సాక్షి, సిటీబ్యూరో: నగర వ్యాపారిని ఫోన్ ద్వారా సంప్రదించి, భారీ ఆర్డర్ల పేరుతో ఎర వేసి, మోసం చేసి, రూ.9.5 లక్షలు కాజేసిన కేసులో ఆ మొత్తాన్ని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు రిఫండ్ చేయించారు. దీనికి సంబంధించిన డీడీని అదనపు సీపీ పి.విశ్వప్రసాద్ బుధవారం బాధితుడికి అందజేశారు. ఇంటర్‌నెట్ ద్వారా నగర వ్యాపారి ఫోన్ నెంబర్ సంగ్రహించిన సైబర్ నేరగాళ్లు ఆయన ఉత్పత్తులకు ఉత్తరాదిలో మార్కెటింగ్ చేస్తామని నమ్మించారు. దీనికోసం తమ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకుని, దేశ, విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నట్లు నకిలీ ఈ–మెయిల్స్ సృష్టించారు. సరుకు సరఫరాకు ముందు తమకు రూ.9.5 లక్షల చెల్లించాలని చెప్పిన సైబర్ నేరగాళ్లు ఆ మొత్తం తమ ఖాతాల్లో వేయించుకుని మోసం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నమోదైన కేసును ఏసీపీ ఆర్‌జీ శివమారుతి పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ కె.ప్రసాద్‌రావు దర్యాప్తు చేశారు. కీలక నిందితులు అమర్‌నాథ్ సింగ్, రణ్‌వీర్ సింగ్‌లను అరెస్టు చేసి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఆ ఇద్దరూ బాధితుడి నుంచి కాజేసిన మొత్తం తిరిగి ఇచ్చేందుకు అంగీకరించారు. దీనికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్‌ను పోలీసుల ద్వారా బాధితుడికి అందజేశారు.