పంథా మార్చి.. ఏమార్చి | - | Sakshi
Sakshi News home page

పంథా మార్చి.. ఏమార్చి

May 1 2026 5:51 AM | Updated on May 1 2026 5:51 AM

కస్టమ్స్‌ అధికారులకు అనుమానం రాకుండా స్మగ్లర్ల కొత్త ఎత్తుగడ

తాజాగా సికింద్రాబాద్‌లో క్రిస్టల్‌ మెథ్‌ స్వాధీనం, అదుపులో ఇద్దరు మహిళలు

బంగారం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో క్యారియర్లుగా మహిళలు

సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ స్మగ్లర్లు పంథా మార్చారు. డ్రగ్స్‌, ఇతర మత్తు పదార్థాల రవాణాకు మహిళల్ని క్యారియర్లుగా వాడుకుంటున్నారు. డీఆర్‌ఐ, కస్టమ్స్‌ సహా ఇతర ఏజెన్సీల దృష్టి మహిళలపై ఎక్కువగా ఉండదనే ఉద్దేశంతోనే ఈ పంథా అనుసరిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ తరహాలో బంగారం, మాదకద్రవ్యాలు స్మగ్లింగ్‌ చేస్తూ గడిచిన కొన్నాళ్లల్లో 11 మంది మహిళలు పట్టుబడటమే దీనికి నిదర్శనం. తాజాగా మంగళవారం సికింద్రాబాద్‌లో ఇద్దరు మహిళా క్యారియర్లను అదుపులోకి తీసుకున్న డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు రూ.11.4 కోట్ల విలువైన 11.4 కేజీల క్రిస్టల్‌ మెథ్‌ స్వాధీనం చేసుకున్నారు. మహిళలు, అందునా నిండుగర్భం, చంకలో పసిపిల్లలు, అంగవైకల్యంతో వచ్చేవారిని అధికారులు అనుమానించడం అరుదు. ఈ కారణంగానే వివిధ దేశాల నుంచి వచ్చే పేద, మధ్య తరగతి మహిళలకు కమీషన్‌ ఆశ చూపి క్యారియర్లుగా మార్చుకుంటున్నారు. మాదకద్యవాలను కడుపులో దాచి గర్భవతులుగా, చంటిబిడ్డలతో వస్తున్నవారికి అప్పగించి పంపిస్తున్నారు.

మెటల్‌ డిటెక్టర్లనూ ఏమార్చ వచ్చని..

వివిధ రూపాలు, పంథాల్లో ఒంటిపై బంగారం అక్రమంగా తీసుకువస్తున్న మహిళలకు విమానాశ్రయాల్లోని డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్స్‌(డీఎఫ్‌ఎండీ) కూడా కొంతవరకు కలిసి వస్తున్నాయి. క్యారియర్లు దాటుతున్న సమయంలో లోపల దాచి ఉంచిన మెటల్‌ కారణంగా డీఎఫ్‌ఎండీలు శబ్దం చేస్తాయి. మహిళలు సాధారణంగా ధరించే నగల వల్ల శబ్దం వచ్చి ఉంటుందని అధికారులు భావించే ఆస్కారం ఉంటుందని బడా స్మగ్లర్లు మహిళల్ని వినియోగించుకుంటున్నారు.

సూత్రధారులు మాత్రం చిక్కట్లేదు..

ఈ తరహా దందాలో చిక్కుతున్న మహిళల్ని ఎంత విచారించినా, ముఠా సూత్రధారుల్ని కనిపెట్టడం కష్టమవుతోందని కస్టమ్స్‌, డీఆర్‌ఐ అధికారులు చెప్తున్నారు. ఆయా దేశాల్లోని విమానాశ్రయాల్లో బంగారం అప్పగించే ముఠా సభ్యులు దాన్ని ఎవరికి డెలివరీ చేయాలో మాత్రం మహిళా క్యారియర్లకు చెప్పట్లేదు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చాక ఓ ప్రాంతంలో వేచి ఉండమనో, ఫలానా హోటల్‌/లాడ్జిలో బస చేయాలనో సూచిస్తున్నారు. ముఠాకు చెందిన రిసీవర్లు అక్కడికే వెళ్ళి సరుకు తీసుకుని కమీషన్లు చెల్లిస్తున్నారు.

గతంలోనూ ఉదాహరణలు ఎన్నో..

దుబాయ్‌ నుంచి కొకై న్‌ క్యాప్సుల్స్‌ను కడుపులో దాచుకుని వచ్చిన సౌతాఫ్రికా మహిళ మూసాను పట్టుకుంటే 793 గ్రాముల డ్రగ్స్‌ దొరికింది.

సౌదీ నుంచి తన భర్త, ఏడాదిన్నర కుమారుడితో కలిసి వచ్చిన ఓ మహిళ 1.75 కేజీల బంగారంతో పట్టుబడింది.

బ్యాంకాక్‌, దుబాయ్‌ నుంచి వచ్చిన నలుగురు మహిళల్ని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్‌ అధికారులు వారి నుంచి నాలుగు కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

సింగపూర్‌ నుంచి వచ్చిన ముగ్గురు మహిళల్ని తనిఖీ చేసిన అధికారులు 5.1 కేజీల బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.

యూఏఈ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల్ని పట్టుకున్న కస్టమ్స్‌ అధికారులు 1.3 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement