ప్రాణం తీసిన అన్నాబెల్లె బొమ్మ!? | Annabelle Doll handler Dan Rivera News Interesting Case Details | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన అన్నాబెల్లె బొమ్మ!?

Jul 16 2025 5:22 PM | Updated on Jul 16 2025 5:52 PM

Annabelle Doll handler Dan Rivera News Interesting Case Details

అన్నాబెల్లె.. ది కంజూరింగ్‌ సిరీస్‌ సినిమాలు చూసిన వాళ్లకు పరిచయం అక్కర్లేని పేరు. అయితే సినిమాటిక్‌ ప్రపంచంలో ఈ బొమ్మ ఎలా ఉన్నా.. వాస్తవ ప్రపంచంలో మాత్రం దీని రూపురేఖలు మరోలా ఉంటాయి. అయితే ఈ బొమ్మతో స్టంట్‌లు చేయబోయి ఓ పారానార్మల్‌ ఇన్వెస్టిగేటర్‌ అనూహ్యంగా ప్రాణం పొగొట్టుకున్నారు.

అమెరికాలో కనెక్టికట్‌ స్టేట్‌లోని న్యూఇంగ్లండ్‌ సొసైటీ ఫర్‌ సైకిక్‌ రీసెర్చ్‌(NESPR) వాళ్లు.. డెవిల్స్‌ ఆన్‌ ది రన్‌ పేరుతో టూర్లు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో భయానక వస్తువులుగా ముద్రపడినవాటి గురించి వివరించడం ఈ షో ఉద్దేశం. ఇందులో భాగంగా.. అన్నాబెల్లె ఒరిజినల్‌ బొమ్మతో డాన్‌ రివెరా(54) అనే పారానార్మల్‌ ఇన్వెస్టిగేటర్‌ స్టంట్లు చేస్తున్నాడు. అయితే అనూహ్యంగా ఈ పర్యటనలోనే ఆయన కన్నుమూశారు.

పెన్సిల్వేనియా గెట్టిస్‌బర్గ్‌ సమీపంలో.. జులై 13న తాను బస చేసిన హోటల్‌ గదిలో విగత జీవిగా ఆయన పడి కనిపించాడు. సీపీఆర్‌ చేసినా ఆయనలో చలనం లేదు. మృతికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది. బహుశా గుండెపోటుతో ఆయన మరణించి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. అయితే.. 

ఆయన చనిపోయిన టైంలో ఆ బొమ్మ హోటల్‌ గదిలో లేదు. బయట తాళం వేసి ఉన్న ఓ వ్యాన్‌లో బొమ్మ కనిపించింది. దానిని ఎవరు అక్కడ ఉంచారనేది తేలాల్సి ఉంది. దీంతో బొమ్మను ఆయన చావుకు ముడిపెట్టి చర్చ నడిపిస్తున్నారు. డాన్‌ రివెరా(dan Rivera) మృతిపై ఇప్పటికైతే అనుమానాలు నెలకొన్నాయి. అటాప్సీ(శవపరీక్ష) నివేదిక వస్తేనే ఈ మృతి మిస్టరీ వీడేది.  

ఎన్‌ఈఎస్‌పీఆర్‌ అనే సంస్థను ప్రముఖ డీమనాలజిస్టులు(దెయ్యాలు, భూతాలు, ఆత్మలపై పరిశోధనలు చేసేవారు), పారానార్మల్‌ ఇన్వెస్టిగేటర్లు ఎడ్‌, లారాయిన్‌ వారెన్‌లు స్థాపించారు. డాన్‌ రివెరా.. గతంలో అమెరికా సైన్యంలో పని చేశారు. ఎన్‌ఈఎస్‌పీఆర్‌తో చాలాకాలంగా ఆయనను అనుబంధం ఉంది. లారాయిన్‌ వారెన్‌కు ముఖ్యశిష్యుడు కూడా. అంతేకాదు.. గతంలో ఓ చానెల్‌లో మోస్ట్‌ హంటెడ్‌ ప్లేసెస్‌ అనే కార్యక్రమంలోనూ ఈయన పాల్గొన్నారు. అదే సమయంలో నెట్‌ఫ్లిక్స్‌ ‘28 డేస్‌ హాంటెడ్‌’ అనే సిరీస్‌లోనూ కనిపించారు.  

