హన్మకొండ: టీజీ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ (ట్రాన్స్‌కో) వరంగల్ జోన్ కార్యాలయంలో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఉన్నతాధికారులను బెదిరించి బలవంతంగా ఉత్తర్వులు మార్పించడాన్ని ట్రాన్స్ కో యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంది. ఒకే తేదీతో ఇద్దరు డీఈలకు ఇన్‌చార్జ్ బాధ్యతలు ఇవ్వడం, ఇన్‌చార్జ్ బాధ్యతల ఉత్తర్వులు పొందడంలో జరిగిన దౌర్జన్యంపై సోమవారం ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ నుంచి హనుమకొండలోని టీజీ ట్రాన్స్‌కో వరంగల్ జోన్ కార్యాలయానికి విజిలెన్స్ అధికారులు చేరుకుని జరిగిన ఘటన, దౌర్జన్యం, ఇన్‌చార్జ్ ఉత్తర్వుల జారీపై రోజంతా వివరాలు సేకరించారు. విజిలెన్స్ నివేదిక అనంతరం పూర్తిస్థాయిలో శాఖాపరమైన విచారణ చేపట్టనున్నారు.
ఏం జరిగిందంటే..
ట్రాన్స్‌కో వరంగల్ జోన్ కార్యాలయంలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ జనగామ డీఈగా పని చేస్తున్న ఐ.సుదాకర్‌రావు ఈనెల 5 నుంచి 19 వరకు సెలవులో వెళ్లారు. ఈవిభాగంలో పాలనాపరమైన కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా జాప్యం కాకుండా ఉండేందుకు ఈనెల 10న వరంగల్ ఎంఆర్‌టీ అండ్ ట్రాన్స్‌ఫార్మర్ డీఈ టి.రాజుకు ట్రాన్స్‌కో చీఫ్ ఇంజనీర్ మురళీసాగర్ అదనపు బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు చేపట్టిన టి.రాజు సజావుగా విధులు నిర్వహిస్తుండగా.. ఈనెల 18న వరంగల్ కన్‌స్ట్రక్షన్ డీఈ ఎల్.సంపతిరావు తనపై దౌర్జన్యం చేసి బలవంతంగా పాత (10వ) తేదీతో టి.రాజుకు అప్పగించిన బాధ్యతలు రద్దు చేస్తూ, తనకు అదనపు బాధ్యతలు ఇస్తున్నట్లు దొత్తిడి తీసుకొచ్చి ఉత్తర్వులు ఇప్పించుకున్నారని వరంగల్ జోన్ చీఫ్ ఇంజనీర్ మురళీసాగర్ టీజీ ట్రాన్స్‌కో గ్రిడ్ ఆపరేషన్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇద్దరు డీఈలకు ఈ నెల 10వ తేదీతో అదనపు బాధ్యతలు అప్పగించినట్లు మెమోలు జారీ అయ్యాయి.
ఆంతర్యమేంటి?
విచిత్రమేంటంటే జనగామ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ డీఈ ఐ.సుధాకర్‌రావు ఈ నెల 19వ తేదీ వరకు సెలవు పెట్టారు. అయితే ఈనెల 18న అంటే ఒక రోజు ముందుగా బలవంతంగా ఎల్.సంపతిరావు అదనపు బాధ్యతలు పొందడంలోని ఆంతర్యమేంటని ట్రాన్స్ కో ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అప్పటికే అదనపు బాధ్యతలు చేపట్టిన టి.రాజు పాలనాపరమైన ఫైళ్లపై సంతకాలు చేయడం, కార్యకలాపాలు కొనసాగడం జరిగాయి. ఈనెల 18న పాత (10వ) తేదీతో అదనపు బాధ్యతలు పొందిన డీఈ గతంలో జరిగిన కార్యకలాపాలు ఎలా మేనేజ్ చేస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇద్దరికి అదనపు బాధ్యతలు వివాదంగా మారాయి. 15 రోజుల అదనపు బాధ్యతలపై ఇంజనీర్స్ పరువు తీసుకుంటున్నారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ మొత్తం ఘటనను యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంది.
ఒకే తేదీతో ఇద్దరికి ఇన్‌చార్జ్ బాధ్యతలు
సెలవుపై వెళ్లిన డీఈ స్థానంలో మరో విభాగం డీఈకి అదనపు బాధ్యతలు
జూనియర్‌కు ఎలా ఇస్తారని బాధ్యతలు పొందిన మరో డీఈ
దౌర్జన్యంగా బాధ్యతలు తీసుకున్నారని ఫిర్యాదు
విజిలెన్స్ అధికారుల విచారణ


