పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగ ● బాలుడితోపాటు ముగ్గురి అరెస్ట్
చిలకలగూడ: వరుస దోపిడీ, దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ దెర్హా నెహిమ్యా అలియాస్ బ్రూస్‌లీ ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. చురుగ్గా ఉండే నేరస్తులను ముఠా సభ్యులుగా జైలులోనే రిక్రూట్ చేసుకునేవాడు. బయటకు రాగానే దోపిడీలు, దొంగతనాలు, హత్యలకు పాల్పడేవాడు. బ్రూస్‌లీ, మరో ఇద్దరు పాత నేరస్తులతోపాటు ఓ బాలుడిని చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ శశాంక్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ వలిశెట్టి రామకృష్ణ, డీఐ మధుబాబులు తెలిపిన వివరాలు.. ముషీరాబాద్ జవహర్‌నగర్‌కు చెందిన రాజ్‌కుమార్‌ను ఈ నెల 22న బోయిగూడ ఫ్లోరా హోటల్ వద్ద నలుగురు అగంతకులు అటకాయించారు. తీవ్రంగా కొట్టి రూ.6 వేల నగదు, సెల్‌ఫోన్ గుంజుకుని, ఆలుగడ్డబావి అండర్‌పాస్ వద్ద వదిలిపెట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీల ఆధారంగా మెట్టుగూడ చౌరస్తాలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో కర్ణాటక హుబ్లీ గాంధీఘడ్, చాళుక్యనగర్‌కు చెందిన ప్రధాన నిందితుడు బ్రూస్‌లీ (30), బాలంరాయి ప్రకాశ్‌నగర్‌కు చెందిన పాత నేరస్థుడు నితిన్ ఫ్రాన్సిస్ (22), మెట్టుగూడ ఆలుగడ్డబావి వాసి దారా అశ్విన్ (26), రసూల్‌పురాకు చెందిన బాలనేరస్థుడు ఉన్నారు. వారి వద్ద రూ. 2.25 లక్షల నగదు, ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
3 రాష్ట్రాలు.. 65 క్రిమినల్ కేసులు
ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో హత్య, హత్యాయత్నం, దోపిడీ, దొంగతనాలు వంటి 65 క్రిమినల్ కేసులు బ్రూస్‌లీపై ఉన్నాయి. జూన్ 22న బోయిగూడలో దోపిడీకి పాల్పడిన తర్వాతి రోజే అల్వాల్‌లోని ఓ ఇంటిలో చోరీకి యత్నించి విఫలమయ్యాడు. అదేరోజు రాత్రి మీర్‌పేట ఠాణా పరిధిలో ఓ ఇంట్లోకి జొరబడి బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేశాడు. బ్రూస్‌లీ ముఠాను పట్టుకున్న ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, డీఐ మధుబాబు, క్రైమ్ సిబ్బందిని సికింద్రాబాద్ డీసీపీ రక్షితకృష్ణమూర్తి, అడిషనల్ డీసీపీ నరసయ్య, చిలకలగూడ ఏసీపీ శశాంక్‌రెడ్డిలు అభినందించి రివార్డులు అందించారు.


