అన్నార్థులపై మళ్లీ పేలిన తూటా | 27 more people die in Gaza | Sakshi
Sakshi News home page

అన్నార్థులపై మళ్లీ పేలిన తూటా

Jun 4 2025 5:30 AM | Updated on Jun 4 2025 5:30 AM

27 more people die in Gaza

గాజాలో మరో 27 మంది మృతి

రఫా: గాజాలోని పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయెల్‌ మరోసారి పాశవికంగా వ్యవహరించింది. ఆహార పంపిణీ కేంద్రం వద్దకు వెళ్తున్న వారే లక్ష్యంగా జరిపిన కాల్పుల్లో 27 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇది మూడు రోజుల్లో జరిగిన మూడో కాల్పుల ఘటన కావడం గమనార్హం. మంగళవారం ఉదయం జరిగిన కాల్పుల్లో కనీసం 184 మంది గాయపడినట్లు రెడ్‌ క్రాస్‌ తెలిపింది. ఐరాస మానవ హక్కుల విభాగం కూడా ధ్రువీకరించింది. మృతదేహాలను ఖాన్‌యూనిస్‌లోని నాస్సెర్‌ ఆస్పత్రికి తరలించారు.

బుల్లెట్లు తగిలిన క్షతగాత్రులను అంబులెన్సుల్లో వేరే ఆస్పత్రులకు తరలిస్తుండగా చూశామని, కొందరు ఉత్త చేతులతోనే వెనుదిరిగి వస్తుండగా, నేలపై పడిన ఖాళీ పిండి సంచులు రక్తపు మరకలతో తడిచిపోయాయని అసోసియేటెడ్‌ ప్రెస్‌ రిపోర్టర్‌ ఆహార పంపిణీ కేంద్రం వద్ద దారుణ పరిస్థితిని వివరించారు. కాగా, పంపిణీ కేంద్రం వద్ద నిర్దేశించిన బాటను వదలి తమ బలగాల దిశగా వస్తున్న అనుమానితులనే కాల్చామని, హెచ్చరిక కాల్పులను సైతం వీరు లెక్కచేయలేదని ఇజ్రాయెల్‌ ఆర్మీ అంటోంది. గాజాలో ఇజ్రాయెల్‌ ఏర్పాటు చేసిన మిలటరీ జోన్లలో అమెరికాకు చెందిన ఫౌండేషన్‌ ఆహార పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటి నుంచి కాల్పుల ఘటనలు కొనసాగుతున్నాయి. హమాస్‌ శ్రేణులకు ఆహార పదార్థాలు అందకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని ఇజ్రాయెల్‌ అంటుండగా..ఆకలిని ఆయుధంగా చేసుకోవడం తగదని ఐరాస అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఇప్పుడు ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కేంద్రాలు ఆకలిని ఏమాత్రం తీర్చలేవని అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఆది, సోమవారాల్లో ఆహార పంపిణీ కేంద్రాల వద్దకు వచ్చిన వారిపై ఆర్మీ జరిపిన కాల్పుల్లో 34 మంది ప్రాణాలు విడిచారు. ఆహార పంపిణీ బాధ్యతలు చేపట్టిన గాజా హ్యుమానిటేరియన్‌ ఫౌండేషన్‌ మాత్రం తమ కేంద్రాల వద్ద గానీ, చుట్టుపక్కల గానీ ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగలేదని చెబుతోంది. మంగళవారం 21 ట్రక్కుల ఆహారాన్ని పంపిణీ చేశామని తెలిపింది. కాల్పుల ఘటనలన్నీ రఫాలో ఇజ్రాయెల్‌ మిలటరీ జోన్లలోని పంపిణీ కేంద్రాల వద్దే చోటుచేసుకున్నాయి. ఇక్కడికి మీడియాను ఆర్మీ చాలా పరిమితంగా అనుమతిస్తోంది. గతంలో గాజాలోని సుమారు 20 లక్షల మందికి నిత్యం 600 ట్రక్కుల్లో ఆహార పదార్థాలు అందేవి. వీరందరికీ ఈ ఆహారమే ఆధారం. ఇజ్రాయెల్‌ ఆర్మీ నెలలపాటు కొనసాగించిన దిగ్బంధనం కారణంగా ఆహార నిల్వలు పూర్తి స్థాయిలో అడుగంటాయి.

Advertisement
 
Advertisement
Advertisement