హన్మకొండ చౌరస్తా: హనుమకొండలోని పింజర్ల వీధిలోని శ్రీ రాజ రాజ నరేంద్ర ఆంధ్రా భాషా నిలయంలో ‘నెల నెలా సాహిత్య సంగోష్టి’ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీరాజరాజనరేంద్ర ఆంధ్ర భాషా నిలయం, జాతీయ సాహిత్య పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి తిరుమల తిరుపతి సంరక్షణ సమితి పూర్వ రాష్ట్ర కార్యదర్శి సౌమిత్రి లక్ష్మణాచార్య అధ్యక్షత వహించారు. ప్రముఖ విద్యావేత్త దహగం సాంబమూర్తి ముఖ్య అతిథిగా హాజరై భగవద్గీతపై ప్రసంగించారు. విశ్రాంత ఉద్యోగులచే రచించబడిన ‘శ్రీ రామాయణం’ ‘భగవద్గీత’ విశిష్ట గ్రంథాల పరిచయ కార్యక్రమం ఈ సంగోష్టిలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భగవద్గీత గ్రంథ పరిచయకర్త పుల్లారెడ్డి గ్రంథంలోని విశేషాలను, ఆధ్యాత్మిక విశిష్టతను శ్రోతలకు వివరించారు. మోహన మురళి సంస్కృతంలో రచించిన భగవద్గీతపై సంస్కృత భారతి అధ్యక్షుడు ప్యాట శ్రీనివాస్ ప్రసంగించారు. జాతీయ సాహిత్య పరిషత్ ,హనుమకొండ ప్రధాన కార్యదర్శి తాడిచర్ల రవి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, దాస్యం రామానుజం, రాచకట్ల లక్ష్మణ సుధాకర్, స్థానిక కవులు, రచయితలు పాల్గొన్నారు.


