అల్‌ కాయిదా నంబర్‌ 2 హతం

Al-Qaedas Abu Mohammed al-Masri killed during US-Israel joint operation - Sakshi

వాషింగ్టన్‌: అంతర్జాతీయ ఉగ్ర సంస్థ అల్‌కాయిదాను అమెరికా, ఇజ్రాయెల్‌ కలిసి చావుదెబ్బ కొట్టాయి. అల్‌కాయిదాలో నంబర్‌–2గా చెలామణి అవుతున్న అబూ మొహమ్మద్‌ అల్‌–మాస్రీని ఈ ఏడాది ఆగస్టులో హతమార్చాయి. రహస్యంగా జరిగిన ఈ జాయింట్‌ ఆపరేషన్‌ వివరాలను తాజాగా నలుగురు అమెరికా అధికారులు వెల్లడించారు. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో దాక్కున్న అల్‌–మాస్రీ జాడను తొలుత అమెరికా కనిపెట్టింది. ఈ సమాచారాన్ని ఇజ్రాయెల్‌కు చేరవేసింది. దీంతో ఇజ్రాయెల్‌ నిఘా సంస్థకు చెందిన కిడోన్‌ దళం రంగంలోకి దిగింది.

టెహ్రాన్‌లో నక్కిన అల్‌ మాస్రీని విజయవంతంగా మట్టుబెట్టింది. ఆగస్టు 7న పూర్తయిన ఈ ఆపరేషన్‌లో మాస్రీ కూతురు మరియం కూడా చనిపోయింది. మరియం మరెవరో కాదు బిన్‌ లాడెన్‌ కుమారుడు హమ్జా బిన్‌లాడెన్‌ భార్యే. హమ్జాను అమెరికా దళాలు పాక్‌–అఫ్గానిస్తాన్‌ సరిహద్దుల్లో ఉండగా గత ఏడాది హతమార్చాయి. 1998లో కెన్యా, టాంజానియాలోని అమెరికా రాయబార కార్యాలయాలపై జరిగిన బాంబు దాడుల్లో అల్‌–మాస్రీ కీలకపాత్ర పోషించాడు.   అప్పటినుంచి అమెరికా నిఘా సంస్థ ఎఫ్‌బీఐ అతడిని మోస్ట్‌వాంటెడ్‌ జాబితాలో చేర్చింది. ఇప్పటికే అల్‌కాయిదా చీఫ్‌ అల్‌ జవహరీ జాడ గత కొన్ని నెలలుగా తెలియడం లేదు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top