సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్
డాక్టర్ కె.నారాయణ
ఖిలా వరంగల్: శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నల్సార్ విద్యార్థులపై చర్య అప్రజాస్వామి కమని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ అన్నారు. విద్యార్థుల నిరసనను అడ్డుకోవడానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) ఎవరని, విద్యార్థులను లాయర్లుగా నమోదు చేసుకోవద్దని ఆదేశించడం, వారిని బెదిరించడం వంటి చర్యలు పూర్తి ఆప్రజాస్వామికమని పేర్కొన్నారు. వారం రోజులపాటు వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగిన సీపీఐ పాదయాత్ర శుక్రవారం నగరంలోని శివనగర్‌లోని సీసీఐ తమ్మెర భవనంలో ముగిసింది. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ బాష్‌మియా అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో నారాయణ మాట్లాడారు. యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆహ్వానించవద్దని విద్యార్థులు వీసీకి విజ్ఞప్తి చేయడం వారి నిరసనలో భాగమన్నారు. కేంద్రం రైళ్లు రద్దు చేసినా సెప్టెంబర్ 1న ఢిల్లీ రాంలీల మైదానంలో జరపతలపెట్టిన ధర్నాతో అక్కడి వీధులన్నీ దద్దరిల్లడం ఖాయమన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, రాష్ట్ర నేతలు జ్యోతి, భిక్షపతి, వెంకట్రాములు, మేకల రవి, పంజాల రమేశ్, వలీ ఉల్లాఖాద్రి పాల్గొన్నారు.
కాళోజీ కళాక్షేత్రం సందర్శన
హన్మకొండ అర్బన్: హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రాన్ని డాక్టర్ కె.నారాయణ సందర్శించారు. కాళోజీ దుస్తులు, ఆయన రచించిన కవితల పుస్తకాలను పరిశీలించారు. అనంతరం కాళోజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.


