హన్మకొండ: ఉద్యానశాఖను ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాల పునర్విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా హనుమకొండ, ములుగు జిల్లాలకు జిల్లా ఉద్యాన అధికారి పోస్టులు మంజూరు కాలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 78 మండలాలకు కేవలం 17 మంది ఉద్యాన అధికారులు (హెచ్‌ఓలు) మాత్రమే ఉన్నారు. దీంతో రైతులకు సరైన సమయంలో అవసరమైన సలహాలు ఇచ్చే వారు కరువయ్యారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఉద్యాన శాఖ, సూక్ష్మ సేద్యపు ప్రాజెక్టులు వేర్వేరుగా కొనసాగాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ రెండింటినీ ఉద్యాన శాఖ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. జిల్లాల పునర్విభజన తర్వాత పట్టు పరిశ్రమ శాఖను ఉద్యానశాఖలో విలీనం చేసింది. ఉద్యోగుల రిటైర్మెంట్ మినహా కొత్తగా నియామకాలు లేవు.
89,161 ఎకరాల్లో ఉద్యాన పంటలు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 89,161 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వరికి ప్రత్యమ్నాయంగా ఉద్యానపంటల సాగు విస్తీర్ణం పెంచాలని ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో ఉన్న ఉద్యాన అధికారులపై మరింత పనిభారం పెరుగుతోంది. రాష్ట్రంలో ములుగు, హనుమకొండ జిల్లాలకు జిల్లా ఉద్యానశాఖ అధికారి పోస్టు మంజూరు కాలేదు. ఖమ్మం జిల్లాకు చెందిన హార్టికల్చర్ ఏడీ ములుగు జిల్లా అధికారిగా, వరంగల్ జిల్లా సూక్ష్మసేద్య ప్రాజెక్టు అసిస్టెంట్ డైరెక్టర్ హనుమకొండ జిల్లా ఉద్యాన అధికారిగా కొనసాగుతున్నారు. ఉద్యాన పంటల సాగు విస్తరిస్తున్నప్పటికీ అందుకు అనుగుణంగా అధికారులు, సిబ్బందిని నియమించకపోవడంతో ఉన్నవారిపైనే అదనపు భారం పడుతోంది. ఒక్కో ఉద్యాన అధికారికి 3 నుంచి 6 మండలాల బాధ్యతలు అప్పగించారు. హనుమకొండ జిల్లాలో 14 మండలాలకు ఇద్దరు, వరంగల్ జిల్లాలో 13 మండలాలకు ఐదుగురు ఉద్యాన శాఖ అధికారులున్నారు. కాగా, ఉద్యాన శాఖలో పనిచేస్తున్న హెచ్‌ఓలకు 30 ఏళ్లుగా పదోన్నతులు లేకపోవడం మరో సమస్యగా మారింది. దీంతో చాలా మంది పదోన్నతి పొందకుండానే రిటైర్డ్ అవుతున్నారని పలువురు హెచ్‌ఓలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సిబ్బంది కొరతతో రైతులకు సలహాలిచ్చే వారు కరువు
హనుమకొండ, ములుగుకు మంజూరుకాని జిల్లా అధికారి పోస్టు


