మల్కాజిగిరిలో సైబర్ ఇంటెలిజెన్స్ యూనిట్
● విధివిధానాలపై కసరత్తు
● సమగ్ర సమాచార సేకరణ, కార్యకలాపాల నిర్వహణ
కదలికలపై నిరంతర నిఘా
సైబర్ నేరాలు, మోసాలు చేసి తప్పించుకోలేమన్న భయం కలిగిచడమే లక్ష్యంగా సీసీఐయూ కార్యకలాపాలు సాగిస్తుందని ఓ పోలీసు కమిషనరేట్ ఉన్నతాధికారి చెప్పారు. సైబర్ నేరస్తుల కదలికలు, నెట్‌వర్క్‌పై నిఘా పెట్టడం, ఆన్‌లైన్‌లో సైబర్ నేరస్తుల మూలాలను ట్రాక్ చేయడం, ఆర్థిక లావాదేవీలను ఛేదించడం, ఇతర అంతర్గత భద్రతా అంశాలపై కన్నేసి ఉంచుతారు. క్షేత్ర స్థాయిలో అజ్ఞాత వ్యక్తుల నెట్‌వర్క్‌లను ఛేదిస్తారు. కేసుల నమోదు నుంచి విచారణ, దర్యాప్తు విశ్లేషణ, అభియోగ పత్రాల దాఖలు వరకూ ప్రతి అంశంలోనూ సమర్థంగా ఉంటుంది. సమగ్ర సమాచారం సేకరణ, లోతైన విశ్లేషణ ఉంటుంది. బ్యాంక్‌లు, ఆర్ధిక సంస్థలు, టెలికం, ఇంటర్నెట్ ప్రొవైడర్లను ఒకచోట చేర్చి, ఆర్థిక మోసాలపై తక్షణ చర్యలను సులభతరం చేస్తుంది. అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ డేటా పంచుకోవడానికి, విశ్లేషణలోనూ సీసీఐయూ కీలక పాత్ర పోషిస్తుంది.
సాక్షి, సిటీబ్యూరో: సమాజానికి సైబర్ నేరాలు పెను ముప్పుగా మారాయి. రోజుకో కొత్త రకం మోసాలతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వీరి భరతం పట్టేందుకు పోలీసు శాఖ సిద్ధమైంది. మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్‌లో సైబర్ క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ (సీసీఐయూ) ఏర్పాటు కానుంది. ఈ మేరకు విధి విధానాలు, మార్గదర్శకాలపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో వామపక్ష, నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ఏర్పాటైన స్పెషల్ ఇంటలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) తరహాలోనే.. సీసీఐయూ కార్యకలాపాలు సాగించనుంది.


