‘సిమ్‌ స్వాప్‌’ ముఠా ఆటకట్టు | - | Sakshi
Sakshi News home page

‘సిమ్‌ స్వాప్‌’ ముఠా ఆటకట్టు

May 17 2026 11:29 AM | Updated on May 17 2026 11:29 AM

టెలికం వెరిఫికేషన్‌ పేరుతో సైబర్‌ మోసాలు

ఆరుగురు అంతర్రాష్ట్ర నిందితులు అరెస్టు

సాక్షి, సిటీబ్యూరో: సిమ్‌ స్వాపింగ్‌తో మోసాలకు పాల్పడతున్న అంతర్రాష్ట్ర సైబర్‌ ముఠా ఆటకట్టించారు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు. విషింగ్‌, సిమ్‌ మానిప్యులేషన్‌, ఓటీపీ డైవర్షన్‌, మోసపూరిత ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలతో వందలాది బాధితుల నుంచి రూ.77.75 లక్షల సొమ్మును ఈ ముఠా కాజేసినట్లు సైబర్‌ క్రైమ్స్‌ డీసీపీ టి.సాయి మనోహర్‌ శనివారం మీడియాకు వెల్లడించారు. వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన సలీం, సయ్యద్‌ హషీమ్‌ రెజా అలియాస్‌ టిప్పు, బన్సీధర్‌, అబ్దుల్‌ అలీం అలియాస్‌ మిట్టు, మిజానుర్‌ రెహమాన్‌ షేక్‌, మెహబూబ్‌ ఆలం అన్సారీ అలియాస్‌ సూరజ్‌లు ముఠాగా ఏర్పడి ఢిల్లీ కేంద్రంగా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. థర్డ్‌ పార్టీ నుంచి కస్టమర్ల ఫోన్‌ నంబర్లు సేకరించి సిటీ బ్యాంక్‌ ప్రెస్టీజ్‌ క్రెడిట్‌ కార్డ్‌ డివిజన్‌ అధికారులమంటూ వారికి ఫోన్‌ చేసి నమ్మిస్తారు. టెలికాం శాఖ వెరిఫికేషన్‌ పేరుతో బాధితులను ఈ–సిమ్‌ నుంచి ఫిజికల్‌ సిమ్‌ కార్డ్‌లుగా మార్చుకునేలా ప్రేరేపిస్తారు. ఆ తర్వాత మాల్వేర్‌ ఇన్‌స్టాల్‌ చేసిన మొబైల్‌ ఫోన్లను కొరియర్‌ సర్వీసుల ద్వారా బాధితులకు ఇంటికే పంపిస్తారు. బాధితులు ఆ ఫోన్లలో ఫిజికల్‌ సిమ్‌ కార్డ్‌లను వేయగానే.. వెంటనే, వారికి రావలసిన వన్‌ టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ)లు, బ్యాంకింగ్‌ అలర్ట్‌లు నిందితులకు డైవర్ట్‌ అవుతాయి. వీటి ఆధారంగా నిందితులు బాధితుల బ్యాంక్‌ ఖాతాలకు అనధికారిక యాక్సెస్‌ పొంది, మోసపూరిత ఆన్‌లైన్‌ లావాదేవీలను నిర్వహిస్తారు. ఈక్రమంలో ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఈ ముఠా సభ్యులపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు సాంకేతిక ఆధారాలతో నిందితులు వెస్ట్‌ బెంగాల్‌లో ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలు అక్కడి వెళ్లి ఆరుగురు నిందితులను ట్రాన్సిట్‌ వారెంట్‌పై అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో పశ్చిమ బెంగాల్‌లోని నిందితుల నివాసాల నుండి రూ.15 లక్షల నగదును పోలీసులు రికవరీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement