ముగ్గురి డీఎన్‌ఏతో ముద్దుల పిల్లలు  | Babies from three peoples DNA prevents hereditary disease | Sakshi
Sakshi News home page

ముగ్గురి డీఎన్‌ఏతో ముద్దుల పిల్లలు 

Jul 18 2025 4:58 AM | Updated on Jul 18 2025 4:58 AM

Babies from three peoples DNA prevents hereditary disease

వంశపారంపర్య వ్యాధులకు చెక్‌  

ప్రపంచంలోనే తొలిసారి 

బ్రిటిష్‌ సైంటిస్టుల ఘనత 

వేలాది మంది మహిళలను మాతృత్వానికి దూరం చేస్తున్న మైటోకాండ్రియా సంబంధిత వంశపారంపర్య వ్యాధులకు బ్రిటన్‌లో జీవ శాస్త్రజ్ఞులు వినూత్న మార్గం ద్వారా చెక్‌ పెట్టారు. ప్రపంచంలోనే తొలిసారిగా ముగ్గురి డీఎన్‌ఏ సాయంతో శిశువుల పుట్టుకను సుసాధ్యం చేసి చూపించారు. వంశపారంపర్యంగా పిల్లలు మైటోకాండ్రియా లోపాలతో పుడుతున్న కుటుంబాలకు ఇది అక్షరాలా వరప్రసాదంగా మారింది.

 ఈ పద్ధతిలో బ్రిటన్‌లో ఇటీవలే తొలిసారిగా తొమ్మిది మంది పండంటి పాపాయిలు జన్మించారు. వీరిలో నలుగురు బాబులు కాగా ఐదుగురు ఆడపిల్లలు. వారిలో ఇద్దరు కవలలు కావడం విశేషం. తమ కుటుంబాలకు తరతరాల శాపంగా పరిణమించిన ప్రాణాంతమైక మైటోకాండ్రియా లోపాలేవీ లేకుండా వారంతా పూర్తి ఆరోగ్యంతో పుట్టడం విశేషం! దీన్ని వైద్య చరిత్రలోనే కీలక మైలురాయిగా భావిస్తున్నారు. 

మైటో లోపాలుంటే అంతే... 
మైటోకాండ్రియా లోపాలతో పుట్టే పిల్లల్లో జీవక్రియలకు కావాల్సిన ఎలాంటి శక్తీ ఉండదు. చివరికి కనీసం గుండె కొట్టుకోవడానికి అవసరమైన శక్తి కూడా ఒంట్లో లేకుండా పోతుంది. దాంతో కండరాలు అత్యంత శక్తిహీనంగా మారతాయి. దాంతో మెదడు దెబ్బ తినడం మొదలుకుని గుడ్డితనం దాకా నానారకాల వ్యాధుల బారిన పడతారు. చాలా కేసుల్లో ఇలాంటి పిల్లలు బతికి బట్టకట్టడం కూడా గగనమే. 

రోజుల వ్యవధిలోనే మృత్యువాత పడి తల్లిదండ్రులకు తీరని గర్భశోకం మిగులుస్తుంటారు. ఇంతటి విపత్తుకు కారణమయ్యే మైటోకాండ్రియా లోపాలు అత్యధిక కేసుల్లో తల్లి నుంచే నవజాత శిశువుకు సంక్రమిస్తుంటాయి. ప్రతి 5,000 మంది పిల్లల్లో ఒకరు ఈ సమస్యలతో పుడుతుంటారు. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో ఏటా కనీసం 20 నుంచి 30 మంది దంపతులు ఈ సరికొత్త చికిత్స విధానంతో సంతానపు కలను నిజం చేసుకోనున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. 

ఇలా సరిచేశారు... 
బ్రిటన్‌ జీవ శాస్త్రజ్ఞులు కనిపెట్టిన కొత్త విధానంలో పాపాయిలు తమ డీఎన్‌ఏలో అత్యధిక శాతాన్ని తల్లిదండ్రుల నుంచే పొందుతారు. కాకపోతే దాతగా వ్యవహరించే మరో ఆరోగ్యకరమైన మహిళ నుంచి అత్యల్ప పరిమాణంలో, అంటే 0.1 శాతాన్ని అందుకుంటారు. మైటోకాండ్రియా పిల్లలకు కేవలం తల్లి నుంచే అందుతుంది. ఈ సరికొత్త డీఎన్‌ఏ తల్లి ద్వారా వంశపారంపర్యంగా వచ్చే మైటోకాండ్రియా లోపాలను పూర్తిస్థాయిలో అరికడుతుంది. తద్వారా పిల్లలు పూర్తి ఆరోగ్యంతో పుడతారు. సదరు డీఎన్‌ఏ మార్పు వారి వారసులందరికీ పారంపర్యంగా అందుతూ వెళ్తుంది. 
 

