అబుజా: నైజీరియాలో స్కూలు విద్యార్థినుల అపహరణ ఉదంతం మరోసారి వెలుగుచూసింది. కెబ్బి రాష్ట్రం డాంకో–వసాగు ప్రాంతంలోని మాగా బోర్డింగ్ స్కూల్‌లో సోమవారం వేకువజామున ఘటన చోటుచేసుకుంది. సాయుధులైన దుండగులు వేకువజామున 4 గంటల సమయంలో పెద్దగా భద్రతా ఏర్పాట్లు లేని స్కూలులోకి చొరబడి 25 మంది బాలికలను అపహరించుకుపోయారు. అడ్డగించిన సిబ్బందిపై కాల్పులు జరపగా ఒకరు చనిపోగా మరొకరు గాయపడ్డారు.
దుండగుల వద్ద అత్యాధునిక ఆయుధాలున్నట్లు చెబుతున్నారు. దుండగులు, బాలికల ఆచూకీ కోసం పోలీసులు చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో భారీ ఎత్తున గాలింపు చేపట్టారు. 2014లో బోర్నో రాష్ట్రం చిబోక్‌లోని బోర్డింగ్ స్కూలుపై దాడి చేసిన బోకో హరామ్ మిలిటెంట్లు 276 మంది విద్యార్థినులను అపహరించుకు వెళ్లిన ఘటన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ తర్వాత దేశ ఉత్తర ప్రాంతంలో అటువంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి. అప్పటి బాధితుల్లో కొందరికి విముక్తి లభించగా, 100 మంది వరకు మిలిటెంట్ల చెరలో ఉన్నారని అంచనా.


