
తాలిబన్ల అఫ్గాన్‌లో ఘోరం
తాలిబన్ల అఫ్గానిస్తాన్‌లో బాల్య వివాహాలు నానాటికీ విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ఆ ఘోరాల పరంపరకు పరాకాష్ట వంటి ఉదంతం తాజాగా దక్షిణ అఫ్గాన్‌లో చోటుచేసుకుంది! 45 ఏళ్ల వయసున్న ఓ ప్రబుద్ధుడు ఆరేళ్ల పాపను పెళ్లాడాడు. కాసుల కక్కుర్తితో తండ్రే ఆ చిన్నారిని పెళ్లి పేరిట ఇలా సదరు కామాంధునికి కట్టబెట్టాడట. ఇదే ఘోరమంటే, దీనిపై తాలిబన్ సర్కారు మరీ అరాచకంగా స్పందించింది. ‘నువ్వు చేసిన పని మమ్మల్ని షాక్‌కు గురి చేసింది. అంత చిన్న వయసు పాపను పెళ్లాడకుండా ఉండాల్సింది.
కనీసం తనకు తొమ్మిదేళ్లు వచ్చేదాకా, అంటే మరో మూడేళ్ల దాకా కాపురానికి తీసుకెళ్లడానికి వీల్లేదు’ అని సదరు నవ వరుడిని ఆదేశించింది. అతనితో పాటు పాప తండ్రిని లాంఛనంగా అరెస్టు చేసింది. అమెరికాకు చెందిన అఫ్గాన్ సంస్థ ఏఎంయూ.టివి ఈ మేరకు పేర్కొంది. మనవాడికి అప్పటికే రెండు పెళ్లిళ్లయ్యాయట. పాప ప్రస్తుతానికి తల్లి దగ్గరే ఉన్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. ఇదెక్కడి పాడు పని అంటూ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతోంది. చిన్న పాప పక్కన పెళ్లి దుస్తుల్లో ఉన్న వరుని ఫొటోలు వైరల్‌గా మారాయి. మానవ హక్కుల సంఘాలు కూడా తాలిబన్ల తీరుపై దుమ్మెత్తిపోస్తున్నాయి.
రూపురేఖలను బట్టి రేటు!
అఫ్గాన్‌లో అమల్లో ఉన్న దుర్మార్గమైన వాల్వార్ సంప్రదాయం మేరకు ఈ పెళ్లి జరిగింది. ఇందులో వధువు శరీరాకృతి, చదువు తదితరాల ఆధారంగా తనకు ధర నిర్ణయిస్తారు. అది చెల్లించిన వాడికిచ్చి పెళ్లి చేస్తారు. 2021లో తాలిబన్లు అఫ్తాన్‌ను హస్తగతం చేసుకున్న నాటినుంచీ బాల్య వివాహాలు పెచ్చరిల్లాయి. దుర్భర దారిద్య్రం దీనికి తోడైంది. పిల్లలను పెంచలేక తల్లిదండ్రులు ఇలా ఆడపిల్లలను పెళ్లి సాకుతో అయినకాడికి అమ్ముకుంటున్నారు. దేశంలో అమ్మాయిలకు అసలు కనీస వివాహ వయసు నిబంధనే లేదు. అమ్మాయిల చదువుపై నిషేధం విధించడంతో అఫ్గాన్‌లో కొన్నేళ్లుగా బాల్య వివాహాలు దేశంలో ఏకంగా 45 శాతానికి పెరిగినట్టు ఐరాస నివేదిక పేర్కొంది.
– సాక్షి, నేషనల్ డెస్క్