
హైదరాబాద్: ఉరి వేసుకుని ఆత్మహత్యా యత్నం చేసిన రాయపూరి పూజ(16) అవయవాలను కుటుంబసభ్యులు దానం చేశారు. నిమ్స్ వైద్యులు బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేయడంతో ఆమె కుటుంబసభ్యులు అవయవదానం చేశారని జీవన్‌దాన్ ప్రతినిధులు సోమవారం ఒక ప్రకనలో తెలిపారు. వరంగల్ జిల్లా తీగరాజుపల్లికి చెందిన పూజ ఇంటర్మీడియెట్ చదువుతోంది.
ఈ నెల 18న ఆమె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడించింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం నిమ్స్‌కు తరలించారు. ఎమర్జెన్సీ విభాగంలో వైద్యులు సేవలందించారు.
అయినా ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో బ్రెయిన్ డెత్‌గా నిర్ధారించారు. దీంతో అవయవ దానం పట్ల జీవన్ దాన్ కోఆర్డినేటర్ అవగాహన కల్పించడంతో పూజ అవయవాలను దానం చేసేందుకు ఆమె కుటుంబసభ్యులు ముందుకు వచ్చారు. దీంతో రెండు కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, కార్నియాస్‌ను జీవన్ దాన్‌కు దానం చేశారు.