
మాస్కో: 2025 ఏడాదికిగానూ నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize)ప్రకటన వెలువడే సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతిస్తున్నట్లు రష్యా ప్రకటించింది.
ఉక్రెయిన్ సంక్షోభాన్ని ముగించేందుకు ట్రంప్ చేస్తున్న కృషిపై రష్యా ఎప్పటికప్పుడు ప్రశంసలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. బహుమతి ప్రకటనకు చివరి గంటల్లో రష్యా అనూహ్యంగా మద్దతు ప్రకటించింది. ఈ మేరకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి యూరీ ఉషాకోవ్ పేరిట శుక్రవారం ఉదయం ఒక ప్రకటన వెలువడింది.
మరోవైపు.. యుద్ధ విరామం జరిగితేనే తాము కూడా ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తామంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఉక్రెయిన్ మద్దతు ఇవ్వనట్లే అని భావించాలి. ఇక..
నోబెల్ శాంతి బహుమతి పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతులేని ఆశ పెట్టుకున్నారు. తనవల్లే ప్రపంచంలో పలు దేశాల మధ్య జరుగుతోన్న ఘర్షణలు ఆగాయని ఒకటే ప్రకటించుకుంటున్నారు. ఒకవేళ ఈ ఏడాది శాంతి బహుమతి రాకుంటే ట్రంప్ ఏం చేస్తారనే ఉత్కంఠ ప్రపంచం మొత్తం నెలకొంది. అదే సమయంలో ఈ ఏడాది కాకున్నా వచ్చే ఏడాదిలో ఆయన నోబెల్ కల తీరవచ్చనే విశ్లేషణ ఒకటి నడుస్తోంది. మరికొద్ది సేపట్లో నోబెల్ శాంతి బహుమతి ప్రకటన వెలువడనుంది.
ఇదీ చదవండి: అందుకే ట్రంప్‌కు నో నోబెల్!