వాషింగ్టన్‌లో బోల్తా పడిన తేనెతుట్టెల వాహనం
వాషింగ్టన్: మల్లాది ‘నత్తలొస్తున్నాయ్ జాగ్రత్త’ నవల గుర్తుందా? కెన్యా నుంచి వచ్చిన భయంకరమైన రాక్షస నత్తలు ఓ రైలు ప్రమాదంలో తప్పించుకుని ఆంధ్ర రాష్ట్రంపై పడతాయి. చూస్తుండగానే అసంఖ్యాకంగా పెరిగిపోయి అల్లకల్లోలం చేసిపారేస్తాయి. అదీ, ఇదీ అని తేడా లేకుండా దొరికిన దాన్నల్లా తినేస్తూ భయోత్పాతం సృష్టిస్తాయి. అమెరికాలో వాషింగ్టన్ రాష్ట్రంలో కూడా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఒకటీ రెండూ కాదు, ఏకంగా 25 కోట్ల తేనెటీగలు తప్పించుకున్నాయి!
31,751 కిలోల తేనెతుట్టెలతో వెళ్తున్న వాహనం లిండెన్ సమీపంలో కెనడా సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ మూలమలుపు వద్ద వేగాన్ని డ్రైవర్ నియంత్రించలేకపోవడంతో బోల్తా పడింది. తేనెతుట్టెలన్నీ చెల్లాచెదురుగా పడిపోవడంతో తేనెటీగలు బయటికొచ్చి జారుకున్నాయి. విషయం తెలియగానే పోలీసులు తేనెటీగల నిపుణులతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అంతా కలిసి తేనెతుట్టెలను ఒక్కచోటికి చేర్చారు. తప్పించుకున్న తేనెటీగల కోసం ఎదురుచూస్తూ గడుపుతున్నారు. అవి తప్పకుండా తుట్టెల వద్దకు తిరిగొస్తాయని నిపుణులు చెప్పారు.
‘‘తేనెటీగలు రాణి ఈగను విడిచి ఉండలేవు. దాన్ని తీసుకొని రెండు మూడు రోజుల్లో వచ్చేస్తాయి’’ అని వివరించారు. కనుక రెండు మూడు రోజులపాటు పరిసర ప్రాంతాలకు రావొద్దని స్థానికులకు పోలీసులు సూచించారు. అమెరికాలో లక్షలాది తేనెటీగలను తరచుగా ఇలా ఒకచోటి నుంచి మరోచోటికి తరలిస్తుంటారు. వ్యవసాయంలో తేనెటీగలది కీలక పాత్ర. పరాగ సంపర్కానికి, పంటలు పండడానికి దోహదపడతాయి. ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల సంఖ్య భారీగా తగ్గిపోతుండటంతో మే 20ని ‘ప్రపంచ తేనెటీగల దినం’గా జరుపుకోవాలని ఐరాస 2018లో పిలుపునిచ్చింది.