చాలాకాలంగా అన్నాబెల్లె బొమ్మను ఈయనే చూసుకుంటున్నారు. టిక్‌టాక్‌లో ఆ బొమ్మ షార్ట్‌ వీడియోస్‌ కూడా విశేషంగా ఆదరణ దక్కించుకున్నాయి. ఈ విషాదంపై ఎన్‌ఈఎస్‌పీఆర్‌ దిగ్భ్రాంతి  వ్యక్తం చేసింది. అయితే డెవిల్స్‌ ఆన్‌ ది రన్‌ మాత్రం ఆగదని స్పష్టం చేసింది. పైగా ఈ బొమ్మతో ఇప్పటిదాకా ప్రాణాలు పోయిన దాఖలాలు లేవని చెబుతున్నారు.

కొన్నాళ్ల కిందట లూసియానా టూర్‌లో అన్నాబెల్లె బొమ్మ కనిపించకుండా పోయిందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే వాటిని రివెర కొట్టిపారేశారు. బొమ్మ సురక్షితంగానే ఉందని ప్రకటించారు. 

అసలు అన్నాబెల్లే బొమ్మ The Conjuring సినిమాల్లో చూపించిన పోర్సలిన్ బొమ్మ కాదు. నిజ జీవితంలో ఇది రాగ్గెడీ అన్న్ అనే క్లాత్ డాల్, ఎర్ర రంగు నూలతో చేసిన జుట్టుతో ఉంటుంది. కానీ, దీని వెనుక ఉన్న కథ చాలా భయానకంగా ఉంటుంది. 

1970లో.. ఈ బొమ్మను లారా క్లిఫ్టన్, డియర్డ్రె బెర్నార్డ్ అనే ఇద్దరు నర్సింగ్ విద్యార్థినులకు బహుమతిగా ఇచ్చారు. మొదట ఇది సాధారణ బొమ్మలా అనిపించినా, కొద్దిరోజుల్లో దానంతట అదే కదలడం మొదలైందట. దీంతో వాళ్లు ఓ నిపుణుడ్ని సంప్రదించగా, ఈ బొమ్మలో అన్నాబెల్లే హిగ్గిన్స్ అనే చిన్న అమ్మాయి ఆత్మ ఉందని చెప్పారు. పైగా HELP US, HELP CAL అనే రాతలతో ఉన్న పేపర్లు ఆ ఇంట్లో ప్రత్యక్షమయ్యాయి. పెన్సిల్‌ కూడా లేని ఇంట్లో అవి కనిపించడంతో అంతా భయపడిపోయారు. ఆ సమయంలోనే.. 

పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు వారెన్ దంపతుల వద్దకు బొమ్మ చేరింది. వాళ్లు దానిని తమ ఇంటి బేస్‌మెంట్‌లోని కలెక్షన్‌లో దాచారు. అదే తర్వాత వారెన్ ఆకల్ట్ మ్యూజియంWarren Occult Museumగా మారింది. ఈ మ్యూజియంలో శిలువ(Cross), పవిత్ర నీరు(Holy Water)తో అన్నాబెల్లె బొమ్మను ఓ గ్లాస్ కేస్ లో బంధించారు. అక్కడ “Touch not!” అనే హెచ్చరిక కూడా ఉంది.  మరికొన్ని కలెక్షన్లు కూడా అక్కడ ఉన్నాయి. మ్యూజియం అమెరికాలోని కనెక్టికట్‌ స్టేట్‌లోని మోన్రో నగరంలో ఉంది. అయితే.. 

2019లో Lorraine Warren మరణం తర్వాత మ్యూజియం శాశ్వతంగా మూసివేయబడింది. మ్యూజియం Tony Spera (వారెన్‌ల అల్లుడు) ఆధ్వర్యంలో ఉంది. ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో లేదు, కానీ NESPR పారానార్మల్ ఈవెంట్స్‌లో కొన్ని వస్తువులను ప్రదర్శిస్తోంది. అందులో ది ఫేమస్‌ హాంటెడ్‌ డాల్‌గా పేరున్న అన్నాబెల్లె కూడా ఉంది. వారెన్‌ దంపతుల ఇన్వెస్టిగేషన్ల స్ఫూర్తితోనే కంజూరింగ్‌ సినిమాలు తెరకెక్కాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement