అంగన్‌వాడీలపై అక్కడికక్కడే నిర్ణయం | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలపై అక్కడికక్కడే నిర్ణయం

May 8 2026 11:14 AM | Updated on May 8 2026 11:14 AM

ఉద్యోగాల భర్తీ ఫైల్‌పై మంత్రి సీతక్క సంతకం

మల్లాపూర్‌: నగరంలో ఖాళీగా ఉన్న 180 అంగన్‌వాడీ టీచర్లు, 370 ఆయాల పోస్టుల భర్తీ ఫైల్‌పై గురువారం నాచారం తెలంగాణ ఫుడ్స్‌లో జరిగిన సమావేశంలో మంత్రి సీతక్క సంతకం చేశారు. మంచి ముహూర్తం ఉండడంతో ఇక్కడే ఫైల్‌పై సంతకం చేశామన్నారు. తెలంగాణ ఫుడ్స్‌లో రూ.4 కోట్లతో చేపట్టిన మోడ్రన్‌ క్యాంటీన్‌, గోదాం భవనాల పనులకు టీజీ ఫుడ్స్‌ చైర్మన్‌ ఫహీమ్‌తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారిని ఆరోగ్యంగా తీర్చిదిద్దేందుకే రాష్ట్ర ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తోందని వివరించారు. సర్కారు లక్ష్యాన్ని టీజీ ఫుడ్స్‌ నెరవేరుస్తూ, దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలుస్తోందన్నారు. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులదేనని సూచించారు. నగరంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్న కోడి గుడ్లు సరఫరా చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. బాలామృతం పక్కదారి పట్టకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ సేవల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంగన్‌వాడీ కేంద్రాలు లేనిచోట, కొత్త భవనాలు పూర్తయ్యే వరకు జూన్‌ తొలి వారం నుంచి సంచార వాహనాల ద్వారా బాలామృతం, స్నాక్స్‌ సరఫరా చేస్తామని చెప్పారు. తెలంగాణ ఫుడ్స్‌ కార్మికుల ఇళ్ల స్థలంపైనా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. వారికి నాణ్యమైన భోజనం అందించేందుకు మోడ్రన్‌ కిచెన్‌ నిర్మిస్తామని, టీజీ ఫుడ్స్‌ను మరింత విస్తరించేందుకు అదనంగా ముడి పదార్థాల గోదాం నిర్మిస్తామని తెలిపారు. టీజీఐఐసీ చైర్మన్‌ నిర్మలా జగ్గారెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనితా రాంచంద్రన్‌, ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, తెలంగాణ ఫుడ్స్‌ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్జేడీ అంకేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement