breaking news
Monash University
-
సీతాకోక చిలుకలు ఎగిరిపోతున్నాయి!
మునుపెన్నడూ చూడని సీతాకోక చిలుక మీకు దర్శనమిచ్చిందా? స్మార్ట్‌ఫోన్‌తో ఫొటో తీసి.. ఇన్‌స్టాలో షేర్ చేసి మురిసిపోయారా? ఓకే కానీ... ఆ సీతాకోక చిలుక అక్కడకు ఎందుకు వచ్చిందన్నది ఆలోచించారా? అప్పటివరకూ ఉన్న ప్రాంతంలో వేడి ఎక్కువ కావడంతో... చల్లబడదామని ఎగిరొచ్చింది. భూమ్మీద అన్నిచోట్లా ఇప్పుడు ఇదే తంతు.. పర్యావరణ విధ్వంసానికి, భూతాపోన్నతి పాపం!పెట్రోలు, డీజిళ్ల విచ్చలవిడి వాడకం, అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం, కాలుష్యం పెరిగిపోవడం వంటి రకరకాల కారణాలతో భూమి క్రమేపీ వేడెక్కుతోందని మనం చాలాసార్లు వినే ఉంటాం. ఈ పెరుగుదలను 2100 నాటికి 1.5 డిగ్రీ సెల్సియస్‌కు పరిమితం చేయగలిగితే భూమ్మీద మనిషన్నవాడు ఉండగలడని, లేదంటే మహా విపత్తు తప్పదన్న హెచ్చరికలూ చాలానే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాంటివాళ్లు కొందరు భూతాపోన్నతి, వాతావరణ మార్పులు చైనా సృష్టి అని కొట్టివేయవచ్చు కానీ.. సీతాకోక చిలుక జాతులు కొత్త కొత్త ప్రాంతాలకు విస్తరిస్తూండటం మాత్రం వాటికి ప్రత్యక్ష సాక్ష్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూతాపోన్నతి పరిణామాల్లో ఇదీ ఒకటి. మోనాష్ యూనివర్సిటీ (ఆ్రస్టేలియా), ఫ్రీడ్రిచ్ షిల్లర్ యూనివర్సిటీ (జర్మనీ), యూనివర్సిటీ ఆఫ్ పికార్డీ జూల్స్ వర్నె (ఫ్రాన్స్) పరిశోధకులు నిర్వహించిన అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం ఇప్పటికే పది సీతాకోక చిలుక జాతుల్లో కనీసం ఒకటి తమ ఆవాస ప్రాంతాన్ని మార్చేసుకుంది. వీటి కదలికలను నిర్ధారించుకునేందుకు శాస్త్రవేత్తలు సీతాకోక చిలుకల నివాస పరిధిపై జరిపిన 565 అధ్యయనాలను పరిశీలించారు. దాదాపు 6180 నివేదికలు, నిపుణులు సిద్ధం చేసిన 68 అంచనాలను కూడా కలుపుకుని విశ్లేషించినప్పుడు ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. దాదాపు 80 శాతం సీతాకోక చిలుక జాతులు తమ పరిధిని విస్తరించాయి. కొన్ని ఉత్తరం నుంచి దక్షిణానికి ఇంకొన్ని తూర్పు నుంచి పశ్చిమం వైపు. ఇంకొన్ని జాతుల నివాస పరిధి కుంచించుకుపోయింది. గతంలో ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో తిరుగుతూంటే ఇప్పుడు అంతకంటే తక్కువ స్థలంలో బతికేస్తున్నాయన్నది ఒక ఉదాహ రణ. కొన్ని సీతాకోక చిలుక జాతులైతే కొండ ప్రాంతాల్లో దిగువ నుంచి ఎగువకు.. ఎగువ నుంచి దిగువకు మారిపోయాయి. ఎందుకిలా అంటే... సీతాకోక చిలుకలు తమ నివాస పరిధిని మార్చుకోవడంలో వాతావరణ మార్పులు, వడగాడ్పు, వరదల్లాంటి తీవ్ర వాతావరణ ఘటనల భాగస్వామ్యం 70 శాతం! ఈ తీరు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఖండంలోనూ కనిపిస్తోందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త షావన్ చౌదరి (మోనాష్ యూనివర్సిటీ) తెలిపారు. వ్యవసాయం, అటవీ ప్రాంతాలు తగ్గిపోతూండటం, నగరీకరణ, సీతాకోక చిలుకల ఆవాస ప్రాంతాల విధ్వంసం ఇతర కారణాలుగా తెలుస్తోంది. పర్యావరణ వ్యవస్థలో సీతాకోక చిలుకలది చాలా ముఖ్యపాత్ర. పర పరాగ సంపర్కానికి సాయపడతాయి. గొంగళి పురుగులు పక్షులు, సాలెపురుగులు, ఇతర కీటకాలకు ఆహారంగా ఉపయోగపడతాయి. సీతాకోక చిలుకలు కనిపించకుండా పోతే ఆయా ప్రాంతాల్లో మొక్కలు, నేలల్లోనూ మార్పులు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలోనే ప్రకృతిని పరిరక్షించుకోవడం.. అందులో చిన్న భాగమైనప్పటికీ సీతాకోక చిలుకలను కాపాడుకోవడం అవసరమవుతుంది. అధ్యయనం వివరాలు నేచర్ ఎకాలజీ అండ ఎవల్యూషన్లో ప్రచురితమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అధిక వేడి వల్ల... ముందస్తు ముదిమి!
