ట్రంప్‌ నిర్ణయాలన్నీ ‘తలకిందులే’నా?!

Are Donald Trump All Decisions Okay - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి దిశగా ప్రయాణిస్తోన్న డొనాల్డ్‌ ట్రంప్‌ తన నాలుగేళ్ల కాలంలో ఏమేమి పనులు చేశారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఒక్కసారి సమీక్షిస్తే విస్మయం కలుగుతోంది. గత దేశాధ్యక్షుడు బరాక్‌ ఒబామా తీసుకున్న నిర్ణయాలను ట్రంప్‌ పూర్తిగా తల కిందులు చేశారు. అంతర్జాతీయంగా చేసుకున్న పలు ఒప్పందాల నుంచి వైదొలిగారు. కీలకమైన వాతావరణ మార్పుల ఒప్పందం నుంచి అమెరికాను తప్పించారు. అమెరికాలో పర్యావరణ పరిరక్షణకు నిర్దేశించిన ప్రమాణాలను నీరుగార్చారు. (చదవండి: ట్రంప్‌కు మరో తలనొప్పి : వైట్ హౌస్‌ చీఫ్‌కు కరోనా)

  • దినదినం ప్రవర్దమానమువుతున్న చైనా ప్రభావాన్ని అడ్డుకునేందుకు ఏర్పాటు చేసుకున్న ‘ట్రాన్స్‌ పసిఫిక్‌ పార్టనర్‌షిప్‌’ నుంచి అమెరికాను తొలగించారు. 
  • క్యూబా, ఇరాన్‌తో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేశారు. 
  • ప్రజల ఆరోగ్య అవసరాల కోసం  ఒబామా సుదీర్ఘకాలం కృషి చేసి తీసుకొచ్చిన హెల్త్‌ కేర్‌ చట్టాన్ని కూడా ట్రంప్‌ నీరుగార్చారు.
  • ఇరాన్‌ అణు ఒప్పందంగా పిలిచే ఏడు దేశాల ‘జాయింట్‌ కాంప్రిహెన్సివ్‌ ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌’ నుంచి అమెరికాను తప్పించి ఇరాన్‌ మీద మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించారు. సిరియా, యెమెన్‌ అంతర్యుద్ధాల్లో జోక్యం చేసుకోవడం వల్ల అప్పటికే ఇరాన్‌ ఆర్థికంగా ఎంతో దెబ్బతిని ఉంది. 
  • 2019, జూన్‌ నెలలో ఇరాన్స్‌ రెవెల్యూషనరీ గార్డ్‌ కోర్‌ ఓ అమెరికా నిఘా విమానాన్ని కూల్చి వేయగా, అందుకు ప్రతీకారంగా ఇరాన్‌కు చెందిన 130 మిలియన్‌ డాలర్ల పైలట్‌ రహిత విమానాన్ని అమెరికా సైన్యం కూల్చి వేసింది. ఇరాన్‌ రేడార్‌ను, క్షిపణుల బ్యాటరీలను కూడా ధ్వంసం చేయాలని అమెరికా చూసింది. తద్వారా ఇరాన్‌తో పూర్తి స్థాయి యుద్ధం తధ్యమవుతున్న ఉద్దేశంతో ట్రంప్, చివరి నిమిషంలో దాడిని ఉపసంహరించుకున్నారు. ఆ దాడి వల్ల 150 మంది ఇరాన్‌ ప్రజలు మరణిస్తారని తెలుసుకొని ఆ దాడిని ఉపసంహరించుకున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు.
  • ఇరాక్, సిరియా, లెబనాన్, యెమెన్‌ దేశాల్లో ఇరాన్‌ సైనిక బలగాలు తిష్టవేయడానికి బాధ్యుడైన ఇరాన్‌ ప్రముఖ నాయకుడు జనరల్‌ ఖాసిం సొలైమనిని 2020, జనవరి నెలలో ట్రంప్‌ చంపించడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. అందుకు ప్రతీకారంగా ఇరాన్‌ సైనికులు ఇరాక్‌లోని రెండు అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా రాకెట్‌ దాడులకు పాల్పడింది.
  • అందులో భాగంగా టెహరాన్‌ నుంచి బయల్దేరిన ఉక్రెనియన్‌ ఏర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని ఇరాన్‌ సైనికులే పొరపాటున కూల్చి వేశారు. ఇరాన్‌ ప్రయాణికులు ఎక్కువగా ఉన్న ఆ విమానంలో ప్రయాణిస్తోన్న మొత్తం 176 మంది మరణించారు. మరోపక్క జనరల్‌ సులైమన్‌ అంత్యక్రియల్లో తొక్కిసలాట జరగడంతో 56 మంది మరణించారు. కొన్ని వందల మంది గాయపడ్డారు. వారంతట వారే శిక్ష విధించుకున్నారని సంతృప్తి పడిన ట్రంప్, ఇరాన్‌పై తదుపరి దాడులను ఉపసంహరించుకున్నారు. 
  • అమెరికా ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేకుండా సిరియాకు రసాయనిక ఆయుధాలు అందకుండా చేయడం కోసం రష్యా నేత వ్లాదిమిర్‌ పుతిన్‌తో ట్రంప్‌ ఒప్పందం చేసుకున్నారు. 
  • సిరియా, అఫ్ఘానిస్తాన్‌ దేశాల నుంచి అమెరికా సైనిక బలగాలు ట్రంప్‌ ఉపసంహరించారు. 
  • ‘ప్రపంచ పోలీసు అమెరికా’ అనే ముద్ర నుంచి అమెరికాను తప్పించేందుకు ట్రంప్‌ కృషి చేశారు. 
  • అమెరికా మాజీ అధ్యక్షులకు ముప్పు రాకుండా ఉండేందుకే ఆయన అంతర్జాతీయంగా అమెరికా పాత్ర కుదిస్తూ రావడం కొంత మేరకు ట్రంప్‌కు ప్రశంసలు తీసుకొచ్చిందని చెప్పవచ్చు. అయితే ట్రంప్‌ మెతక వైఖరిని అలుసుగా తీసుకొన్న చైనా మరోవైపు అమెరికాకు ప్రత్యామ్నాయంగా బలపడుతూ వస్తోంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top