులు తీవ్రమవ్వడమే కాక, ఉమ్మనీరు కూడ పడిపోవడంతో అత్తింటివారు టికెట్ కలెక్టర్ కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన టీసీ కంట్రోల్ రూం కు ఫోన్ చేసి, పోలీసులుకు సమాచారం చెప్పడంతో సబ్జీ మండి ప్రాంతం పోలీసులు వైద్య సహకారం అందించేందుకు సిద్ధమయ్యారు. ఓ పీసీఆర్ వ్యాన్ ను రైలు దగ్గరకు తెచ్చి ఆర్తీని ప్రయాణీకుల సహకారంతో అందులోకి ఎక్కించి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. హెడ్ కానిస్టేబుల్ సంజీవ్, కానిస్టేబుల్ సంజయ్ లు మహిళను స్ట్రెచ్చర్ పై వ్యాన్ లో ఎక్కించుకున్నారు. ఇంతలో నొప్పులు ఎక్కువ కావడంతో ఆర్తీ పీసీఆర్ వ్యాన్ లోనే ప్రసవించింది. దీంతో పుట్టిన బిడ్డకు కావలసిన టవల్స్, వేడి నీటితో పాటు సౌకర్యాలను అందించి తమ సేవాగుణాన్ని చాటుకున్నారు. అనంతరం స్థానిక హిందూరావ్ ఆస్పత్రికి తల్లీ బిడ్డలను తరలించారని వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని డీసీపీ ఆర్ కె సింగ్ తెలిపారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి సహకారం అందించిన ఇద్దరు పోలీసులకు ఆర్తీ బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్స్ స్పెషల్ కమిషనర్ సంజయ్ బెనివాల్ ఆర్తీకి సహకారం అందించిన ఇద్దరు పోలీసులకు ప్రత్యేక అవార్డులను ప్రకటించారు.