Sakshi News home page

Afghanistan Earthquake: అఫ్గాన్‌ భూకంపం..2,400కు చేరిన మరణాలు

Published Tue, Oct 10 2023 5:47 AM

Afghanistan earthquakes death toll crosses 2400 abow - Sakshi

ఇస్లామాబాద్‌: అఫ్గానిస్తాన్‌లోని హెరాట్‌ ప్రావిన్స్‌లో శనివారం సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మట్టిదిబ్బల్లా మారిన ఇళ్ల శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం స్థానికులు, సహాయక సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. సోమవారం మరికొన్ని మృతదేహాలు బయటపడటంతో మృతుల సంఖ్య 2,445కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, క్షతగాత్రుల సంఖ్య గతంలో ప్రకటించిన 9,240 కాదన్నారు.

2వేల మంది మాత్రమే గాయపడ్డారన్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు. హెరాట్‌లోని ఏకైక ప్రధాన ఆస్పత్రి వెలుపల బాధితుల కోసం బెడ్లు ఏర్పాటు చేసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇక్కడ ప్రస్తుతం 500 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. సోమవారం మరోసారి భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనలకు గురై రోడ్లపైకి చేరుకున్నారు.

అఫ్గాన్‌ ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి అబ్దుల్‌ బరాదర్‌ సోమవారం హెరాట్‌ ప్రావిన్స్‌లో పర్యటించారు. ఇజ్రాయెల్‌ పరిణామాలపైనే ప్రపంచదేశాల దృష్టి కేంద్రీకృతం కావడంతో అఫ్గాన్‌లో భూకంపబాధితులకు సాయం నెమ్మదిగా అందుతోంది. దశాబ్దాలపాటు అంతర్యుద్ధంతో చితికిపోయిన అఫ్గానిస్తాన్‌ ప్రజలకు తాజాగా సంభవించిన భూకంపం మరింత కుంగదీసింది.

అంతర్జాతీయ సమాజం స్పందించాలంటూ ప్రభుత్వేతర, స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చినప్పటికీ చైనా, పాకిస్తాన్‌ వంటి కొన్ని పొరుగుదేశాలు మాత్రమే అఫ్గాన్‌లకు సాయం అందించేందుకు ముందుకు వచ్చాయి. అఫ్గాన్‌ రెడ్‌ క్రీసెంట్‌ సొసైటీకి చెందిన 20 బృందాలు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సేవలందిస్తున్నాయి. నీడ కోల్పోయిన వారికోసం తాత్కాలిక క్యాంపులను ఏర్పాటు చేసింది.

Advertisement

What’s your opinion

Advertisement