కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ) విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాము నియమితులయ్యారు. ఈమేరకు కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు బీఓఎస్‌గా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ సుమలత నుంచి రాము బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన కొత్తగూడెం డాక్టర్ మన్‌మోహన్ ఎర్త్ యూనివర్సిటీలో (మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాలలో) విధులు నిర్వర్తిస్తున్నారు.
హన్మకొండ: విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ ఎస్‌ఈ ఎ.ఆనందం తెలిపారు. శనివారం వరంగల్‌లోని ఆజంజాహి మిల్స్ సబ్‌స్టేషన్‌లో రెండు 33 కేవీ బ్రేకర్లను ఆయన చార్జ్ చేశారు. ఈసందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ ఈ బ్రేకర్ల ద్వారా 12.5 ఎంవీఏ, 8 ఎంవీఏ పవర్ ట్రాన్‌న్స్‌ఫార్మర్లను సురక్షితంగా, సమర్థవంతంగా నియంత్రించేందుకు వీలు కలుగుతుందన్నారు. ఎన్పీడీసీఎల్ వరంగల్ టౌన్ డీఈ మల్లికార్జున్, ఏడీఈ కిశోర్, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.
కాజీపేట రూరల్: కాజీపేట మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ శనివారం తెలిపారు. ఈనెల 14న సికింద్రాబాద్–సిర్‌పూర్‌కాగజ్‌నగర్ (07035) వెళ్లే ఎక్స్‌ప్రెస్ కాజీపేటకు 14–23 గంటలకు చేరుకొని వెళ్తుంది. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో సిర్‌పూర్‌కాగజ్‌నగర్–హైదరాబాద్ (07036) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌గా కాజీపేటకు 20–33 గంటలకు చేరుకొని వెళ్తుంది. ఏసీ కార్ అండ్ అన్ రిజర్వుడ్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో ప్రయాణించే ఈ రెండు రైళ్లకు సికింద్రాబాద్, చర్లపల్లి, భువనగిరి, జనగామ, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసీఫాబాద్‌లో హాల్టింగ్ కల్పించారు.
హన్మకొండ చౌరస్తా: తెలంగాణ ప్రదేశ్ ఆదివాసీ కాంగ్రెస్ కోఆర్డినేటర్ పూనమ్ చంద్రకళ దొర సూచనల మేరకు హనుమకొండ జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ పదవి కోసం అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల వారు జత చేసిన పీడీఎఫ్ ఫాంను డౌన్‌న్‌లోడ్ చేసుకొని, పూర్తిగా నింపి ఈనెల 16లోపు హనుమకొండ డీసీసీ ఆఫీస్‌లో అందజేయాలని ఆయన కోరారు.
కేయూ క్యాంపస్: ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న రచించిన 25 సంవత్సరాల ఏపూరి పాటల ప్రవాహం పుస్తకాన్ని శనివారం కాకతీయ యూనివర్సిటీలోని సెనేట్‌హాల్‌లో రిజిస్ట్రార్ రామచంద్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సోమన్న సామాజిక స్పృహ, ఉద్యమ స్ఫూర్తి పాటలతో ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారని కొనియాడారు. ఏపూరి సోమన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను గౌరవించాలని, కళాకారులకు కార్పొరేషన్ ఏర్పాటుచేసి నిధులు కేటాయించాలని కోరారు. కేయూ పాలక మండలిసభ్యులు డాక్టర్ చిర్ర రాజు గౌడ్, అధ్యాపకులు డాక్టర్ సంకినేని వెంకట్, బరిగెల బాబు, ఉమ్మడి జిల్లా కళాకారులు దార దేవేందర్, జూపాక శివ, మైసన్న, సునీల్, విద్యార్థి సంఘాల బాధ్యులు బొట్ల మనోహర్, మంద నరేశ్ తదితరులు పాల్గొన్నారు.


