
ఢాకా: బంగ్లాదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న హిందువులు అత్యంత ఘనంగా దుర్గా పూజలను ప్రారంభించారు. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా పోలీసు సిబ్బందిని భద్రత కోసం మోహరించింది. చెదురుమదురు ఘటనలు మినహా దేశవ్యాప్తంగా దుర్గా పూజలు కొనసాగుతున్నాయి.
రాజధాని ఢాకాలోని ఢాకేశ్వరి ఆలయంలో ఆదివారం దుర్గాదేవిని స్వాగతించడానికి భక్తులు ర్యాలీగా తరలివచ్చారు. మారుమోగిన దుర్గాదేవి మంత్రాలు, డప్పు చప్పుళ్లు, శంఖు నాదాలు, ఆలయ గంటల నడుమ అమ్మవారిని ఆహ్వానించారు. మహా షష్టి రోజున దేవత ముఖాన్ని ఆవిష్కరించడంతో పండుగ మొదటి రోజు ఉత్సవం ప్రారంభమైందని స్థానికులు తెలిపారు. ‘ఈ ఏడాది పూజలను అత్యంత ఉత్సాహంగా జరుపుకోవాలని అనుకుంటున్నాం. ప్రభుత్వం అందిస్తున్న సహాయం, భద్రతా ఏర్పాట్ల విషయంలో ఎంతో సంతోషంగా ఉన్నాం’ అని బంగ్లాదేశ్ పూజా వేడుకల మండలి అధ్యక్షుడు బసుదేవ్ ధార్ మీడియాకు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి దేశవ్యాప్తంగా పూజా మండపాల సంఖ్య మరింతగా పెరిగిందని ఆయన అన్నారు.
ఇప్పటివరకు 11 దుర్గామండపాల వద్ద చిన్నపాటి ఘర్షణలు చోటుచేసుకున్నాయని, పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని నిందితులను అరెస్టు చేశారని బసుదేవ్ ధార్ తెలిపారు. దేశవ్యాప్తంగా 33,350 మండపాలలో దుర్గా పూజలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ వార్తా సంస్థ బంగ్లాదేశ్ సంగ్బాద్ సంస్థ (బీఎస్‌ఎస్) తెలిపిన వివరాల ప్రకారం దుర్గా పూజల నేపధ్యంలో దేశమంతటా దాదాపు రెండు లక్షల మంది పారా పోలీస్ సిబ్బంది, 15 వేల మందికి పైగా పారా మిలిటరీ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ)కు చెందిన 430 ప్లాటూన్‌లను నియమించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు 70 వేల మందికి పైగా పోలీసుల పహారా కాయనున్నారు. ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ దుర్గా పూజల సన్నాహాలు వీక్షించేందుకు డాకేశ్వరి ఆలయాన్ని సందర్శించారు.