సీతాకోక చిలుకలు ఎగిరిపోతున్నాయి! | Butterflies are on the move as the planet warms | Sakshi
Sakshi News home page

సీతాకోక చిలుకలు ఎగిరిపోతున్నాయి!

Aug 7 2026 6:17 AM | Updated on Aug 7 2026 6:17 AM

Butterflies are on the move as the planet warms

భూతాపోన్నది ప్రభావం 

అంతర్జాతీయ అధ్యయనం వెల్లడి

మునుపెన్నడూ చూడని సీతాకోక చిలుక మీకు దర్శనమిచ్చిందా? స్మార్ట్‌ఫోన్‌తో ఫొటో తీసి.. ఇన్‌స్టాలో షేర్‌ చేసి మురిసిపోయారా? ఓకే కానీ... ఆ సీతాకోక చిలుక అక్కడకు ఎందుకు వచ్చిందన్నది ఆలోచించారా? అప్పటివరకూ ఉన్న ప్రాంతంలో వేడి ఎక్కువ కావడంతో... చల్లబడదామని ఎగిరొచ్చింది. భూమ్మీద అన్నిచోట్లా ఇప్పుడు ఇదే తంతు.. పర్యావరణ విధ్వంసానికి, భూతాపోన్నతి పాపం!

పెట్రోలు, డీజిళ్ల విచ్చలవిడి వాడకం, అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం, కాలుష్యం పెరిగిపోవడం వంటి రకరకాల కారణాలతో భూమి క్రమేపీ వేడెక్కుతోందని మనం చాలాసార్లు వినే ఉంటాం. ఈ పెరుగుదలను 2100 నాటికి 1.5 డిగ్రీ సెల్సియస్‌కు పరిమితం చేయగలిగితే భూమ్మీద మనిషన్నవాడు ఉండగలడని, లేదంటే మహా విపత్తు తప్పదన్న హెచ్చరికలూ చాలానే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ లాంటివాళ్లు కొందరు భూతాపోన్నతి, వాతావరణ మార్పులు చైనా సృష్టి అని కొట్టివేయవచ్చు కానీ.. సీతాకోక చిలుక జాతులు కొత్త కొత్త ప్రాంతాలకు విస్తరిస్తూండటం మాత్రం వాటికి ప్రత్యక్ష సాక్ష్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూతాపోన్నతి పరిణామాల్లో ఇదీ ఒకటి. 

మోనాష్‌ యూనివర్సిటీ (ఆ్రస్టేలియా), ఫ్రీడ్రిచ్‌ షిల్లర్‌ యూనివర్సిటీ (జర్మనీ), యూనివర్సిటీ ఆఫ్‌ పికార్డీ జూల్స్‌ వర్నె (ఫ్రాన్స్‌) పరిశోధకులు నిర్వహించిన అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం ఇప్పటికే పది సీతాకోక చిలుక జాతుల్లో కనీసం ఒకటి తమ ఆవాస ప్రాంతాన్ని మార్చేసుకుంది. వీటి కదలికలను నిర్ధారించుకునేందుకు శాస్త్రవేత్తలు సీతాకోక చిలుకల నివాస పరిధిపై జరిపిన 565 అధ్యయనాలను పరిశీలించారు. 

దాదాపు 6180 నివేదికలు, నిపుణులు సిద్ధం చేసిన 68 అంచనాలను కూడా కలుపుకుని విశ్లేషించినప్పుడు ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. దాదాపు 80 శాతం సీతాకోక చిలుక జాతులు తమ పరిధిని విస్తరించాయి. కొన్ని ఉత్తరం నుంచి దక్షిణానికి ఇంకొన్ని తూర్పు నుంచి పశ్చిమం వైపు. ఇంకొన్ని జాతుల నివాస పరిధి కుంచించుకుపోయింది. గతంలో ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో తిరుగుతూంటే ఇప్పుడు అంతకంటే తక్కువ స్థలంలో బతికేస్తున్నాయన్నది ఒక ఉదాహ రణ. కొన్ని సీతాకోక చిలుక జాతులైతే కొండ ప్రాంతాల్లో దిగువ నుంచి ఎగువకు.. ఎగువ నుంచి దిగువకు మారిపోయాయి. 

ఎందుకిలా అంటే... 
సీతాకోక చిలుకలు తమ నివాస పరిధిని మార్చుకోవడంలో వాతావరణ మార్పులు, వడగాడ్పు, వరదల్లాంటి తీవ్ర వాతావరణ ఘటనల భాగస్వామ్యం 70 శాతం! ఈ తీరు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఖండంలోనూ కనిపిస్తోందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త షావన్‌ చౌదరి (మోనాష్‌ యూనివర్సిటీ) తెలిపారు. వ్యవసాయం, అటవీ ప్రాంతాలు తగ్గిపోతూండటం, నగరీకరణ, సీతాకోక చిలుకల ఆవాస ప్రాంతాల విధ్వంసం ఇతర కారణాలుగా తెలుస్తోంది. 

పర్యావరణ వ్యవస్థలో సీతాకోక చిలుకలది చాలా ముఖ్యపాత్ర. పర పరాగ సంపర్కానికి సాయపడతాయి. గొంగళి పురుగులు పక్షులు, సాలెపురుగులు, ఇతర కీటకాలకు ఆహారంగా ఉపయోగపడతాయి. సీతాకోక చిలుకలు కనిపించకుండా పోతే ఆయా ప్రాంతాల్లో మొక్కలు, నేలల్లోనూ మార్పులు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలోనే ప్రకృతిని పరిరక్షించుకోవడం.. అందులో చిన్న భాగమైనప్పటికీ సీతాకోక చిలుకలను కాపాడుకోవడం అవసరమవుతుంది.  అధ్యయనం వివరాలు నేచర్‌ ఎకాలజీ  అండ ఎవల్యూషన్‌లో ప్రచురితమయ్యాయి.  
                 
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement