బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్‌లో అక్కడి రాడికల్ నేత ఉస్మాన్ హాదీ మృతితో నిరసనలు ఉవ్వెత్తున ఎగిశాయి. ఈ నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాలోని భారత అధికారులు, వారి కుటుంబాలు వెంటనే అక్కడినుంచి దేశానికి తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో హిందువులే టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడంతో హిందు దేవాలయాలు, వ్యక్తులే టార్గెట్‌గా ఇంతకాలం దాడులు జరిగాయి. అవి కొద్ది మేర సద్దుమణుగుతాయనే సమయంలోనే అక్కిడ రాడికల్ నేత ఉస్మాన్ హాదీని దుండగులు హతమార్చడంతో అక్కడి మతఛాందస వాదులు విరుచుకపడుతున్నారు. హిందువులే టార్గెట్‌గా దాడులు జరిపి వారిని హతమారుస్తున్నారు. ఇటీవల బ్రిటన్ పార్లమెంటులో సైతం ఈ ప్రస్థావన వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. భారత అధికారులు వారి కుటుంబసభ్యులు వెంటనే మాతృ దేశానికి తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది." ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్యా భారత అధికారులు వారి కుటుంబసభ్యులు స్వదేశానికి తిరిగి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే బంగ్లాదేశ్‌లో ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్ కొనసాగుతుంది". అని అధికారులు పేర్కొన్నారు.
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు తగ్గేంత వరకూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ దేశంలో వచ్చే నెలలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ హిందువులపై దాడులు పెరుగుతున్నట్లు పలువురు అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


