ట్రంప్‌కు మరో తలనొప్పి : వైట్ హౌస్‌ చీఫ్‌కు కరోనా

Trump Chief Of Staff Tests Positive For Coronavirus: Report - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పీఠం ఎవరికి దక్కనుందన్న ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు. మరోవైపు కరోనా మహమ్మారి పాజిటివ్‌ కేసులు రికార్డుస్థాయిలో నమోదు కావడం వణికిస్తోంది. తాజాగా వైట్ హౌస్ చీఫ్, నార్త్ కరోలినా మాజీ శాసనసభ్యుడు మార్క్ మెడోస్ కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. తనకు ప్రాణాంతకమైన వైరస్‌ సోకిందని మెడోస్ తన సన్నిహితులకు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో వైట్ హౌస్, మెడోస్ కార్యాలయం నుండి అధికారికగా స్పందించాల్సి ఉంది. (‘‘చిల్ డొనాల్డ్‌ చిల్‌’’ ట్రంప్‌కు గట్టి కౌంటర్‌)

డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రచార బృందంలో మరో ముఖ్యుడు నిక్ ట్రైనర్‌కు కూడా కోవిడ్-19 పాజిటివ్‌ నిర్దారణ అయినట్టుగా తెలుస్తోందని రాయిటర్స్‌ నివేదించింది. ఎన్నికల ప్రచారంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన  ర్యాలీల్లోనూ ట్రంప్‌తో కలిసి వీరు పాల్గొన్నారు. అంతేకాదు పలువురు ట్రంప్ ముఖ్య అనుచరుల పాల్గొన్న ఎన్నికల రాత్రి వైట్హౌస్‌ పార్టీలో కూడా మెడోస్‌ పాల్గొన్నారని రాయిటర్స్‌ తెలిపింది. ఎన్నికల అనంతరం తనదే విజయమంటూ ట్రంప్ ప్రకటించిన సమావేశానికి మాస్క్‌ లేకుండా మెడోస్‌ హాజరయ్యారు. దీంతో ఒకవైపు అందనంత దూరం పోతున్న అధికార పీఠం, మరోవైపు తన ప్రధాన సలహాదారులకు వైరస్‌ సోకడం  ట్రంప్‌కు తలనొప్పిగా పరిణమించింది.(వైట్‌హౌస్‌ నుంచి వెళ్లిపోతున్న ట్రంప్‌..?!)

కాగా డొనాల్డ్‌ ట్రంప్‌ అతని భార్య మెలానియా, కుమారుడు బారన్‌ కూడా అక్టోబరులో వైరస్ బారినసంగతి తెలిసిందే. ట్రంప్ మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అలాగే ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రెయిన్ కూడా వైరస్ బారిన పడ్డారు. ట్రంప్‌తో ర్యాలీలో పాల్గొన్న అనంతరం కరోనా బారిన పడిన మరో సన్నిహితుడు మాజీ రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి హర్మన్ కేన్ చనిపోయారు. అమెరికాలో ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 9.82 మిలియన్లను దాటేసింది. మరణాల సంఖ్య 2 లక్షల 36వేలకు చేరుకుంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top