
స్నేహితుల దాడిలో యువకుడి మృతి
జవహర్‌నగర్: గంజాయి అమ్ముతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నాడని ఓ యువకుడిని అతని స్నేహితులు దారుణంగా కొట్టడంతో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాప్రాల్ భగత్‌సింగ్ కాలనీలో నివసించే పుళ్లురి వెంకటనర్సయ్య రెండవ కుమారుడు ప్రణీత్ (21) డ్రైవింగ్ పనిచేస్తుంటాడు. అదే కాలనీకి చెందిన అతని స్నేహితుడు గోవర్ధన్ గంజాయి అమ్ముతున్నాడని ఇటీవల కాలనీలో కొందరికి చెప్పాడు. దీంతో కోపగించిన గోవర్ధన్ ఈ నెల 5వ తేదీన రాత్రి తన స్నేహితులు జశ్వంత్, విన్సెంట్‌లతో కలిసి ప్రణీత్‌తో మాట్లాడాలని పిలిపించి స్థానికంగా ఉండే మైదానానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రణీత్‌ను కర్రలు, చేతులతో దారుణంగా కొట్టడంతో మెడపై తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో వారు అక్కడి నుండి పరారయ్యారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ప్రణీత్‌ను స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమించడంతో అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రణీత్ మంగళవారం ఉదయం మృతిచెందాడని వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.