మెల్బోర్న్: రోజంతా వేడిమి పరిస్థితుల్లో పనిచేశాక అలసిపోయిన భావన కలగడం సహజం. అలసిపోతే పర్లేదు గానీ దానివల్ల ఆయుష్షు కూడా వేగంగా క్షీణిస్తుందట! పర్యావరణ ఒత్తిళ్లకు తలొగ్గి మన శరీరంలో చాలా మార్పులే జరుగుతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. డీఎన్ఏలో మార్పులు జరగకపోయినా మారే ఉష్ణ పరిస్థితులకు తగ్గట్లు ఒంట్లో ఏ ప్రొటీన్ ఉత్పత్తి ఏ మేరకు పెరగాలో, ఏది ఎంతగా తగ్గాలో నిర్ణయాలు జరిగిపోతాయట. ఈ ఎపీజెనిటిక్స్ శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆ్రస్టేలియాలో జరిగిన తాజా అధ్యయనంలో తేలింది. అధిక ఉష్ణోగ్రతలు మనిషిపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై మొనాష్ విశ్వవిద్యాలయంలోని రోంగ్బిన్ క్సూ, యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్లోని షుఆయ్ లీ సారథ్యంలోని అధ్యయన బృందం పరిశోధన చేసింది. అత్యధిక ఉష్ణోగ్రతలకు లోనైన వ్యక్తుల్లో వృద్దాప్య ఛాయలు త్వరగా కనిపిస్తాయని తేల్చారు. అంతేకాదు, దీర్ఘకాలం పాటు వేడిమి పరిస్థితుల ప్రభావానికి గురైతే వృద్ధుల ఆయుష్షు రెండేళ్లకు పైగా హరించుకు పోతుందని వెల్లడించారు! వాతావరణ మార్పుల ప్రభావం వాతావరణ మార్పుల వల్ల వేడి పెరిగేకొద్దీ మన శరీరం మరింత ఒత్తిడికి గురవుతుంది. ఈ ఒత్తిడే వృద్ధాప్యం త్వరగా రావడానికి ప్రధాన కారణంగా మారుతోంది. ముఖ్యంగా వడగాల్పులకు, వేడి వాతావరణానికి చిరునామాగా నిలిచే ఆ్రస్టేలియాలో కొన్నేళ్లుగా ఈ పరిస్థితులు పరిపాటిగా మారుతున్నాయి. ఉష్ణోగ్రత ప్రభావ మార్పులు అక్కడ మనుషులపై స్పష్టంగా కనిపించాయని అధ్యయనం పేర్కొంది. జెనటిక్ స్థాయిల పరిస్థితేంటి? తీసుకునే ఆహారానికి తగ్గట్లు శరీరంలో మార్పులు జరుగుతాయి. పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, దుంపల వంటి తేలిగ్గా జీర్ణమయ్యే సహజసిద్ద ఆహారం తీసుకుంటే ప్రోటీన్లు, విటమిన్లు తగిన మోతాదులో అంది శరీరంలో సానుకూల మార్పులు జరుగుతాయి. అలాగాక బాగా వేయించిన, ప్యాక్ చేసిన, నూనెలు అతిగా వాడిన, పూర్తి ప్రాసెస్డ్ ఆహారం తీసుకుంటే పోషకాలందక ఒంట్లో ప్రతికూల మార్పులు సంభవిస్తాయి. దాంతో వయసు మీద పడకుండా ఆపే సహజసిద్ధ సామర్థ్యం తగ్గుతుంది. వేడిమి సందర్భాల్లోనూ ఒంట్లోని జన్యు కణాలు విరుద్ధ రీతిలో స్పందిస్తాయి. ఫలితంగా ఏ సందర్భంలో ఏ రకం ప్రొటీన్‌ను ఎంత మోతాదులో ఉత్పత్తి చేయాలనే డీఎన్ఏ సీక్వెన్స్ దెబ్బ తింటుంది. ఇది శరీర భౌతిక క్రియలపై ప్రతికూల ప్రభావం చూపి ఆరోగ్య స్థితిని పాడుచేసే ప్రమాదముంది. వేడిమి వృద్దాప్య రేటును నిర్దేశించే జన్యు కణాలను అసంబద్ధంగా క్రియాశీలం చేస్తుంది. అలా ముందుగానే వృద్ధాప్యంలోకి జారిపోతాం. పరిశోధనల్లోఏం తేలింది? 68 ఏళ్ల పైబడిన 3,700 మందిపై సదరన్ కాలిఫోరి్నయా వ ర్సిటీలో పరిశోధన చేశారు. తక్కువ వయ సు వారిలో పోలిస్తే పెద్దవాళ్ల మీదే అత్యధిక ఉష్ణోగ్రత పరిస్థితులు అధిక ప్రభావం చూ పాయి. వయసు పెరిగేకొద్దీ వేడిని నియంత్రించుకునే సామర్థ్యమూ సన్నగిల్లుతోంది. దాంతో అనారోగ్యం బారిన పడటం, చనిపోవడం వంటివి జరుగుతున్నాయి. వృద్ధాప్య ఛాయలను నిర్ధారించే మూడు రకాలైన పీసీఫీనో ఏజ్, పీసీగ్రిమ్ ఏజ్, డ్యూన్డిన్ పేస్ జీవ గడియార పద్దతుల్లో వలంటీర్ల రక్త నమూనాలను పరిశీలించారు. 2010 నుంచి ఆరేళ్లపాటు వీళ్లంతా అధిక వేడి పరిస్థితులను ఎదుర్కొన్నప్పటి పరిస్థితులను పోలి్చచూశారు. అమెరికాలో ప్రామాణికమైన 32 డిగ్రీ సెల్సియస్ వరకు సాధారణ, 32–39 డిగ్రీలను మధ్యస్థ, 39–51 డిగ్రీల దాకా అతి తీవ్ర వేడిమిగా పరిగణించి వ లంటీర్ల డేటాతో సరిచూశారు. పీసీఫినో ఏజ్ ప్రకారం సుదీర్ఘకాలం వేడికి గురైతే 2.48 ఏళ్లు ముందుగానే వృద్ధాప్యం వస్తుందని తేలింది. పీసీగ్రిమ్ ఏజ్ పద్దతిలో 1.09 ఏళ్లు, డ్యూన్డిన్ పేస్ పద్ధతిలో 0.05 ఏళ్లు ముందుగా వృద్ధాప్యం వస్తుందని వెల్లడైంది. వేడికి, వయసుకు లింకేమిటి? వయసు మీద పడటం సహజ ప్రక్రియ. వృద్ధాప్య ఛాయలు బయట పడటం ఒక్కో మనిషిలో ఒక్కోలా ఉంటుంది. ఒత్తిళ్లు, షాక్ వంటి అనూహ్య ఘటనలు ఎదురైనప్పుడు శరీరంలో పెనుమార్పులు సంభవిస్తాయి. చాన్నాళ్లపాటు సరిగా నిద్ర పోకుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రావడం ఖాయం. అత్యధిక వేడిమి పరిస్థితులు మనిషిలోని సత్తువను లాగేస్తాయి. జీవక్రియలను పూర్తిస్థాయిలో చేసే సామర్థ్యాన్ని శరీరం క్రమంగా కోల్పోతుంది. వయసు మీదపడే రేటు పెరుగుతుంది. వృద్ధాప్యంలో రావాల్సిన రోగాలు ముందే ముసురుకుంటాయి. -
పాత మందుతో 48 గంటల్లో వైరస్‌కు చెక్?
