గూగుల్‌లో చూసి.. సంతకాలు ఫోర్జరీ చేసి.. | - | Sakshi
Sakshi News home page

గూగుల్‌లో చూసి.. సంతకాలు ఫోర్జరీ చేసి..

May 5 2026 6:50 AM | Updated on May 5 2026 6:50 AM

మంత్రులు, జడ్జిల పేర్లతో క్రికెట్‌ అసోసియేషన్లకు టోకరా

మంత్రులు, జడ్జిల పేర్లతో క్రికెట్‌ అసోసియేషన్లకు టోకరా

ఉప్పల్‌: మంత్రులు, న్యాయమూర్తుల పేరును వాడుకుంటూ ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల టికెట్లను సంపాదించడంతో పాటు ఈజీగా డబ్బు సంపాదించాలనుకున్న ముఠా గుట్టును ఉప్పల్‌ పోలీసులు రట్టు చేశారు. దేశంలోని అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల పేర్లను వాడుకొని అధికారులను మోసగించిన తీరు విస్తుగొలుపుతోంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు.. ఈ నెల 3న ఉప్పల్‌ స్టేడియం వద్ద ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు స్టేడియం పార్కింగ్‌ వద్ద టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారనే సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. ఉప్పల్‌ ఎస్‌ఐ మాధవరెడ్డి బృందంతో సంఘటన స్థలానికి చేరుకుని అనుమానాస్పదంగా తచ్చాడుతున్న మహీంద్రా థార్‌ వాహనాన్ని తనిఖీ చేసింది. అందులో ఉన్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు సంగతి బయటపడింది.

అత్యున్నత స్థాయి వ్యక్తుల సంతకాలు ఫోర్జరీ

కేవలం బ్లాక్‌లో టికెట్లు అమ్మడం మాత్రమే కాకుండా, ఈ ముఠా పెద్ద స్కెచ్‌ వేసింది. గూగుల్‌ నుండి న్యాయమూర్తలు, మంత్రులు, గవర్నర్ల అధికారిక లెటర్‌ హెడ్‌లను డౌన్‌న్‌ లోడ్‌ చేసేవారు. వాటిపై సంబంధిత అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి, హైదరాబాద్‌, తమిళనాడు, కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్లకు సమర్పించేవారు. అలా వీవీఐపీల కోటాలో ఖరీదైన ’కాంప్లిమెంటరీ’ టికెట్లను పొంది, ఆ తర్వాత వాటిని అవసరమున్న వారికి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

ఇలా పట్టుబడ్డారు.

చైన్నె ప్రాంతానికి చెందిన ముగ్గురి సహకారంతో వీరు టికెట్లను సంపాదించే వారు. ఈ సీజన్‌లో ఉప్పల్‌లో రెండు మ్యాచ్‌లకు, బెంగుళూరులో రెండు మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను పోందారు. ఉప్పల్‌కు వచ్చే సరికి ఒకసారి టికెట్‌ను ఇచ్చిన హెచ్‌సీఏ అధికారులు రెండవ సారికూడా టికెట్లను అందజేసి చివరకు అనుమానం రావడంతో ఉప్పల్‌ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ప్రధాన నిందితులైన గట్టమనేని అశోక్‌(20) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, కంకనాల దినేష్‌(25)పార్టీల జెండాలను తయారు చేసే వ్యాపారం, సింగమనేని వేణుమాధవ్‌(26)ప్రైవేట్‌ ఉద్యోగి. ఈ ముగ్గురూ ప్రకాశం జిల్లా, కందుకూరు మండలం పల్కూరు గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. చైన్నెకి చెందిన మరో ముగ్గురు నిందితులు ఆశిష్‌, సెంథిల్‌, తాన్సిల్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి రూ. 22 వేల విలువ గల 5 టికెట్లు, మహీంద్రా థార్‌ వాహనం. 5 మొబైల్‌ ఫోన్లు, 5 ఫోర్జరీ చేసిన లెటర్‌ హెడ్‌లను స్వాధీనం చేసుకున్నారు.

ఐపీఎల్‌ టికెట్లు పొంది బ్లాక్‌లో విక్రయం

ఉప్పల్‌ స్టేడియం వద్ద ముగ్గురు నిందితుల అరెస్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement