సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ సీటీసీ మాల్‌లో నిబంధనలకు విరుద్ధంగా వాహనానికి పార్కింగ్ ఫీజు వసూలు చేసినందుకు పార్కింగ్ ఏజెన్సీకి జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం విభా గం రూ.50 వేల పెనాల్టీ విధించింది. ఈ మేరకు ఈ–చలానా జారీ చేసింది. నగర పౌరుని నుంచి అందిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన ఈవీడీఎంలోని సీఈసీ విభాగం అక్రమ వసూలు నిర్ధారించడంతో పెనాల్టీ విధించింది.
కార్మికుల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి
మణికొండ: పనిచేస్తున్న ప్రదేశంలో ఇద్దరు కార్మికుల మధ్య చెలరేగిన వివాదం హత్యకు దారితీసింది. తలపై ఇనుప రాడ్‌తో కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కోకాపేటలో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పశ్చిమబెంగాల్‌కు చెందిన నయన్ పహారియా(24), రూబెల్ షేక్‌లు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి ప్రెస్టీజ్ నిర్మాణ సంస్థలో కార్మికులుగా పనిచేస్తున్నారు. ప్రతి రోజు మాదిరిగానే గురువారం ఇద్దరూ 10వ అంతస్తులో పనిచేస్తున్నారు. అదే క్రమంలో వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగి వివాదంగా మారింది. ఈ క్రమంలో రూబెల్ షేక్ పక్కనే ఉన్న రాడ్‌తో నయన్ పహారియాను తలపై బలంగా కొట్టగా..తల పగిలి తీవ్ర రక్తస్త్రావం అయి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు 100కు ఫోన్ చేసి విషయం చెప్పటంతో విషయం నార్సింగి పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.