ప్రాణాంతక కరోనా వైరస్‌ను ఇవర్‌మెక్టిన్ అనే మందు 48 గంటల్లోనే మట్టుబెడుతున్నట్లు మొనాశ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనం స్పష్టం చేసింది. శరీరంలోని పరాన్న జీవులను చంపేందుకు ఈ మందును చాలాకాలంగా వాడుతుండగా ఆస్ట్రేలియాలోని మొనాశ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీన్ని కోవిడ్‌పై ప్రయోగించి చూసింది. పరిశోధన శాలలో పెంచిన కరోనా వైరస్‌పై ఈ మందును ప్రయోగించినప్పుడు ఒకే ఒక్క డోస్‌తో వైరస్ 48 గంటల్లో మరణించినట్లు ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్ కైల్ వాగ్‌స్టాఫ్ తెలిపారు. ఈ మందు పరిశోధనశాలలో కరోనా వైరస్‌తోపాటు డెంగీ, ఇన్‌ఫ్లూయెంజా, జికా, హెచ్ఐవీ వైరస్‌లపై కూడా ప్రభావం చూపిందని చెప్పారు. 24 గంటల తరువాతే ప్రభావం కనిపించడం మొదలైందని వాగ్‌స్టాఫ్ తెలిపారు. ఇవర్‌మెక్టిన్‌ను అందరికీ అందుబాటులోకి తేవాలంటే మరిన్ని పరీక్షలు తప్పనిసరిగా చేయాల్సి ఉందని, తాము కేవలం పరిశోధనశాలలో మాత్రమే ప్రయోగాలు చేశామని డాక్టర్ కైల్ వాగ్‌స్టాఫ్ తెలిపారు. అయితే ఈ మందును చాలాకాలంగా వాడుతున్న కారణంగా సురక్షితమైందని మాత్రం చెప్పవచ్చునని, వేసే మోతాదు ఎంతన్నది ఇంకా నిర్ణయించాల్సి ఉందని, ఇవన్నీ త్వరలో నిర్ణయిస్తామని చెప్పారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో, అనుమతి పొందిన చికిత్స ఏదీ లేని తరుణంలో ఇప్పటికే వాడుతున్న మందు ఒకటి అందుబాటులో ఉందని తెలిస్తే.. ప్రజలు వేగంగా కోలుకునే అవకాశం ఏర్పడుతుందని వివరించారు. -
ఎక్కువ చేస్తే అంతే..
కాన్బెర్రా(ఆస్ట్రేలియా): మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారంతో పాటు తగినంత వ్యాయామం కూడా అవసరం. అయితే అది పరిమితికి మించి ఉండరాదని అంటున్నారు ఆస్ట్రేలియాలోని మొనాష్ యూనివర్సిటీ పరిశోధకులు. రోజూ వ్యాయామం చేసేవారు గంట, రెండు గంటలకు మించి చేయకూడదని.. నాలుగు, అయిదు గంటలు వ్యాయామం చేస్తే పేగుల్లో ఉన్న బ్యాక్టీరియా రక్తంలో చేరుతుందంటున్నారు. తద్వారా రక్తం విషపూరితంగా మారి ప్రాణానికి ప్రమాదం చేకూరుస్తుందని తమ పరిశోధనల్లో తేలిందని చెప్పారు. తగిన ఆహారం తీసుకోకుండా వ్యాయామం చేస్తే క్యాలరీలు పూర్తిగా ఖర్చైపోయి మనిషి శారీరకంగా కుంగిపోయే ప్రమాదం కూడా ఉందని వారు అంటున్నారు. అలాగే మోతాదు మించి వ్యాయామం చేస్తే శరీరంలోని ఎముకలకు రాపిడి ఎక్కువై కరిగిపోయే ప్రమాదముంటుందని హెచ్చరిస్తున్నారు. సుదీర్ఘ వ్యాయామం చేసేవారి రక్త నమూనాలు వ్యాయామానికి ముందు వ్యాయామానికి తరువాత సేకరించి పరీక్షలు జరిపి ఆ వివరాలును వెల్లడిస్తున్నట్లు వారు ప్రకటించారు.


