అల్వాల్: నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆర్మీ జవాన్‌ను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. గురువారం నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో మల్కాజిగిరి ఏసీపీ యాదగిరిరెడ్డి తెలిపిన మేరకు.. వైఎస్‌ఆర్ కడప జిల్లా గోరవంద్లపల్లికి చెందిన కుర్రపోతుల రెడ్డి శేఖర్ (31) ఆర్మీలో జనరల్ డ్యూటీ జవాన్‌గా పనిచేస్తూ అల్వాల్‌లోని త్రిశూల్ లైన్ ఆర్మీ క్వార్టర్స్ నివాసం ఉంటున్నాడు. క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటు పడి భారీగా అప్పులు చేశాడు. దీంతో అప్పులు తీర్చేందుకు దొంగగా మారాడు. ఈ నెల 10న సాయంత్రం తన ద్విచక్ర వాహనం నెంబర్ ప్లేట్‌ను మార్చుకుని అల్వాల్‌లోని డాల్ఫిన్ వైన్ షాప్ సమీపంలోని పాన్ షాప్ వద్దకు వచ్చాడు. సప్తగిరి కాలనీకి చెందిన మణి మేఘల (57)ను అడ్రస్ అడుగుతున్నట్లు నటించి ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లి పరారయ్యాడు. పోలీసులు అదే ప్రాంతంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


