1,166 గజాల స్థలం... రూ 6 కోట్లు విలువ
బోడుప్పల్: టెలిఫోన్ కాలనీలో కబ్జాకు గురైన పార్కు స్థలాన్ని హెడ్రా అధికారులు కాపాడారు. హైడ్రా మల్కాజిగిరి, ఉప్పల్ ఇన్‌చార్జి, సీఐ రాజశేఖర్, ఎస్సై మొగులయ్య, మేడిపల్లి పోలీసుల పర్యవేక్షణలో ఫెన్సింగ్, సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. లేఅవుట్ సమయంలోనే 1,166 గజాల స్థలాన్ని పార్కు కింద వదిలిపెట్టారు. దాని విలువ ఇప్పుడు రూ 6 కోట్లు. అయితే ఇటీవల కొంతమంది స్థానిక నాయకులు గుట్టుచప్పుడు కాకుండా పార్కును కబ్జా చేసి డాక్యుమెంట్ సృష్టించారు. నాలుగు ప్లాట్‌లుగా విభజించి విక్రయించారు. వాటిల్లో ఇటీవల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించగా విషయం తెలుసుకున్న కాలనీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్‌గౌడ్ కాలనీవాసులతో కలిసి గత సోమవారం హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన హైడ్రా అధికారులు పార్కు స్థలాన్ని సందర్శించి విచారించారు. మంగళవారం ఉదయం బందోబస్తు వచ్చి బోర్డును, ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు. పార్కును కాపాడిన హైడ్రా అధికారులను కాలనీవాసులు అభినందించారు.


