అప్పుల జలధిలో.. | - | Sakshi
Sakshi News home page

అప్పుల జలధిలో..

May 13 2026 4:56 AM | Updated on May 13 2026 4:56 AM

రాబడి కంటే వ్యయం రెండింతలు

సాక్షి, సిటీబ్యూరో

లమండలి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. నీళ్ల లోతు కష్టాలతో మునిగిపోయింది. మహా నగరానికి తాగునీటి సరఫరా, మురుగు నీటి సేవలు అందిస్తున్న జలమండలి తీవ్రమైన ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుంది. ఖర్చుకు, రాబడికి పొంతన లేకపోవడంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రతి నెలా రూ.వందల కోట్ల నష్టంతో కాలం వెళ్లదీస్తున్న బోర్డు.. అప్పుల ఊబిలోంచి ఎలా బయట పడుతుందో.. అర్థం కాని పరిస్థితి నెలకొంది. జలమండలికి లభిస్తున్న ఆదాయం , చేస్తున్న ఖర్చుకు మధ్య రెండింతలు వ్యత్యాసం కనిపిస్తోంది. తాగునీటి సరఫరా, సీవరేజీ ఛార్జీలు, వాటర్‌ ట్యాంకర్ల ద్వారా నెలకు సగటున రూ.132 కోట్ల ఆదాయం వస్తుండగా.. నిర్వహణ వ్యయం మాత్రం రూ. 306 కోట్లు దాటుతోంది. అంటే నెలకు రూ.174 కోట్ల లోటు కనిపిస్తోంది. ఈ లెక్కన ఏడాదికి కేవలం నిర్వహణ రూపంలోనే దాదాపు రూ.2,088 కోట్ల భారీ నష్టాన్ని సంస్థ చవిచూస్తోంది.

విద్యుత్‌ చార్జీల మోత..

నగరాభివద్ధిలో కీలకంగా ఉన్న జలమండలికి విద్యుత్‌ చార్జీలు పెనుభారంగా మారాయి. కృష్ణా, గోదావరి జలాలను వందల కిలోమీటర్ల దూరం నుంచి పంపింగ్‌ చేయడానికి నెలకు సుమారు రూ.190 కోట్ల వరకు కరెంట్‌ బిల్లు చెల్లించాల్సి వస్తోంది. సంస్థకు వచ్చే మొత్తం ఆదాయం (రూ. 132 కోట్లు) కంటే, కరెంట్‌ బిల్లులే రూ. 58 కోట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. కేవలం విద్యుత్‌ బకాయిలే కొండలా పేరుకుపోతున్నాయి.

వడ్డీలు తడిసి మోపెడు

తాగునీటి పథకాలు, సీవరేజీ అభివృద్ధి పనుల కోసం తీసుకున్న, తీసుకుంటున్న రుణాలు ఇప్పుడు జలమండలి మెడకు ఉరితాళ్లుగా మారాయి. అసలు కంటే వడ్డీలే భారీగా పెరిగిపోతున్నాయి. ఆదాయం లేక, ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో సాయం అందక.. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ రుణాల చెల్లింపులే సంస్థను ఆర్థికంగా కుంగదీస్తున్నాయి.

ఉచిత సబ్సిడీ అరకొర

నగర ప్రజలకు ఊరటనిచ్చేలా ప్రవేశపెట్టిన నెలకు 20 కేఎల్‌ ఉచిత నీటి సరఫరా పథకం జలమండలిని మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేస్తాంది. ఇటీవల బడ్జెట్‌లోఉచిత నీటి పథకం బకాయిలు, నిర్వహణ కోసం బోర్డు రూ. 849.63 కోట్లు ప్రతిపాదించగా, ప్రభుత్వం కేవలం రూ. 300 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే అవసరమైన దానిలో 40 శాతం కంటే తక్కువ నిధులు కేటాయించడంతో, మిగిలిన రూ. 550 కోట్ల భారాన్ని సంస్థ తన సొంత వనరుల నుంచే భరించాల్సి వస్తోంది.

కేటాయింపుల ఆశలపై నీళ్లు

ఇటీవల రాష్ట్ర బడ్జెట్‌లో జలమండలికి తీవ్ర నిరాశే ఎదురైంది. రుణాల చెల్లింపు, పెండింగ్‌లో ఉన్న అభివద్ధి పనుల కోసం బోర్డు రూ. 8,533 కోట్లు ప్రతిపాదించగా, ప్రభుత్వం కేవలం రూ. 3,305 కోట్లు మాత్రమే కేటాయించింది. అడిగిన దాంట్లో సగం కూడా ఇవ్వకపోవడంతో ప్రణాళికలన్నీ కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. నిధుల కొరత వల్ల కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కడం గగనంగా మారింది.

రుణాలతోనే అభివృద్ధి పనులు

భారంగా 20 కేఎల్‌ ఉచిత నీటి సరఫరా

తలకు మించిన భారంగా విద్యుత్‌ చార్జీలు

నెలకు సగటున రూ.132 కోట్ల ఆదాయం

నిర్వహణ వ్యయం రూ. 306 కోట్లు

నెలకు రూ.174 కోట్ల లోటు

రూ.2,088 కోట్ల భారీ నష్టం

నీళ్లలోతు కష్టాల్లో జలమండలి

Advertisement
 
Advertisement
Advertisement