రెండు దఫాల్లో నిర్వహించిన హైదరాబాద్ పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో: నగర కొత్వాల్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ ఆదేశాల మేరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ నెల్లో ‘ఆపరేషన్ ఆక్టోపస్’ నిర్వహించారు. ఇది బ్యాంకింగ్ రంగంలో ఉన్న లోపాలను ఎత్తి చూపడంతో ఆయా అంశాలను వివరిస్తూ సజ్జనర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (ఆర్బీఐ) లేఖ రాశారు. దీంతో కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. ఇందులో పాల్గొనడానికి రాష్ట్రం నుంచి వీసీ సజ్జనర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించింది. సమావేశంలో పాల్గొన్న ఆయన పలు కీలక సలహాలు, సూచనలు ఇచ్చారు. సైబర్ నేరాలను నిరోధించాలంటే లోపాలు అధ్యయనం చేసి, మూలాల్లోకి వెళ్లాలని భావించిన సజ్జనర్ దీనికోసం ప్రత్యేకంగా ఆపరేషన్ ఆక్టోపస్‌ను డిజైన్ చేశారు. తొలుత ఫిబ్రవరిలో ‘ఆపరేషన్ ఆక్టోపస్–1’ నిర్వహించిన సైబర్ క్రైమ్ పోలీసులు 16 రాష్ట్రాల్లో సోదాలు చేసి 117 మందిని అరెస్టు చేశారు. వీరిలో సైబర్ నేరాలు చేసే వారికి బ్యాంకు ఖాతాలు అందించిన వారు (మ్యూల్ అకౌంట్ హోల్డర్స్), దళారులు ఉన్నారు. వీరి విచారణలో కొందరు బ్యాంకు అధికారుల పాత్ర వెలుగులోకి వచ్చింది. దీంతో రెండో విడతగా ‘ఆపరేషన్ ఆక్టోపస్–2.0’ను ఏప్రిల్‌లో చేపట్టారు. బాధితుల సొమ్మును దారి మళ్లించేందుకు నేరగాళ్లు వినియోగించిన 350 బ్యాంకు ఖాతాలను గుర్తించారు. వీటికి దేశవ్యాప్తంగా నమోదైన సుమారు 850 సైబర్ కేసులతో సంబంధం ఉందని, ఈ ఖాతాల ద్వారా దాదాపు రూ.150 కోట్ల మేర అమాయకుల ధరాన్ని లూటీ చేశారని వెల్లడైంది. బ్యాంకు అధికారులు మోసగాళ్లతో చేతులు కలిపి నిబంధనలకు విరుద్ధంగా ఖాతాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారని తేలింది. దీంతో బ్యాంకు అధికారుల పనిపట్టడానికి గత నెల్లో ‘ఆపరేషన్ ఆక్టోపస్–2.0’ చేపట్టారు. సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు చెందిన 16 ప్రత్యేక బృందాలు రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గుజరాత్, బీహార్‌ల్లో దాడులు నిర్వహించాయి. ఫలితంగా పట్టుబడిన 52 మందిలో 32 మంది బ్యాంకు అధికారులు కాగా... 15 మంది మ్యూల్ ఖాతాదారులు, ఐదుగురు మధ్యవర్తులు ఉన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన బ్యాంకు అధికారుల్లో వివిధ బ్యాంక్‌లకు చెందిన మేనేజర్లు, కేవైసీ అప్రూవర్లు, రిలేషన్‌షిప్ మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, క్లర్కులు ఉన్నారు. వీరి విచారణలో వెలుగులోకి వచ్చిన, దర్యాప్తులో గుర్తించిన అంశాలతో సజ్జనర్ ఆర్బీఐకి లేఖ రాయగా దీన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ సమస్య పరిష్కారం కోసం గురువారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో ఆర్థిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఎం.నాగరాజు, ఉన్నతాధికారులు, సీబీఐ డైరెక్టర్, ఇండియన్ సైబర్ క్రైౖ మ్ కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేష్ కుమార్, వివిధ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లతో పాటు హైదరాబాద్ కొత్వాల్ వీసీ సజ్జనర్ పాల్గొన్నారు.
బ్యాంకింగ్ రంగంలో ఉన్న లోపాలు బహిర్గతం
కీలక సమావేశం ఏర్పాటు చేసిన ఆర్థిక మంత్రిత్వ శాఖ
రాష్ట్రం నుంచి హాజరైనహైదరాబాద్ కొత్వాల్ సజ్జనర్


