కాశిబుగ్గ: వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తూ అధికారులను ఆదేశించారు. సోమవారం వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ వాణి, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె వైద్య, ఆరోగ్యశాఖకు సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే, హాస్పిటల్ పనుల పురోగతిని పరిశీలించారు. అందుబాటులోకి రానున్న వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు, తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అలాగే, నిర్మాణ పనుల్లో నాణ్యత పాటిస్తూ, నిర్దేశిత గడువులోగా పూర్తిచేసేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.
ఎంజీఎంలో ఆరోగ్యశ్రీ వార్డు పరిశీలన..
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డును ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తూ పరిశీలించారు. ఆదివారం ఈ వార్డులో ఉన్న పలువురు పేషంట్లు, అటెండెంట్లపై సీలింగ్ పెచ్చులు ఊడిన విషయం విదితమే. దీంతో నేరుగా తెలుసుకోవడానికి వార్డుకు వచ్చారు. లోపలికి మీడియాను, ఇతర అధికారులను అనుమతించకుండా జరిగిన సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. ఆమె వెంట డీఎంఈ డాక్టర్ వాణి, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ రాంకుమార్‌రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.
వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ
ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తూ