మైటోకాండ్రియా...కణంలో శక్తి భాండాగారం 
స్తూపాకృతిలో ఉండే మైటోకాండ్రియా సులువుగా అర్థమయేలా చెప్పాలంటే ఒక సూక్ష్మ కణాంగం. కణంలో జరిగే అనేకానేక జీవక్రియలకు అవసరమైన శక్తినంతటినీ సిద్ధం చేసి పెట్టేది ఇదే. అందుకే మైటోకాండ్రియాను కణం తాలూకు శక్తి భాండాగారమని చెబితే అతిశయోక్తి కాదు. అసలు మనం శ్వాసిస్తున్నామంటే అందుకు కారణం కూడా మైట్రోకాండ్రియానే. తినే ఆహారాన్ని ఇది శరీర క్రియలు జరిగేందుకు కావాల్సిన శక్తిగా మారుస్తుంది. అందుకోసం ఆక్సిజన్‌ను ఉపయోగించుకుంటుంది. పాక్షిక స్వయంప్రతిపత్తితో పని చేయడం వీటి ప్రత్యేకత. ఇవి రెండు పొరలతో కూడుకుని ఉంటాయి. చూసేందుకు ఇవి అచ్చం కణత్వచాన్ని         తలపిస్తాయి.

పదేళ్ల ముందే కనిపెట్టినా... 
నిజానికి ఈ ‘ముగ్గురి డీఎన్‌ఏ’ పద్ధతిని బ్రిటన్‌లోని న్యూక్యాజిల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన టైన్‌ హాస్పిటల్స్, ఎన్‌హెచ్‌ఎస్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ జీవ శాస్త్రవేత్తలు పది సంవత్సరాల క్రితమే కనిపెట్టారు. భార్య అండంతో పాటు దాతగా వ్యవహరించే మరో ఆరోగ్యకరమైన మహిళ నుంచి సేకరించిన అండాన్ని కూడా భర్త వీర్యంతో   లేబోరేటరీలో విడిగా ఫలదీకరణ చెందిస్తారు. అనంతరం రెండో పిండంలోని ఆరోగ్యకరమైన మై టోకాండ్రియాను భార్య పిండంలోకి చొప్పిస్తారు. తద్వారా పుట్టే పాపాయి జన్యుపరంగా తల్లిదండ్రుల లక్షణాలనే పుణికి పుచ్చుకుంటుంది. కానీ మైటోకాండ్రియా లోపా లేవీ లేకుండా ఆరోగ్యకరంగా పుడుతుంది.

బ్రిటన్‌లోనే అనుమతి 
ఈ ‘ముగ్గురి డీఎన్‌ఏ’ విధానానికి ప్రస్తుతం కేవలం బ్రిటన్‌లో మాత్రమే అనుమతి ఉంది. ఈ మేరకు 2015 సంవత్సరంలోనే అక్కడి పార్లమెంట్‌ ఓ చట్టాన్ని ఆమోదించింది. కానీ ఇలా పుట్టే పిల్లల్లో 0.1 శాతం వేరే మహిళ డీఎన్‌ఏ ఉంటుంది. అది ముందు తరాలకు కూడా అవిచ్చిన్నతంగా అందుతూ వెళ్తుంది. మరోలా చెప్పాలంటే సదరు కుటుంబపు డీఎన్‌ఏలో శాశ్వత మార్పు లు చోటుచేసుకుంటాయి. దాంతో ఈ పద్ధతిపై అప్పట్లోనే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.  

మాకిది కొత్త జీవితం 
‘‘ఆరోగ్యకరంగా పిల్లలను కనడం ఈ జన్మకు సాధ్యం కాదన్న నిశ్చయానికి వచ్చి భారంగా బతుకీడుస్తున్నాం. ఎట్టకేలకు మా పాలిట వరప్రసాదంలా ఈ కొత్త తరహా చికిత్స అందివచ్చింది. పూర్తి జీవశక్తితో కళకళలాడుతూ ముద్దులు మూటగడుతున్న మా బుజ్జాయిని చూస్తుంటే ఆనందంతో నోటమాట కూడా రావడం లేదు. ఇది నిజమంటే ఇప్పటికీ ఓ పట్టాన నమ్మబుద్ధే కావడం లేదు’’ 

– ‘ముగ్గురి డీఎన్‌ఏ’ పద్ధతిలో పాపను కన్న మహిళల హర్షాతిరేకాలు 
(గుర్తింపును గోప్యంగా ఉంచేందుకని వారు తమ వివరాలను బయటపెట్టలేదు) 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement